అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు
దాదాపు ఇరవై ఏళ్లు అమ్మానాన్న దగ్గర ఉండి
పెళ్లయ్యాక ఒక కొత్త ఇంట్లోకి
కోడలుగా వెళ్తుంది.
అన్నీ కొత్త ముఖాలే. అన్నీ పాత ఆచారాలే.
భర్త... స్నేహితుడు కాదు. భర్తే.
అత్తమ్మ... అమ్మ కాదు. అత్తే.
మామయ్య... నాన్న కాదు. మామగారే.
బాధ్యత పెరగాలి. మర్యాదలు తగ్గకూడదు.
నాన్న గారం, అమ్మ మమకారం కోసం
మాటిమాటికీ పుట్టింటికి వెళ్లడం కరెక్టు కాదు.
మాటిమాటికీ ఫోన్లో
మాట్లాడ్డం కూడా సరికాదేమో.
అంతా అయోమయం.
ఇలాంటి మెట్టినిల్లు మెచ్చినిల్లుగా మారితే?
అత్తమ్మ అమ్మంత అమ్మ అయితే?
అప్పుడు...
అత్త ఉన్న కోడలు ఉత్తమురాలవుతుంది.
కోడలు ఉన్న అత్త గుణవంతురాలు అవుతుంది.
యంత్రాల సాయం అంతగా లేని రోజుల్లో అత్త ప్రవర్తన గురించి వాడుకలో ఉన్న ఓ కథ...
పనిలో సుఖంగా ఉంటుందని కూర్చొని ధాన్యం విసిరే పని కూతురికి, కష్టమైన వడ్లు దంచే పనిని కోడలికి అప్పజెప్పిందట ఓ అత్తగారు. దంపడంలో చేతులకు, కాళ్లకు అయిన వ్యాయామం వల్ల కోడలు ఆరోగ్యం పెరిగిందట. కూర్చొని కూర్చొని చేసే పనుల వల్ల కూతురు లేచి నడవలేని పరిస్థితికి చేరుకుందట. ఆ కథ ఎలా ఉన్నా... మన కూతురులాగే కోడలూ మరో ఇంటి కూతురు అని... మన అమ్మాయి ఇంకో ఇంటి కోడలిగా ఇలాగే బాధపడుతుందేమో అని ఆలోచిస్తే చాలు అత్త అమ్మయిపోతుంది.
అత్తలో అమ్మను, కోడలిలో కూతురిని చూసుకున్నవారి కుటుంబాలు నిజంగా స్వర్గధామాలే. అలాంటి స్వర్గధామం మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఇంట్లో చూడవచ్చు. లక్ష్మణ్ అమ్మగారు సత్యభామ (ఈవిడ స్త్రీ వైద్య నిపుణురాలు కూడా), భార్య శైలజ. అత్తగారి గురించి ఈ అమ్మాయి చెబుతుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది.
పెళ్లికి ముందే అర్థం చేసుకున్నారు
‘ఇక నుంచి ఈ కళ్లలో సంతోషమే మేమంతా చూడాలి. అమ్మలేదని బెంగపడకు. మేమంతా ఉన్నాం..’ అంటూ భుజం చుట్టు చేతులు వేశారు అత్తయ్య అప్పగింతల వేళ. అన్నయ్యను, నాన్నను వదిలి రాలేక నాకు కలిగిన ఆ దుఃఖాన్ని తన భరోసాతో తీర్చేశారు. పెళ్లి అనుకోవడానికి ముందు మా అమ్మ చనిపోయారు. ‘ఏడాదిలో పెళ్లి చేస్తే కన్యాదాన ఫలం లభిస్తుంది’ అన్నారు పెద్దలు. కానీ నాన్నను, అన్నయ్యను వదిలి రాలేక.. ఆ టైమ్‌లో పెళ్లికి ఒప్పుకోవడం కష్టంగా అనిపించింది. ఆ కష్టాన్ని అత్తయ్య అర్థం చేసుకున్నారని చాలా సందర్భాల్లో తెలిసి వచ్చింది. పెళ్లయిన మొదటి ఏడాది అమ్మాయి జీవితంలో చాలా కీలకమైంది. అప్పటివరకు పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు. వాతావరణం వేరు. కానీ, ఒక్కసారిగా జీవితం మారిపోతుంది. వెళ్లిన చోట ఎలా ఉండాలో అనే అదుర్దా, ఆందోళన.. అంతా ఇంతా కాదు. మొదట్లో నాకూ అలాగే అనిపించింది.
