Damage to crops
-
రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియూ ఇవ్వాలి
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి - వైఎస్సార్సీపీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్ మంకమ్మతోట : అకాలవర్షాలు, వడగళ్లవానతో పంటలు నష్టపోయి బలన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్ కోరారు. సోమవారం కరీంనగర్ వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులను సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పరామర్శించకపోవడం రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ చర్యలు లేకపోవడంతో రైతుల పక్షాన వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులను ఆదుకోవడంతోపాటు పశు సంపదను రక్షించుకునేందుకు పశుగ్రాసం సరఫరా చేయూలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన చెరువుల పూడికతీత గొప్ప కార్యక్రమని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయూలని కోరారు. డబుల్ బెడ్రూమ్ప్లాట్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ప్రారంభించాలని కోరారు. వార్డు సభ్యులకు సైతం గౌరవవేతనం ఇవ్వాలని కోరారు. చిన్న చిన్నవాటిపై అతిగా స్పందిస్తున్న చంద్రబాబు టీడీపీ హయాంలో అసలు చేసిందేమి లేదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా చంద్రబాబు చెప్పుకుంటున్న టీడీపీ రానున్న రోజుల్లో కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్కౌంటర్ పేరిట చంద్రబాబు కూలీలను పొట్టపెట్టుకున్నారని, అది చాలక హత్యలు చేయిస్తూ రక్తపిశాసిలా మారారని ఆరోపించారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థలను ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి సహాయ పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి జైపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు మోకెనపెల్లి రాజమ్మ, బోగె పద్మ, కాసారపు కిరణ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సలీం, జిల్లా అధికార ప్రతినిధి గండి శ్యామ్, సేవాదళ్ విభాగం జిల్లా అధ్యక్షుడు దీటి సుధాకర్‌రావు, హలీమొద్దీన్ ఫాహద్ సోనూ పాల్గొన్నారు. -
మూడో రోజూ ముంచెత్తిన వాన
రెండు అల్పపీడన ద్రోణులతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పదేళ్ల తర్వాత కీలకమైన ఎండాకాలంలో ఈ పరిస్థితి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు 59 వేల హెక్టార్లలో పంటలకు నష్టం రూ.400 కోట్ల మేర నష్టం ఉండొచ్చంటున్న ప్రభుత్వ వర్గాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. ఇక మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్లే.. ఏప్రిల్‌లో భారీ వర్షాలు కురవడం చర్చనీయాంశమైంది. వేసవిలో ఉరుములు, వడగళ్ల వాన కురవడం సాధారణమైనా.. ఎడతెరిపి లేకుండా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఒక అల్పపీడన ద్రోణి, లక్షద్వీప్ నుంచి గుజరాత్ వరకు కర్ణాటక మీదుగా మరో అల్పపీడన ద్రోణి ఏర్పడ్డాయని... వీటి మూలంగా ‘ఆల్ట్రోస్ట్రాటస్’ పేరుగల దట్టమైన మేఘాలు ఏర్పడి, వర్షాలు కురుస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడుతూ, మళ్లీ ఎండలు కాస్తూ ఉంటాయని.. అదే ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్ల కొద్దిరోజుల పాటు నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. మారిపోయిన పరిస్థితి.. వాతావరణం గంట గంటకూ మారుతోంది. వాతావరణ శాస్త్రవేత్తలు ఉదయం ఒక అంశాన్ని నిర్ధారిస్తే.. సాయంత్రానికి ఆ పరిస్థితి మారిపోతోంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రతినిధి నర్సింహారావు ‘సాక్షి’కి చెప్పారు. కామారెడ్డిలో కుండపోత.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 11 సెంటీమీటర్ల వర్షం పడింది. కొన్నిచోట్ల అరకిలో మేర వడగళ్లు పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో అనేకచోట్ల భారీ చెట్లు కూడా నేలకూలాయి. పంట పొలాలు, మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి. భారీగా నష్టం:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం నాటికి వేసిన అంచనా ప్రకారం... 