20 టీఎంసీల మట్టానికి సోమశిల
సోమశిల, న్యూస్‌లైన్: సోమశిల జలాశయం నీటి నిల్వ 20 టీఎంసీలకు చేరుతోంది. పైతట్టు ప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రానికి జలాశయానికి 6,700 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. పెన్నా పరీవాహక ప్రాంతాలైన చెన్నూరు గేజీ వద్ద సాయంత్రానికి 6,500 క్యూసెక్కుల వరద నమోదైంది.
ప్రస్తుతం జలాశయంలో 19.78 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ప్రవాహం కొనసాగితే సోమవారానికి 20 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంటుంది. జూలైలో డెడ్ స్టోరేజీ 7.4 టీఎంసీల నీటి నిల్వ ఉన్న సోమశిల జలాశయానికి కృష్ణా నదీ జలాల వల్ల 20 టీఎంసీలకు చేరువైంది. ప్రవాహం మరికొద్ది రోజులు కొనసాగవచ్చని అధికారుల అంచనా ప్రస్తుతం జలాశయంలో 89.20 మీటర్లు, 289.37 అడుగుల మట్టం నమోదైంది. సగటున 139 క్యూసెక్కులు నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.