నాడు వీధి వ్యాపారి.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి!
కష్టపడ్డాడు.. వీధుల్లో పుస్తకాలు అమ్మాడు.. ఇంటింటికీ తిరిగి పాలు పోశాడు.. నేడు రూ.18 వేల కోట్లకు అధిపతి.. యూఏఈలో అత్యంత ధనవంతులైన భారతీయల్లో ఆయన ఒకరు. డానుబే గ్రూప్ అధినేత, ముంబైకి చెందిన రిజ్వాన్ సజన్ స్ఫూర్తివంతమైన విజయగాథ ఇది.
(గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..)
తన తండ్రి మరణించినప్పుడు రిజ్వాన్ సజన్ వయసు కేవలం 16 సంవత్సరాలు. ముగ్గురు సంతానంలో రిజ్వాన్ పెద్దవాడు కావడంతో కుటుంబ పోషణ బాధ్యత అతనిపై పడింది. దీంతో రిజ్వాన్ వీధుల్లో పుస్తకాలు, స్టేషనరీ అమ్మాడు. అదనపు ఆదాయం కోసం మిల్క్ డెలివరీ బాయ్‌గా కూడా పనిచేశాడు.
1981లో 18 ఏళ్లు నిండిన రిజ్వాన్‌కు ఆయన మామ కువైట్‌లో ఉద్యోగం ఇప్పించి ఆయన ఎదుగుదలలో తోడ్పాటు అందించారు. కువైట్‌లో రిజ్వాన్ ప్రారంభంలో సేల్స్ ట్రెయినీగా 150 దినార్లు అంటే అప్పట్లో రూ.18 వేల జీతానికి పనిచేశారు. అలా ఎనిమిదేళ్లు పనిచేశాక సేల్స్ మేనేజర్ అయ్యారు. కానీ 1990లో గల్ఫ్ యుద్ధం తర్వాత సజన్ ముంబైకి తిరిగి వచ్చి మళ్లీ ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ సారి దుబాయ్‌లో బిల్డింగ్ మెటీరియల్స్ బ్రోకరేజ్ వ్యాపారంలో చేరాడు. ఒక రోజు రిజ్వాన్ ఆ ఉద్యోగం మానేసి తన సొంత నిర్మాణ సామగ్రి వ్యాపార సంస్థను స్థాపించారు. అలా పుట్టుకొచ్చింది డానుబే గ్రూప్.
(ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ)
బాల్యంలో తాను అనేక సవాళ్లు ఎదుర్కొన్నానని, తన తండ్రి ఓ స్టీల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవారని, నెలకు రూ. 7వేల జీతంతో ఇల్లు గవడం చాలా కష్టంగా ఉండేదని, స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందులు పడినట్లు రిజ్వాన్ గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కానీ రిజ్వాన్ సజన్ పట్టు వదలలేదు. 1993లో డానుబే గ్రూప్‌ను ప్రారంభించేంత వరకూ అనేక కష్టాలు పడ్డారు. 2019 నాటికి డానుబే గ్రూప్ వార్షిక టర్నోవర్ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండేది. డానుబే గ్రూప్ బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది.
(ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం)