ఎవరూ రాకపోతే.. డబ్బంతా ఆ పిల్లాడికే!
ఎవరూ రాకపోతే.. డబ్బంతా ఆ పిల్లాడికే!
Published Wed, Dec 9 2015 4:34 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
వియన్నా: ఆస్ట్రియాలోని డాన్యూబ్ నదిలో అకస్మాత్తుగా డబ్బుల కట్టలు తేలుతూ కనిపించాయి. అంత డబ్బు కనిపిస్తే ఎవరికైనా కళ్లు చెదురుతాయి కదా... ఒడ్డున నిలబడి చూస్తున్న పిల్లాడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ డబ్బును సొంతం చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఈత రాదు. అందుకే పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. పోలీసులు వచ్చేలోపు ప్రాణం ఆగలేదు.. వాళ్లు వచ్చేలోపు ఎంతోకొంత దక్కించుకోవాలని ప్రయత్నించాడు. మెల్లిగా నదిలోకి వెళ్లి కొంత డబ్బు తీసుకున్నాడు. అయితే నది ఒడ్డున తచ్చాడుతున్న పిల్లాడిని చూసిన కొందరు పెద్దలు.. అతడు ఆత్మహత్య చేసుకుంటున్నాడోమేనని కంగారుపడ్డారు. అంతా అక్కడ గుమిగూడారు. ఇంతలో పోలీసులకు రానే వచ్చి.. పెద్దఎత్తున 500, 100 యూరో కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ డబ్బుకట్టలు నదిలో ఎలా కొట్టుకొచ్చాయో అక్కడివారికి అంతుపట్టలేదు. డబ్బును చూసిన పిల్లడు మాత్రం తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఇవి నకిలీ నోట్లు కావచ్చని పోలీసులు అనుమానించినా... నకిలీవి కావని తేల్చారు. ఇంత డబ్బు ఎవరు నదిలో పడేశారు.. ఎక్కడినుంచి వచ్చిందనేది ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న సొమ్ము విలువ లక్ష యూరోలు (73 లక్షల రూపాయలు) అని అన్నారు.
సాధారణంగా ఆస్ట్రియాలో ఎవరికైనా డబ్బు దొరికితే అందులో ఆ డబ్బు ఆచూకీ చెప్పినవారికి 15 - 10 శాతాం వాటా ఇస్తారు. అంతేనా, ఆ డబ్బు అసలు యజమాని వివరాలు ఏడాదిలోపు తెలియక పోతే...ఆ పూర్తి మొత్తాన్ని డబ్బు ఆచూకీ తెలిపిన వారికి అప్పగిస్తారట.
Advertisement
Advertisement