34,216 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర పంటలు ధ్వంసమైనట్లు వ్యవసాయశాఖ అదనపు డెరైక్టర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 15,125 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరి 20,724 హెక్టార్లలో, మొక్కజొన్న 1,466 హెక్టార్లలో, నువ్వులు 7,807 హెక్టార్లలో, సజ్జ 3,235 హెక్టార్లలో, జొన్న 933 హెక్టార్లలో, పెసర 51 హెక్టార్లలో నష్టపోయినట్లు తెలిపారు. ఇక 25 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని ఆ శాఖ ఉన్నతాధికారి చెప్పారు. మొత్తంగా వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం రూ.400 కోట్ల మేర ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పంటలకు జరిగిన నష్టం (హెక్టార్లలో..) జిల్లా నష్టం కరీంనగర్ 15,125 నిజామాబాద్ 7,039 నల్లగొండ 6,446 ఆదిలాబాద్ 2,401 మహబూబ్‌నగర్ 1344 రంగారెడ్డి 763 మెదక్ 584 ఖమ్మం 434 వరంగల్ 78 మొత్తం 34,216 రాజధానిలో నలుగురు బలి సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం రాజధాని హైదరాబాద్‌లో 4 నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఉప్పుగూడ అరుంధతీ నగర్ కాలనీలోని ఓపెన్‌నాలాలో పడిపోయి సంజ య్(7) అనే బాలుడు మృతిచెందాడు. తుకారాంగేట్ వద్ద రైల్వే వరద కాల్వలో పడి గుర్తుతెలియని వ్యక్తి(50) మృత్యువాత పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. భారీ వర్షంతో తెగిపడిన విద్యుత్ తీగల కారణంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్లకు చెందిన కె.లక్ష్మణ్ రాజు(18), సోమరాజు(12) ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మియాపూర్ ఆల్విన్ కాలనీ వద్ద ఉన్న నాలాలో ఇనుప చువ్వలు ఏరుకుంటుండగా.. అక్కడ తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి వారు మరణించారు. ఇక హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 11 వరకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వరదనీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు ఈ వర్షాలతో నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాల్లో అర అడుగు మేర నీటిమట్టాలు పెరిగాయి. తడిసిన ధాన్యంపై హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యంపై మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మార్కెట్ యార్డులో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం, నకిరేకల్ మార్కెట్ యార్డులో 800 క్వింటాళ్ల ధాన్యం వర్షం వల్ల తడిసిపోయిందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మద్దతు ధరకు కొనేందుకు అంగీకరించిందని వెల్లడించారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా వాతావరణ శాఖ సూచనలను రైతులకు తెలపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇది తీరని నష్టం..: జానా 48 గంటల్లో ఆదుకోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: అకాలవర్షాల వల్ల రైతులకు తీరని నష్టం జరిగిందని, 48 గంటల్లోగా వారిని ఆదుకోవాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గత ఏడాది రబీలో తీవ్రమైన వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయన్నారు. ఈ ఏడాది కరువు ఉన్నా ఆశతో అప్పులు చేసి, సాగుచేసుకున్న పంటలు ఈ వర్షాలతో పూర్తిగా పాడైపోయాయని జానారెడ్డి వివరించారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టుగా రైతులు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉంటే ఈ అకాల వర్షాలు వారికి మరింతగా నష్టాన్ని తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా నష్టాన్ని అంచనావేసి, తక్షణ సాయం అందించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. -
పై-లీన్ ముంచేసింది
ప్రకృతి పగబట్టింది. జిల్లా రైతులను నిలువునా ముంచేసింది. నిన్న పై-లీన్ రూపంలో గాలి దుమారం రేపి ఉద్దానం ప్రాంతాన్ని కుదిపేసింది. ఇప్పుడు అల్పపీడనం రూపు దాల్చి వర్షాలు, వరదలతో ముంచెత్తుతోంది. నిన్న వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు కోల్పోయిన రైతులు.. నేడు లక్షల ఎకరాల్లో వరి, ఇతర ఆహార పంటలకు నీళ్లొదులుకోవాల్సిన దుస్థితి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊళ్లకు ఊళ్లు వరద ముట్టడిలో చిక్కుకున్నాయి. పంటపొలాలు మనిషెత్తు నీటిలో కనుమరుగై నదులను తలపిస్తున్నాయి. కల్వర్టులు, వంతెనల మీద నుంచి వరద నీరు పొంగిపొర్లుతూ రహదారులను దిగ్బంధించింది. ఫలితంగా పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 50 వేల హెక్టార్ల(1.25 లక్షల ఎకరాలు)లో వరి, మరో పది వేల హెక్టార్ల(25 వేల ఎకరాలు)లో ఇతర ఆహార, వాణిజ్య పంటలు నీటిపాలయ్యాయి. సుమారు 80 గ్రామాలు జలదగ్బంధంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోవడమో.. దెబ్బతినడమో జరిగింది. పట్టణ, గ్రామాణ ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాల్లోకి నీరు చేరి జనానికి నిలువ నీడ లేకుండా చేసింది. -వార్తలు, ఫొటోలు.. 2, 8, 9, 10 పేజీల్లో... సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, కంది, ఉల్లి పంటలు చేతికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సుమారు 50 వేల హెక్టార్లలో వరిపంట పనికిరాకుండా పోయి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదేశాల మేరకు పంటల పరిస్థితిని పరిశీలించి నష్టం వివరాలు సేకరించేందుకు రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు, ఉద్యోగులు బుధవారం రంగంలోకి దిగారు. ఇచ్ఛాపురం, పలా స నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరటంతో జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పైలీన్ తుపానువల్ల దెబ్బతిన్న అనేక పూరిళ్లు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. కొన్నిచోట్ల పక్కా ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 1200 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని లోతట్టు ప్రాంతాల వరి చేలల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. నీరు తగ్గేకొద్దీ చేలంతా పడిపోయే అవకాశం ఉంది. వాడాడ, జొన్నలపాడు తదితర ప్రాంతాల్లో 1500 ఎకరాల్లో వరి చేలు పడిపోయింది. నాగావళి, వంశధార నదులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పొలాల గట్లు తెగిపోయాయి. శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి, బలివాడ తదితర ప్రాంతాల్లో వరి పంట పడిపోయింది. సుమారు 2 వేల ఎకరాల్లో పడిపోయినట్టు రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న పంటకు నష్టం తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని వీధుల న్నీ జలమయమయ్యాయి. పీఎన్ కాలనీ లోపలికి వెళ్లేందుకు వీలులేకుండా నీరు నిలబడిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. పలాస మండలంలో కంబిరిగాం బ్రిడ్జి మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కేదారిపురం, గంగువాడ, చినంచల, పెదంచల తదితర 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రాహ్మణతర్లా వద్ద వరహాలగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మొగిలిపాడు, ప్రకాశనగర్, ఇందిరాకాలనీ, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పలుచోట్ల పూరి గుడిసెలు కూలిపోయాయి. కొన్నిళ్ల గోడలు పడిపోయాయి. ప్రకాశనగర్కు చెందిన వీర్రాజు అనే కార్మికుని పూరిల్లు పూర్తిగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. హరిసాగరం నిండిపోవటంతో సర్ల్పస్వియర్ మీదుగా నీరు ప్రవహించి అల్లుకోల కాలనీలోకి చొచ్చుకుపోయింది. దీంతో పలు ఇళ్లు నీటమునిగాయి. మందస మండలం పుచ్చపాడు, వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మందస మండలంలోని చీపి గెడ్డ ఉప్పొంగడంతో పొత్తంగి, సిరిపురం, బుడారిసింగి, గౌడుగురంటి తదితర 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గెడ్డ పొంగిపొర్లడంతో మహదేవుపురం, గుల్లలపాడు, నగరంపల్లి, పొల్లాడ, బట్టుపాడు, లింగాల పాడు, బెండిసీతాపురం, కొండవూరు తదితర గ్రామాల్లో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగింది. చాలా చెరువులు నిండిపోవటంతో నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. ఇచ్ఛాపురంలో బహుదానది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 14.3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. రత్తకన్న గ్రామం వద్ద భీమసముద్రం గెడ్డ, ఇన్నీసుపేట వద్ద పద్మనాభపురం గెడ్డ పొంగి పోర్లడంతో వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగింది. నియోజవర్గంలో వెయ్యికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇచ్ఛాపురం పట్టణంలో కోటేరుబంద చెరువు నిండిపోవడంతో రెవెన్యు అధికారులు రోడ్డుకు గండికొట్టారు. పైలీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న మత్స్యకార గ్రామాలకు భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. గతంలో కొద్దిగా దెబ్బతిన్న ఇళ్లు ఇప్పుడు పూర్తిగా కూలిపోయాయి. ఇచ్ఛాపురం మండలంలోని ఇన్నీసుపేట, బోడ్డబడ గ్రామాలు జలదిద్బంధంలో చిక్కుకున్నాయి. ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలో సుమారు 4 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 3430 ఎకరాల్లో వరి, మిగిలిన విస్తీర్ణంలో మెక్కజొన్న, చెరకు, అరటి పంటలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలయిన తురకపేట, వీర మల్లిపేట, మూలసవళాపురం, సిందువాడ, విజయరాంపురం, కెజెపేట, పురుషోత్తపురం, పాలవలస, పెదవెంకటాపురం, సుబ్బపేట తదితర గ్రామాల్లో పంట నష్టాలు అధికంగా సంభవించాయి. ఆమదాలవలస, బూర్జ, పొందూరు మండలాల్లో వరి పంటకు కొంతమేర నష్టం వాటిల్లింది. నరసన్నపేట మండలంలోని 100 ఎకరాల్లో వరి పంట గాలికి వాలిపోయింది. పోలాకి మండలంలో సుమారు 200 ఎకరాల వర తంపర భూములు నీట మునిగాయి. జలుమూరులో 100, సారవకోటమండలంలో 150ఎకరాల్లో వరి చేలు వాలిపోయాయి. పాలకొండ వ్యవసాయ సబ్ డివిజన్లో వరి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, బూర్జ మండలాల్లోని వెయ్యి ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 500 ఎకరాల్లోని చెరుకు పంట నీటిలో ఉంది. వర్షాలు కొనసాగితే ఈ పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజాం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురవాం గ్రామంలోని నిర్వాసిత కాలనీని కొత్త చెరువు వరద నీరు ముంచెత్తింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజాం నగర పంచాయతీ పరిధి కొండంపేటలో గెదెశెట్టి పార్వతమ్మ ఇంటి గోడ కూలిపోయింది. అమరాం నుంచి రాజాం వచ్చే మార్గంలో వంతెనపై నుంచి గెడ్డ నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సంతకవిటి మండలం చిన్నయ్యపేట, మల్లయ్యపేట, హొంజరాం, చిత్తారిపురం తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. చెరకు, కూరగాయల పొలాల్లోకి నీరుచేరింది. సిరిపురం సమీపంలో వంతెన మీదుగా రెల్లిగెడ్డ నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండాకురిటిలో బైరవాని చెరువు చప్టా కొట్టుకుపోయింది. మల్లయ్యపేటలో బి.గోవిందరావుకు చెందిన పూరింటి గోడ కూలిపోయింది. రేగిడి మండలంలోని ఆకులకట్టలోవ గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వరి, చెరకు పంటలు నీట మునిగాయి. వంగర మండలంలో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కొన్నిచోట్ల వరి పంట నేలకొరిగింది. కొత్తూరు మండలంలో పత్తి పంటకు, ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లో కూరగాయల పంట లకు నష్టం వాటిల్లింది. మెళియాపుట్టి మండలంలో చాలాచోట్ల వరి చేలు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఎచ్చెర్ల మండలంలో కంది, బెండ, కాలీప్లవర్, మిరప పంటలు దెబ్బతిన్నాయి. లావేరు, రణస్థలం మండలాల్లో మొక్కజొన్న, పత్తి పంటలకు, జి. సిగడాంలో మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. నియోజకవర్గ వ్యాప్తంగా వరికి కొంతవరకు నష్టం జరిగింది. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోని చాలాచోట్ల వరి చేలు పూర్తిగా నేలకొరిగిపోగా అరటి చెట్లు విరిగిపోయాయి. కోటబొమ్మాళి మండలంలో పందిరి కూరగాయ మొక్కలు నేలకొరిగాయి. పొట్ట దశలో ఉన్న వరి చేలు విరిగిపోవడంతో ధాన్యం చేతికి చిక్కే అవకాశం లేకుండా పోయింది.