దాల్మియాపై చార్జిషీట్‌లో సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో రెండు వారాలపాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టు మంగళవారం సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కడప జిల్లాలో సున్నపురాయి గనుల లీజు కేటాయింపులకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయడంతోపాటు ఈ కేసులో తదుపరి చర్యల్ని నిలిపేయాలంటూ దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ జైశ్వాల్ మంగళవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లీజు బదలాయింపులు నిబంధనల మేరకే జరిగాయన్నారు. సీబీఐ చేసిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాలు చూపలేదన్నారు. పిటిషనర్ కేవలం కంపెనీ ఎండీ మాత్రమేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
అభియోగాల నమోదు ప్రక్రియ ఆపండి
Published Wed, Jun 22 2016 2:05 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement