జెట్టి శ్రీలక్ష్మి
ఒంగోలు సబర్బన్: దివంగత న్యాయవాది జెట్టి ప్రభాకరరెడ్డి సతీమణి జెట్టి శ్రీలక్ష్మి (54) గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. జయరాం సెంటర్లోని శ్రీగిరి అపార్టుమెంట్స్‌లో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇది గమనించిన కుటుంబీకులు, స్థానికులు శ్రీలక్ష్మి సంబంధీకులకు సమాచారం అందించారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహాన్ని కిందకు దించి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 2017 నవంబర్ 12న ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యులు విజయవాడ కృష్ణానగర్ ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఘాట్‌లో బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. అప్పట్లో మృతి చెందిన వారిలో శ్రీలక్ష్మి భర్త జెట్టి ప్రభాకరరెడ్డి కూడా ఉన్నారు.
కార్తీకమాసంలో విహారయాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో 18 మంది మృతి చెందటంతో విషాదయాత్రగా మిగిలిపోయింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు శ్రీలక్ష్మి బోటులో వెళ్లకుండా అప్పట్లో ఒడ్డునే ఆగిపోయారు. అప్పుడు జరిగిన ప్రమాదంతో శ్రీలక్ష్మి కుటుంబం విలవిల్లాడింది. అప్పటి నుంచి భర్త మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీలక్ష్మి మనోవేదనతో కుంగిపోసాగింది. అప్పటికి వారి కుమార్తెలు ఎంతో సముదాయిస్తూ వచ్చారు. అయినా భర్త తోడు లేకపోవడం ఆమె మనోవేదన గురవుతూ వచ్చింది. చివరకు ఆయన లేని జీవితం వృథా అనుకుందో.. ఏమో.. చివరకు బలవన్మరణానికి పూనుకుంది. జెట్టి శ్రీలక్ష్మి దంపతులకు సంతానం లేదు. అయినా ప్రభాకరరెడ్డి రక్తసంబంధీకులకు చెందిన ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్నారు. వాళ్లిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వారికి వివాహాలు కూడా చేసి స్థిరపరిచారు. ఒక కుమార్తె అమెరికాలో స్థిరపడగా, రెండో కుమార్తె బెంగుళూరులో స్థిరపడింది. ఇటీవలే కుమార్తెలు వచ్చి దగ్గరుండి మరీ సపర్యలు కూడా చేశారని బంధువుల నోట వస్తున్న మాటలు. తల్లికి ఎంతో ధైర్యం చెప్పారు. అవేమీ ఆమెలో మనోస్థైర్యం నింపలేదు. చివరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి భర్త చెంతకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment