మూడో రోజూ ముంచెత్తిన వాన | third day of the rain | Sakshi
Sakshi News home page

మూడో రోజూ ముంచెత్తిన వాన

Published Wed, Apr 15 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెంలో కల్లాల్లో తడిచిన మొక్కజొన్న

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెంలో కల్లాల్లో తడిచిన మొక్కజొన్న

రెండు అల్పపీడన ద్రోణులతో
 తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
పదేళ్ల తర్వాత కీలకమైన ఎండాకాలంలో ఈ పరిస్థితి
గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు
59 వేల హెక్టార్లలో పంటలకు నష్టం
రూ.400 కోట్ల మేర నష్టం ఉండొచ్చంటున్న ప్రభుత్వ వర్గాలు

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని  హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. ఇక మంగళవారం కూడా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది.

 ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్లే..
 ఏప్రిల్‌లో భారీ వర్షాలు కురవడం చర్చనీయాంశమైంది. వేసవిలో ఉరుములు, వడగళ్ల వాన కురవడం సాధారణమైనా.. ఎడతెరిపి లేకుండా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవడం అసాధారణమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు ఒక అల్పపీడన ద్రోణి, లక్షద్వీప్ నుంచి గుజరాత్ వరకు కర్ణాటక మీదుగా మరో అల్పపీడన ద్రోణి ఏర్పడ్డాయని... వీటి మూలంగా ‘ఆల్ట్రోస్ట్రాటస్’ పేరుగల దట్టమైన మేఘాలు ఏర్పడి,  వర్షాలు కురుస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షం పడుతూ, మళ్లీ ఎండలు కాస్తూ ఉంటాయని.. అదే ఆల్ట్రోస్ట్రాటస్ మేఘాల వల్ల కొద్దిరోజుల పాటు నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.  

 మారిపోయిన పరిస్థితి..
 వాతావరణం గంట గంటకూ మారుతోంది. వాతావరణ శాస్త్రవేత్తలు ఉదయం ఒక అంశాన్ని నిర్ధారిస్తే.. సాయంత్రానికి ఆ పరిస్థితి మారిపోతోంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రతినిధి నర్సింహారావు ‘సాక్షి’కి చెప్పారు.

 కామారెడ్డిలో కుండపోత..
 గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 11 సెంటీమీటర్ల వర్షం పడింది. కొన్నిచోట్ల అరకిలో మేర వడగళ్లు పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో అనేకచోట్ల భారీ చెట్లు కూడా నేలకూలాయి. పంట పొలాలు, మామిడి చెట్లు నేలమట్టమయ్యాయి.

 భారీగా నష్టం:రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం నాటికి వేసిన అంచనా ప్రకారం... 34,216 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర పంటలు ధ్వంసమైనట్లు వ్యవసాయశాఖ అదనపు డెరైక్టర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 15,125 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరి 20,724 హెక్టార్లలో, మొక్కజొన్న 1,466 హెక్టార్లలో, నువ్వులు 7,807 హెక్టార్లలో, సజ్జ 3,235 హెక్టార్లలో, జొన్న 933 హెక్టార్లలో, పెసర 51 హెక్టార్లలో నష్టపోయినట్లు తెలిపారు. ఇక 25 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని ఆ శాఖ ఉన్నతాధికారి చెప్పారు. మొత్తంగా వ్యవసాయ, ఉద్యానవన పంటల నష్టం రూ.400 కోట్ల మేర ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 పంటలకు జరిగిన నష్టం (హెక్టార్లలో..)
 
జిల్లా         నష్టం
 కరీంనగర్    15,125
 నిజామాబాద్    7,039
 నల్లగొండ    6,446
 ఆదిలాబాద్    2,401
 మహబూబ్‌నగర్    1344
 రంగారెడ్డి    763
 మెదక్    584
 ఖమ్మం    434
 వరంగల్    78
 మొత్తం    34,216

 
 రాజధానిలో నలుగురు బలి
 సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం రాజధాని హైదరాబాద్‌లో 4 నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఉప్పుగూడ అరుంధతీ నగర్ కాలనీలోని ఓపెన్‌నాలాలో పడిపోయి సంజ య్(7) అనే బాలుడు మృతిచెందాడు. తుకారాంగేట్ వద్ద రైల్వే వరద కాల్వలో పడి గుర్తుతెలియని వ్యక్తి(50) మృత్యువాత పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. భారీ వర్షంతో తెగిపడిన విద్యుత్ తీగల కారణంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్లకు చెందిన కె.లక్ష్మణ్ రాజు(18), సోమరాజు(12) ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మియాపూర్ ఆల్విన్ కాలనీ వద్ద ఉన్న నాలాలో ఇనుప చువ్వలు ఏరుకుంటుండగా.. అక్కడ తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి వారు మరణించారు. ఇక హైదరాబాద్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం 11 వరకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వరదనీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు ఈ వర్షాలతో నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాల్లో అర అడుగు మేర నీటిమట్టాలు పెరిగాయి.
 
 తడిసిన ధాన్యంపై  హరీశ్‌రావు సమీక్ష
 సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యంపై మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యం వల్ల రైతులకు కలిగే ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మార్కెట్ యార్డులో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం, నకిరేకల్ మార్కెట్ యార్డులో 800 క్వింటాళ్ల ధాన్యం వర్షం వల్ల తడిసిపోయిందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తడిచిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మద్దతు ధరకు కొనేందుకు అంగీకరించిందని వెల్లడించారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా వాతావరణ శాఖ సూచనలను రైతులకు తెలపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
 
 ఇది తీరని నష్టం..: జానా
 48 గంటల్లో ఆదుకోవాలని  డిమాండ్
 సాక్షి, హైదరాబాద్: అకాలవర్షాల వల్ల రైతులకు తీరని నష్టం జరిగిందని, 48 గంటల్లోగా వారిని ఆదుకోవాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. గత ఏడాది రబీలో తీవ్రమైన వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయన్నారు.  ఈ ఏడాది కరువు ఉన్నా ఆశతో అప్పులు చేసి, సాగుచేసుకున్న పంటలు ఈ వర్షాలతో పూర్తిగా పాడైపోయాయని జానారెడ్డి వివరించారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టుగా రైతులు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉంటే ఈ అకాల వర్షాలు వారికి మరింతగా నష్టాన్ని తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా నష్టాన్ని అంచనావేసి, తక్షణ సాయం అందించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement