
న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్న హుంకులమ్మ
ఖమ్మంరూరల్: వయసు మీదపడ్డ తనను సాకాల్సిన వాళ్లే ఇంట్లో నుంచి గెంటేస్తే ఆ అవ్వ వృద్ధాశ్రమంలో చేరలేదు. రోడ్డునా పడకుండా, న్యాయం కోసం రోడ్డెక్కింది. తనకు జరిగిన అన్యాయానికి ఎదురుతిరిగింది. వివరాలు.. ఖమ్మంరూరల్ మండలంలోని ఏదులాపురం శివారు తాళ్లేసేతండాలో గురువారం హాలవత్ హుంకులమ్మకు ఇద్దరు కుమారులు. వారికి వివాహమైంది. అనంతరం కుమారులిద్దరు మృతి చెందారు. అయితే వారి కోడళ్లు తిరుపమ్మ, వీరమ్మలు తమ అత్తను చెరి ఒక నెల చూసుకోవాలనే ఒప్పందం ఉంది. అయితే చిన్న కోడలు వైరాలో ఉంటోంది, ఆమె నెల అయిపోయాక తాళ్లేసేతండాకు అత్త హుంకులమ్మను పంపించింది. అయితే మరో కోడలు అత్తను తాను సాకలేనని ఇంట్లో నుంచి గెంటేసింది. దీంతో హంకులమ్మ తనకు దిక్కెవరంటూ? తనకు బువ్వ పెట్టేదెవరంటూ? గురువారం ఖమ్మం–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని, అప్పటి వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది. దీంతో భారీగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని నచ్చజెప్పి, హామీ ఇచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు.