పై-లీన్ ముంచేసింది
Published Thu, Oct 24 2013 1:59 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ప్రకృతి పగబట్టింది. జిల్లా రైతులను నిలువునా ముంచేసింది. నిన్న పై-లీన్ రూపంలో గాలి దుమారం రేపి ఉద్దానం ప్రాంతాన్ని కుదిపేసింది. ఇప్పుడు అల్పపీడనం రూపు దాల్చి వర్షాలు, వరదలతో ముంచెత్తుతోంది. నిన్న వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు కోల్పోయిన రైతులు.. నేడు లక్షల ఎకరాల్లో వరి, ఇతర ఆహార పంటలకు నీళ్లొదులుకోవాల్సిన దుస్థితి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఊళ్లకు ఊళ్లు వరద ముట్టడిలో చిక్కుకున్నాయి. పంటపొలాలు మనిషెత్తు నీటిలో కనుమరుగై నదులను తలపిస్తున్నాయి.
కల్వర్టులు, వంతెనల మీద నుంచి వరద నీరు పొంగిపొర్లుతూ రహదారులను దిగ్బంధించింది. ఫలితంగా పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 50 వేల హెక్టార్ల(1.25 లక్షల ఎకరాలు)లో వరి, మరో పది వేల హెక్టార్ల(25 వేల ఎకరాలు)లో ఇతర ఆహార, వాణిజ్య పంటలు నీటిపాలయ్యాయి. సుమారు 80 గ్రామాలు జలదగ్బంధంలో చిక్కుకొని బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోవడమో.. దెబ్బతినడమో జరిగింది. పట్టణ, గ్రామాణ ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాల్లోకి నీరు చేరి జనానికి నిలువ నీడ లేకుండా చేసింది. -వార్తలు, ఫొటోలు.. 2, 8, 9, 10 పేజీల్లో...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, కంది, ఉల్లి పంటలు చేతికి రాకుండా పోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సుమారు 50 వేల హెక్టార్లలో వరిపంట పనికిరాకుండా పోయి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదేశాల మేరకు పంటల పరిస్థితిని పరిశీలించి నష్టం వివరాలు సేకరించేందుకు రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు, ఉద్యోగులు బుధవారం రంగంలోకి దిగారు. ఇచ్ఛాపురం, పలా స నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరటంతో జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. పైలీన్ తుపానువల్ల దెబ్బతిన్న అనేక పూరిళ్లు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. కొన్నిచోట్ల పక్కా ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 1200 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.
శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలోని లోతట్టు ప్రాంతాల వరి చేలల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. నీరు తగ్గేకొద్దీ చేలంతా పడిపోయే అవకాశం ఉంది. వాడాడ, జొన్నలపాడు తదితర ప్రాంతాల్లో 1500 ఎకరాల్లో వరి చేలు పడిపోయింది. నాగావళి, వంశధార నదులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పొలాల గట్లు తెగిపోయాయి. శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి, బలివాడ తదితర ప్రాంతాల్లో వరి పంట పడిపోయింది. సుమారు 2 వేల ఎకరాల్లో పడిపోయినట్టు రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న పంటకు నష్టం తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని వీధుల న్నీ జలమయమయ్యాయి. పీఎన్ కాలనీ లోపలికి వెళ్లేందుకు వీలులేకుండా నీరు నిలబడిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది.
పలాస మండలంలో కంబిరిగాం బ్రిడ్జి మీదుగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కేదారిపురం, గంగువాడ, చినంచల, పెదంచల తదితర 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రాహ్మణతర్లా వద్ద వరహాలగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మొగిలిపాడు, ప్రకాశనగర్, ఇందిరాకాలనీ, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పలుచోట్ల పూరి గుడిసెలు కూలిపోయాయి. కొన్నిళ్ల గోడలు పడిపోయాయి.
ప్రకాశనగర్‌కు చెందిన వీర్రాజు అనే కార్మికుని పూరిల్లు పూర్తిగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. హరిసాగరం నిండిపోవటంతో సర్ల్పస్‌వియర్ మీదుగా నీరు ప్రవహించి అల్లుకోల కాలనీలోకి చొచ్చుకుపోయింది. దీంతో పలు ఇళ్లు నీటమునిగాయి. మందస మండలం పుచ్చపాడు, వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మందస మండలంలోని చీపి గెడ్డ ఉప్పొంగడంతో పొత్తంగి, సిరిపురం, బుడారిసింగి, గౌడుగురంటి తదితర 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గెడ్డ పొంగిపొర్లడంతో మహదేవుపురం, గుల్లలపాడు, నగరంపల్లి, పొల్లాడ, బట్టుపాడు, లింగాల పాడు, బెండిసీతాపురం, కొండవూరు తదితర గ్రామాల్లో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి.
ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంట పూర్తిగా నీట మునిగింది. చాలా చెరువులు నిండిపోవటంతో నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. ఇచ్ఛాపురంలో బహుదానది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం 14.3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. రత్తకన్న గ్రామం వద్ద భీమసముద్రం గెడ్డ, ఇన్నీసుపేట వద్ద పద్మనాభపురం గెడ్డ పొంగి పోర్లడంతో వేలాది ఎకరాల్లో పంట నీటి మునిగింది. నియోజవర్గంలో వెయ్యికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇచ్ఛాపురం పట్టణంలో కోటేరుబంద చెరువు నిండిపోవడంతో రెవెన్యు అధికారులు రోడ్డుకు గండికొట్టారు. పైలీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న మత్స్యకార గ్రామాలకు భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. గతంలో కొద్దిగా దెబ్బతిన్న ఇళ్లు ఇప్పుడు పూర్తిగా కూలిపోయాయి. ఇచ్ఛాపురం మండలంలోని ఇన్నీసుపేట, బోడ్డబడ గ్రామాలు జలదిద్బంధంలో చిక్కుకున్నాయి.
ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలో సుమారు 4 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 3430 ఎకరాల్లో వరి, మిగిలిన విస్తీర్ణంలో మెక్కజొన్న, చెరకు, అరటి పంటలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలయిన తురకపేట, వీర మల్లిపేట, మూలసవళాపురం, సిందువాడ, విజయరాంపురం, కెజెపేట, పురుషోత్తపురం, పాలవలస, పెదవెంకటాపురం, సుబ్బపేట తదితర గ్రామాల్లో పంట నష్టాలు అధికంగా సంభవించాయి. ఆమదాలవలస, బూర్జ, పొందూరు మండలాల్లో వరి పంటకు కొంతమేర నష్టం వాటిల్లింది. నరసన్నపేట మండలంలోని 100 ఎకరాల్లో వరి పంట గాలికి వాలిపోయింది. పోలాకి మండలంలో సుమారు 200 ఎకరాల వర తంపర భూములు నీట మునిగాయి. జలుమూరులో 100, సారవకోటమండలంలో 150ఎకరాల్లో వరి చేలు వాలిపోయాయి.
పాలకొండ వ్యవసాయ సబ్ డివిజన్‌లో వరి, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, బూర్జ మండలాల్లోని వెయ్యి ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 500 ఎకరాల్లోని చెరుకు పంట నీటిలో ఉంది. వర్షాలు కొనసాగితే ఈ పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజాం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురవాం గ్రామంలోని నిర్వాసిత కాలనీని కొత్త చెరువు వరద నీరు ముంచెత్తింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజాం నగర పంచాయతీ పరిధి కొండంపేటలో గెదెశెట్టి పార్వతమ్మ ఇంటి గోడ కూలిపోయింది.
అమరాం నుంచి రాజాం వచ్చే మార్గంలో వంతెనపై నుంచి గెడ్డ నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సంతకవిటి మండలం చిన్నయ్యపేట, మల్లయ్యపేట, హొంజరాం, చిత్తారిపురం తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. చెరకు, కూరగాయల పొలాల్లోకి నీరుచేరింది. సిరిపురం సమీపంలో వంతెన మీదుగా రెల్లిగెడ్డ నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండాకురిటిలో బైరవాని చెరువు చప్టా కొట్టుకుపోయింది. మల్లయ్యపేటలో బి.గోవిందరావుకు చెందిన పూరింటి గోడ కూలిపోయింది. రేగిడి మండలంలోని ఆకులకట్టలోవ గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వరి, చెరకు పంటలు నీట మునిగాయి. వంగర మండలంలో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది.
పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కొన్నిచోట్ల వరి పంట నేలకొరిగింది. కొత్తూరు మండలంలో పత్తి పంటకు, ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లో కూరగాయల పంట లకు నష్టం వాటిల్లింది. మెళియాపుట్టి మండలంలో చాలాచోట్ల వరి చేలు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఎచ్చెర్ల మండలంలో కంది, బెండ, కాలీప్లవర్, మిరప పంటలు దెబ్బతిన్నాయి.
లావేరు, రణస్థలం మండలాల్లో మొక్కజొన్న, పత్తి పంటలకు, జి. సిగడాంలో మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. నియోజకవర్గ వ్యాప్తంగా వరికి కొంతవరకు నష్టం జరిగింది. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోని చాలాచోట్ల వరి చేలు పూర్తిగా నేలకొరిగిపోగా అరటి చెట్లు విరిగిపోయాయి. కోటబొమ్మాళి మండలంలో పందిరి కూరగాయ మొక్కలు నేలకొరిగాయి. పొట్ట దశలో ఉన్న వరి చేలు విరిగిపోవడంతో ధాన్యం చేతికి చిక్కే అవకాశం లేకుండా పోయింది.
Advertisement
Advertisement