అంక్షలు విధించరు
అత్తయ్య ఏ పనైనా మమ్మల్నే కాదు పిల్లల్నీ ఇలాగే చేసి తీరాలన్న ఆంక్షలు పెట్టరు. డబ్బు వెనకేసుకోవాలనో, బాగా తయారవ్వాలనో, నలుగురిలో ఇలాగే ఉండాలనో... ఇవేవీ ఎప్పుడూ చెప్పరు. అత్తయ్య, మామయ్య ఇద్దరూ డాక్టర్లు అయినప్పటికీ ఎంత నిరాడంబరంగా జీవించారో... పిల్లలను ఎంత బాగా పెంచారో, బంధుమిత్రులతో ఎంత బాగా ఉంటారో.. ఇవన్నీ వారిని చూసే నేర్చుకుంటూ వచ్చాను. లక్ష్మణ్‌కి అమ్మ మాటంటే వేదం. నాక్కూడా. అంతబాగా ఉంటుంది అత్తయ్య విధానం. తప్పు పట్టడం అనేది ఆమెలో ఇంతవరకూ నేను చూడలేదు. అత్తయ్య మామయ్య జీవనమే మాకు ఆదర్శం. మా పిల్లలకు కూడా నానమ్మ, తాతయ్యలాగ ఉండాలని చెబుతుంటాను.
తన వెంటే...
విదేశాలలో క్రికెట్ మ్యాచ్‌లు తప్పనిసరి. అక్కడికి వెళ్లాలంటే.. కొత్త ప్లేస్.. కొత్త మనుషులు.. ఎలా ఉంటానో అని భయమేసేది. అందుకే ‘వెళ్లను’ అని చెప్పేదాన్ని. ‘నీ ఇష్టం’ అని వదిలేయలేదు. ఏడాది వరకు మ్యాచ్‌లు చూడ్డానికి తోడుగా అత్తయ్య నాతో వచ్చేవారు. ఆ విధంగా నాకు బయటిప్రపంచాన్ని పరిచయం చేశారు ఆవిడ. పూజలు, వ్రతాలు... అత్తయ్య చేస్తుండగా చూసే నేర్చుకున్నాను. ఇద్దరు పిల్లలు.. డెలివరీ సమయంలో అత్తయ్యే డాక్టర్‌గానూ, అమ్మగానూ వెంటే ఉన్నారు.
ఇద్దరం సమానం
నేను ఇంటికి చిన్న కోడలిని. తోడికోడలు తోబుట్టువు లేని లోటు తీర్చింది. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని కాకుండా ఇద్దరినీ సమానంగా చూస్తారు అత్తయ్య. షాపింగ్‌కి వెళితే తనకంటే ముందు మా ఇద్దరికి కావల్సినవి కొనుక్కొచ్చేవారు. ఇప్పటికీ అత్తయ్యకి ఆ అలవాటు పోలేదు.
ఇక కోడళ్ల గురించి అత్తగారు కూతుళ్లు లేని లోటు తీర్చారు...
‘శైలు ఎప్పుడూ కోడలిగా ప్రవర్తించలేదు. నాకు ఇద్దరూ కొడుకులే. నా ఇద్దరు కోడళ్లు కూతుళ్లు లేని లోటు తీర్చారు. తల్లీకూతుళ్లు కలిసుండటం, ఆప్యాయంగా మసలుకోవడం అందరిళ్లలోనూ సాధారణమేగా! అని నవ్వుతూనే చెప్పారు అత్తగారు సత్యభామ.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
హోదా చూపలేదు...
అత్తింటిలో అడుగుపెట్టే టైమ్‌కి నాకు వంట పనులు సరిగా రావు. పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగాను. అత్తింటికి వచ్చాక కూడా నాలో చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు. కానీ, అత్తయ్య మాత్రం చాలా పెద్దరికంగా ఉండేవారు. చాలా తక్కువ మాట్లాడతారు. నా అల్లరి పనులకు నవ్వుతోనే సమాధానమిచ్చేవారు. వంట చేయడంలో అవస్థలు పడుతుంటే ‘నువ్వు మా అబ్బాయిని చూసుకోమ్మా! వాడికి మోరల్ సపోర్ట్ ఇవ్వు, అది చాలు. పనులు నెమ్మదిగా నేర్చుకుందువులే.. ’ అని ధైర్యం చెప్పేవారు. అత్తగారి హోదాలో నన్ను తన అదుపాజ్ఞలో పెట్టాలని ఆమె ఏనాడూ చూడలేదు. అలా అత్తయ్య నాకు మా అమ్మలాగే అనిపించేవారు. అత్తిల్లు కూడా పుట్టింటి నుంచి పుట్టింటికే వచ్చినట్టు ఉండేది.
ఇలాంటి తప్పులు మీరైతే చేయనే చేయరు
అత్తలకు గమనిక సలహాలు...
- కొత్త కోడళ్లకు కొన్నాళ్ల వరకు ఇంటి పద్ధతుల గురించి వివరించడం వరకు పర్వాలేదు. అయితే, అడగకున్నా నిత్యం సలహాలిస్తూ ఉండటం సరికాదు.
- కోడలు కోరినప్పుడు సలహా ఇస్తే దానికి విలువ ఉంటుంది.
చాడీలు...
