శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట
కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో 408 హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకిచ్చింది. ఈ లీజు మంజూరులో అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.ఆమెను 5వ నిందితురాలిగా చేర్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్‌రావు గురువారం తీర్పు వెలువరించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకానికి పాల్పడారనేందుకు ప్రాథమిక ఆధారాలేమీ లేవని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసును విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 కింద నమోదు చేసిన కేసును మాత్రం కొట్టివేసేందుకు నిరాకరించారు. ఈ సెక్షన్ కింద నమోదు చేసిన అభియోగాలు మినహా.. మిగతా సెక్షన్ల కింది కేసుల్లో ఏవైనా అభియోగాలు నమోదు చేసి ఉంటే అవేవీ చెల్లవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.