Dandu Veeraiah
-
'బాబుకు సత్తా చూపిస్తాం'
శ్రీశైలం: షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై జాప్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి మాదిగల సత్తా తెలిసే రోజు వస్తదని, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక జలవనరుల శాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు ఎస్సీలపై ప్రేమ ఉంటే వర్గీకరణ చేపట్టి అన్ని ఉపకులాలు కోల్పోతున్న నష్టాన్ని పూడ్చాలని ఆయన అన్నారు. అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలోనైనా ఎస్సీ వర్గీకరణపై బిల్లు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలను చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దానియేల్, కె ప్రసాదరావు,టి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పెద్ద మాదిగ’ హామీని నిలబెట్టుకోవాలి
- దండు వీరయ్య మాదిగ డిమాండ్ ఒంగోలు సెంట్రల్ : ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్దమాదిగను అవుతానని చెప్పారన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు అనేక సార్లు ఢిల్లీ వెళ్లారని, అయినా ఎస్సీ వర్గీకరణపై చర్చించలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వర్గీకరణకు చట్టబద్ధత ఆలస్యం అవుతోందన్నారు. ఈ విషయంలో మాదిగ ప్రజా ప్రతినిధులు చంద్రబాబును నిలదీయాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి లాం డానియేలు మాదిగ, చాట్ల డానియేలు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి తాతపూడి ప్రభుదాస్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జాకబ్ పాల్ మాదిగ, మంటి ఆశీర్వాదం మాదిగ, ప్రకాశం జిల్లా ఇన్చార్జి జండ్రాజుపల్లి మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి సండ్రపాటి కాలే బు మాదిగ, పూనూరి నరేంద్ర మాదిగ పాల్గొన్నారు. -
పెద్ద మాదిగనవుతానంటూ చెప్పి ...
అనంతపురం : ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగను అవుతానంటూ చెప్పి మాదిగల ఓట్లతో గెలిచి... ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై చిన్న చూపు చూస్తున్నడని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంత వరకు ఎస్సీ వర్గీకరణపై బాబు ఎలాంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకమన్నారు. ఈ అంశంపై చర్చకు వెంటనే అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 27నుంచి దశల వారిగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈనెల 31నుంచి ఆగస్టు 3 వతేదీ వరకు అన్ని తహసీల్ధార్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఎమ్మార్పీస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీసీ అర్ దాస్, పెద్ద ఓబిలేసు, గంగాధర్, ఓబయ్య, జయరామ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
5న ఒంగోలులో ఎమ్మార్పీస్ రాష్ట్ర ప్రతినిధుల సభ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రతినిధుల సభ జనవరి 5న ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ వెల్లడించారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర 13 జిల్లాల ఎమ్మార్పీఎస్ నాయకులు, అనుబంధ సంఘాలైన మాదిగ ఉద్యోగుల సంఘం, మాదిగ విద్యార్థి విభాగం, అరుంధతీ మాదిగ మహిళా సమైక్య, మాదిగ యువ సమాఖ్యలతో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించనున్న చివరి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 డిసెంబర్ 10న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారన్నారు. అనంతరం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాష్ట్రపతి లేఖ రాశారన్నారు. ఈ లేఖతోనే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిందన్నారు. వర్గీకరణ సబబేనని కేంద్ర ప్రభుత్వానికి కమీషన్ నివేదిక సమర్పించిందన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎన్నికల మానిఫెస్టోలో చేర్చిందని, రాజశేఖరరెడ్డి మరణంతో వర్గీకరణ ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు. ఐదేళ్లుగా వర్గీకరణ అంశాన్ని పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాదిగలు, ఉపకులాలకు ద్రోహం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని మాదిగ జాతికి తీరని ద్రోహం చేస్తున్నాయన్నారు. వ్యక్తిగత రాజకీయ కారణాలతో కొందరు నాయకులు మాదిగల ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. బ డ్జెట్ కేటాయించి కులవృత్తులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరువీధుల బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జండ్రాజుపల్లి ఆంజనేయులు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలపర్తి సంతోష్ మాదిగ, నగర అధ్యక్షుడు మందా సుధాకర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.