Day-night Tests
-
అందుకోసం ప్రయత్నిస్తా: గంగూలీ
న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు వాతావరణం అంతగా అనుకూలించనప్పటికీ ఆటగాళ్లు ముందుకు రావడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. భారత్-బంగ్లాదేశ్ జట్లలోని ఆటగాళ్లు ఎవ్వరూ కూడా వాతావరణం ప్రతీకూలంగా ఉందని చెప్పకపోవడంపై వారికి గంగూలీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అదే సమయంలో డే అండ్ నైట్ గురించి గంగూలీ మాట్లాడాడు. ప్రతీ ఏడాది తమ షెడ్యూల్లో ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఉండేలా చూడటానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. భారత్‌లోని కాకుండా, విదేశీ పర్యటనలప్పుడు కూడా సదరు బోర్డుతో డే అండ్ నైట్ టెస్టు ఏర్పాటుకు కృషి చేస్తానన్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరగునన్న మ్యాచ్‌ను డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించనున్నారు. విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకునే సమయంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పచెప్పడాన్ని గంగూలీ సమర్ధించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రోహిత్ శర్మ అనుభవం జాతీయ జట్టుకు పగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఉపయోగపడుతుందన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్‌కు పగ్గాలు అప్పచెప్పవచ్చు కదా అన్న ప్రశ్నకు అందుకు ఇది తగిన సమయం కాదనే అనుకుంటున్నాని తెలిపాడు. అసలు అది చర్చించాల్సిన అవసరం కూడా లేదని గంగూలీ పేర్కొన్నాడు. తాను సెలక్షన్ కమిటీ విషయంలో తలదూర్చనన్నాడు. మరొకవైపు ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా ఘోరంగా వైఫల్యం చెందడంపై కూడా గంగూలీ స్పందించాడు. ప్రతీ జట్టుకు కష్టకాలం అనేది వస్తుందని, వారు త్వరలోనే గాడిలో పడతారన్నాడు. గతంలో పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు కూడా ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కొన్నాయని గంగూలీ చెప్పుకొచ్చాడు. -
పింక్ బంతితో ఇప్పుడే కాదు
డేనైట్ టెస్టుపై కుంబ్లే న్యూఢిల్లీ: ఐదు రోజుల ఫార్మాట్‌పై అభిమానుల ఆసక్తిని కొనసాగించాలంటే భవిష్యత్‌లో డేనైట్ టెస్టులు తప్పవని భారత చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. అయితే పింక్ బంతితో నిర్వహించే ఈ మ్యాచ్‌లకు మరింత సమయం పడుతుందన్నారు. ‘మేం పింక్ బంతుల గురించి ఇంకా ఆలోచించలేదు. దీనికి ఇంకా సమయం పడుతుంది. వెస్టిండీస్‌లో మాత్రం మేం రెడ్ డ్యూక్ బంతులతోనే ఆడతాం. డేనైట్ టెస్టులకు నేను కూడా మద్దతిస్తున్నా. ఏదేమైనా భవిష్యత్‌లో టెస్టు క్రికెట్‌కు ప్రేక్షకాదరణ పెంపొందించాలి. డేనైట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రజలు ఆఫీస్ పని వేళలు ముగించుకుని స్టేడియానికి వస్తారు’ అని కుంబ్లే పేర్కొన్నారు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చిన కుంబ్లే... అతనితో కలిసి పని చేసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. -
పింక్ బంతి ఓకే
కోల్‌కతా: భారత్‌లో డేనైట్ టెస్టులకు సన్నాహకంగా ప్రయోగాత్మకంగా పింక్ బంతితో నిర్వహించిన మ్యాచ్ ముగిసింది. ఆడిన ఆటగాళ్లంతా సంతృప్తి వ్యక్తం చేయడంతో అక్టోబరులో న్యూజిలాండ్‌తో ఈడెన్‌గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించే అవకాశాలు మెరుగయ్యాయి. బెంగాల్ క్రికెట్ సంఘం తమ సూపర్‌లీగ్ ఫైనల్‌ను పింక్‌బంతితో డేనైట్‌గా నిర్వహించింది. ఇందులో భవానీపూర్ క్లబ్‌పై 296 పరుగులతో మోహన్‌బగాన్ విజయం సాధించింది. భారత బౌలర్ షమీ ఈ మ్యాచ్‌లో ఆడి ఏడు వికెట్లు తీశాడు. -
డేనైట్ టెస్టులదే భవిష్యత్తు
అభిమానులను స్టేడియానికి రప్పించడంలో, టెలివిజన్ వీక్షకులను పెంచడంలో డేనైట్ టెస్టులు కీలక పాత్ర పోషిస్తాయని, భవిష్యత్తు వీటిదేనని న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ అభిప్రాయపడ్డారు. పింక్ బంతి అనుకున్నదానికంటే మెరుగ్గా ఉందని, అయితే మంచు ప్రభావం ఈ బంతిపై ఎలా ఉంటుందో చూడాలని ఆయన అన్నారు. అన్ని దేశాలూ డేనైట్ టెస్టుల పట్ల ఆసక్తి చూపుతుండటం మంచి పరిణామమని హ్యాడ్లీ అన్నారు.