- కొడుకు తన మాటే వినాలని.. కోడలి మీద కొడుక్కి చాడీలు చెబుతుంటారు. ఈ తరహా ప్రవర్తన కొడుకు కోడళ్ల మధ్య అగాథాలు ఏర్పడతాయి.
- కొడుకు దగ్గర కోడలు చేసే పనులను మెచ్చుకుంటే, అనుబంధాలు బలపడతాయి.
పనులు చెప్పడం కాదు..
- అస్తమానూ అత్త హోదాలో కోడలికి ఆర్డర్లు వేయడం కాదు.
- ఇంటి పని, వంట పనుల్లో ‘నేను సాయం చేయనా! నీవు కాస్త విశ్రాంతి తీసుకో...’ వంటి మాటలు కోడలికి ఎంతో ఊరటనిస్తాయి.
కష్టం నుంచి సులువు...
- చుట్టుపక్కల వారితో చనువుగా, మృదువుగా మాట్లాడే అత్తలు, కోడలి దగ్గరికొచ్చేసరికి స్వరం పెంచుతారు. కరకు మాటలు ఎదుటివారిని గాయపరుస్తాయని మరువకూడదు.
- ఇంటి కష్ట సుఖాలు, పుట్టింటివారి బాగోగుల గురించి కోడలితో అప్పుడప్పుడైనా మాట్లాడుతుంటే ఇద్దరి మధ్య అనుబంధం మెరుగుపడుతుంది.
విమర్శ...
- ఇంటి పెత్తనం పోతుందనే భయంతో కొందరు అత్తలు కోడలు చేసే ప్రతిపనినీ తప్పు పడుతుంటారు. బంధువుల ముందూ తేలిక చేసి మాట్లాడుతుంటారు. ఇదే తీరు కొనసాగిస్తే అందరూ మిమ్మల్నే వేలెత్తి చూపుతారు.
- కోడలిని ఆదరంగా చూసుకుంటూ, ఆమె చేసే మంచి పనులను నలుగురిలోనూ మెచ్చుకుంటూ ఉంటే మీ ఇంటి గౌరవం పెరుగుతుంది. మీ తీరు బాగుంటేనే మీ కూతురికైనా, మరో కొడుకుకైనా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
కోడళ్లకు గమనిక
కోపం...
- చిన్న చిన్న విషయాలకే అత్త మీద కోపాన్ని చేతిలోని వస్తువుల మీద చూపుతుంటారు. అకారణంగా పిల్లలను తిట్టడం, కొట్టడం చేస్తుంటారు.
- అర్థంలేని ఇలాంటి కోపాన్ని అదుపు చేసుకుంటే ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది.
అగౌరవం...
- అత్తగారు ఏదైనా చెబితే ‘సలహా’ అని తిట్టుకుంటూ ముఖం ముడుచుకుంటారు.
- అనుభవమున్న వారు మన మంచికే చెబుతారు అనుకుంటే సమస్యే ఉండదు. ‘మీరు చెప్పింది చాలా బాగుంది. మీరు చెప్పిన పనులు నాకు అంత త్వరగా రాకపోవచ్చు. మెల్లగా నేర్చుకుంటాను’ అని అనునయంగా చెబితే అత్త మనసును కష్టపెట్టకుండా తర్వాత మీకు నచ్చిన పనినే చేసే అవకాశాలు ఉంటాయి.
అపార్థం...
- అత్తలు చెప్పే మాటలను కొందరు కోడళ్లు చప్పున అపార్థం చేసేసుకుంటారు. ఇలాంటి అపార్థాలు అనర్థాలకు దారితీస్తాయి.
- అత్త కూడా అమ్మలాంటిదే అని గ్రహించాలి. తమ పుట్టింట్లో అమ్మ తన కోడళ్ల పట్ల ఎలా ఉంటుందో గుర్తుతెచ్చుకోవాలి. అత్తగారిలో అమ్మను చూసుకుంటే సమస్యే ఉండదు.
అనాలోచన...
- అత్త ఎప్పుడూ తప్పులు పట్టడానికే ఉంటుంది అనే ఆలోచన పెళ్లికి ముందు నుంచే అమ్మాయిల్లో ఉంటుంది. మన సంస్కృతిలో అత్తా-కోడళ్ల మధ్య బంధాలు అలాంటి ఆలోచనను లేపడం సహజం.
- మీ అత్తగారి కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకోండి. అప్పుడు అత్తగారిని మీ దారిలోకి తెచ్చుకోవడం తేలికవుతుంది.
ఎదురు మాటలు...
- అత్త ఏదైనా చెప్పబోతే ‘నాకు చెప్పేటంత దానివా..? చదువు, ఉద్యోగం.. అన్నీ నీకన్నా ఎక్కువే’ అనే తలబిరుసు మాటలు అత్తా కోడళ్ల మధ్య దూరం పెంచుతాయి.
- అత్త చెప్పేది మన మంచికే అనే ఆలోచనతో వింటే ఎలాంటి సమస్యలు ఉండవు.