ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రతినిధుల సభ జనవరి 5న ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ వెల్లడించారు. స్థానిక అంబేద్కర్ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర 13 జిల్లాల ఎమ్మార్పీఎస్ నాయకులు, అనుబంధ సంఘాలైన మాదిగ ఉద్యోగుల సంఘం, మాదిగ విద్యార్థి విభాగం, అరుంధతీ మాదిగ మహిళా సమైక్య, మాదిగ యువ సమాఖ్యలతో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించనున్న చివరి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 డిసెంబర్ 10న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారన్నారు. అనంతరం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాష్ట్రపతి లేఖ రాశారన్నారు. ఈ లేఖతోనే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిందన్నారు.
వర్గీకరణ సబబేనని కేంద్ర ప్రభుత్వానికి కమీషన్ నివేదిక సమర్పించిందన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎన్నికల మానిఫెస్టోలో చేర్చిందని, రాజశేఖరరెడ్డి మరణంతో వర్గీకరణ ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు. ఐదేళ్లుగా వర్గీకరణ అంశాన్ని పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాదిగలు, ఉపకులాలకు ద్రోహం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని మాదిగ జాతికి తీరని ద్రోహం చేస్తున్నాయన్నారు. వ్యక్తిగత రాజకీయ కారణాలతో కొందరు నాయకులు మాదిగల ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. బ డ్జెట్ కేటాయించి కులవృత్తులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరువీధుల బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జండ్రాజుపల్లి ఆంజనేయులు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలపర్తి సంతోష్ మాదిగ, నగర అధ్యక్షుడు మందా సుధాకర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
5న ఒంగోలులో ఎమ్మార్పీస్ రాష్ట్ర ప్రతినిధుల సభ
Published Wed, Jan 1 2014 5:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement