ఇంకా మిస్టరీగానే దాసరి ప్రభు అదృశ్యం  | Dasari Taraka Prabhu Disappear Is Mystery | Sakshi
Sakshi News home page

మిస్టరీగానే దాసరి ప్రభు అదృశ్యం 

Published Sun, Jun 16 2019 6:23 PM | Last Updated on Sun, Jun 16 2019 6:39 PM

Dasari Taraka Prabhu Disappear Is Mystery - Sakshi

బంజారాహిల్స్‌: దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) అదృశ్యం ఇంకా మిస్టరీగానే మిగిలింది. అటు పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా గడిచిన రెండురోజుల నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9న ప్రభు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 46లోని తన ఇంటి నుంచి ఆటోలో ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్‌కు వెళ్ళి అక్కడ చిత్తూరు బస్సు ఎక్కి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. చిత్తూరులో తన పెద్దభార్య దాసరి సుశీల ఇంటికి వెళ్ళిన ప్రభు ఈ నెల 12వ తేదీన ఉదయం అక్కడి నుంచి సుశీల, ఆమె తల్లితో కలిసి మియాపూర్‌ వచ్చారు. అక్కడ సుశీల సన్నిహితురాలు ఇంటికి వెళ్లి.. ఆ రోజు అక్కడే బస చేశారు. ఈ నెల 13న  ఉదయం బయట పని ఉందంటూ భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు.

13న సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చిన వీరిద్దరూ ఆందోళనగా కనిపించారు. అప్పటికే ప్రభు అదృశ్యమైనట్లుగా టీవీల్లో స్క్రోలింగ్‌లు రావడం, పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడాన్ని కూడా గమనించారు. 13వ తేదీ సాయంత్రమే తిరిగి ప్రభు, సుశీల, సుశీల తల్లి.. ముగ్గురు కలిసి వెళ్లిపోయారు. ఈ నెల 9వ తేదీ నుంచే ప్రభుతోపాటు ఆయన పెద్ద భార్య సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడం, కనీసం అడ్రస్‌ చెప్పకపోవడం సన్నిహితులకు కనిపించకపోవడం పోలీసులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటికే ఓ పోలీసు బృందం తిరుపతిలో మకాం వేసింది. మరో రెండు బృందాలు నగరం నలుమూలలు గాలిస్తున్నాయి. మియాపూర్‌ నుంచి ప్రభు తిరిగి ఎక్కడికి వెళ్ళాడన్నదానిపై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. తన అల్లుడు కనిపించడం లేదంటూ ఈ నెల 12వ తేదీన మామ నార్ల సురేంద్ర ప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement