Dasari Tarak Prabhu
-
ఇంకా మిస్టరీగానే దాసరి ప్రభు అదృశ్యం
బంజారాహిల్స్: దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) అదృశ్యం ఇంకా మిస్టరీగానే మిగిలింది. అటు పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా గడిచిన రెండురోజుల నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9న ప్రభు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లోని తన ఇంటి నుంచి ఆటోలో ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌కు వెళ్ళి అక్కడ చిత్తూరు బస్సు ఎక్కి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. చిత్తూరులో తన పెద్దభార్య దాసరి సుశీల ఇంటికి వెళ్ళిన ప్రభు ఈ నెల 12వ తేదీన ఉదయం అక్కడి నుంచి సుశీల, ఆమె తల్లితో కలిసి మియాపూర్ వచ్చారు. అక్కడ సుశీల సన్నిహితురాలు ఇంటికి వెళ్లి.. ఆ రోజు అక్కడే బస చేశారు. ఈ నెల 13న ఉదయం బయట పని ఉందంటూ భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు. 13న సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చిన వీరిద్దరూ ఆందోళనగా కనిపించారు. అప్పటికే ప్రభు అదృశ్యమైనట్లుగా టీవీల్లో స్క్రోలింగ్‌లు రావడం, పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడాన్ని కూడా గమనించారు. 13వ తేదీ సాయంత్రమే తిరిగి ప్రభు, సుశీల, సుశీల తల్లి.. ముగ్గురు కలిసి వెళ్లిపోయారు. ఈ నెల 9వ తేదీ నుంచే ప్రభుతోపాటు ఆయన పెద్ద భార్య సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ రావడం, కనీసం అడ్రస్ చెప్పకపోవడం సన్నిహితులకు కనిపించకపోవడం పోలీసులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటికే ఓ పోలీసు బృందం తిరుపతిలో మకాం వేసింది. మరో రెండు బృందాలు నగరం నలుమూలలు గాలిస్తున్నాయి. మియాపూర్ నుంచి ప్రభు తిరిగి ఎక్కడికి వెళ్ళాడన్నదానిపై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. తన అల్లుడు కనిపించడం లేదంటూ ఈ నెల 12వ తేదీన మామ నార్ల సురేంద్ర ప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
ఇమ్లిబన్లో చిత్తూరు బస్సు ఎక్కినట్లు ఆనవాలు..
హైదరాబాద్ : దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) కనిపించడం లేదంటూ అతడి మేనమామ నార్ల సురేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 5న రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తారక ప్రభు ఈనెల 7వ తేదీ వరకు కూకట్‌పల్లిలోని తన పెద్ద అల్లుడి ఇంట్లో ఉన్నాడని, 8వ తేదీన పని ఉందంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–46లోని తన కార్యాలయానికి వెళ్లిన అతను ఆ రోజు రాత్రి తన ఇంట్లోనే పడుకున్నట్లు తెలిపారు. ఈ నెల 9 వ తేదీ సాయంత్రం వరకు ఇంట్లోనే ఆఫీస్ పనులు చూసుకున్న ప్రభు ఇంటి వద్ద ఆటో ఎక్కి వాచ్మెన్ బహదూర్‌కు చెప్పి బయటికి వెళ్లిపోయాడన్నారు. అదే రోజు సాయంత్రం అతడి భార్య పద్మావతి ప్రభుకు ఫోన్ చేయగా, ఫోన్ రింగ్ అయినా కాల్ కట్ అవుతోందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫోన్‌స్విచ్ ఆఫ్ అయినట్లు తెలిపాడు. అతడి ఆచూకీ లేక పోవడంతో బుధవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు జూబ్లీహిల్స్ పోలీసులను అప్రమత్తం చేశారు. గురువారం తెల్లవారుజామున ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. మరో వైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. అతడి కాల్‌డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రభు ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో చిత్తూరు బస్సు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు అతడు చిత్తూరుకు వెళ్లి ఉంటాడని ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో వారు గాలింపు ముమ్మరం చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బుద్ధా.. మీ మాటలు వెనక్కితీసుకోండి: దాసరి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మోహన్‌బాబును ఉద్దేశించి.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకట్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోహన్‌బాబును విమర్శిస్తూ.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గురించి ప్రస్తావించడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోహన్‌బాబు తమకు పెద్ద అన్నయ్యలాంటి వారు అని, నాన్న చనిపోయిన తరువాత అన్ని ఆయనే చూసుకుంటున్నారని దాసరి నారాయణరావు పెద్ద కొడుకు తారకప్రభు తెలిపారు. దాసరి నారాయణరావుకు మోహన్ బాబు పంగనామాలు పెట్టారని బుద్ధా వెంకన్న అన్నారని, ఈ వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని తారకప్రభు కోరారు. తాము ఎప్పుడైనా, ఎక్కడైనా మోహన్ బాబు తమను మోసం చేశారని చెప్పమా? తాము చెప్పకుండా ఈ విషయంలోకి దాసరిని ఎందుకు లాగారని బుద్ధా వెంకన్నను ఆయన ప్రశ్నించారు. దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలు పద్మ స్పందిస్తూ.. ‘మోహన్‌బాబు నన్ను అమ్మా అని పిలుస్తారు. నన్ను కూతురిలా ఆయన చూసుకుంటారు. మా రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి. బుద్ధా వెంకన్నగారూ.. మీ మాటలను వెనక్కి తీసుకోండి. రాజకీయాల కోసం మా కుటుంబాన్ని ఇందులోకి లాగకండి’ అని హితవు పలికారు. -
దాసరి కుమారుడిపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు కుమారుడు తారక్ ప్రభుపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భరణం చెల్లించలేదని తారక్ ప్రభు భార్య సుశీల నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దాంతో నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. భరణం బకాయిలను చెల్లించనందుకు ప్రభును అరెస్ట్ చేయాలని గతంలో ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే భరణం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై సుశీల హైకోర్టుకు వెళ్లారు. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది.