ఆరోగ్యశ్రీలో చేర్చేంత వరకూ పోరాటం
– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
కడప కార్పొరేషన్: ప్రాణాంతకమైన క్యాన్సర్, కిడ్నీ వ్యాధికి సంబంధించిన డయాలసిస్‌లను ఆరోగ్యశ్రీలో చేర్చేంత వరకూ పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడితే, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పథకాలన్నింటినీ నీరుగార్చి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. నిరుపేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎంతోమంది పేదలు ధనవంతులతో సమానంగా వైద్యం చేయించుకొని ప్రాణాలతో బయట పడ్డారన్నారు. అపర సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకం అమలుకు రూ.900కోట్లు అవసరం కాగా ప్రస్తుత ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖరాస్తే రూ.250కోట్లు విడుదల చేశారన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలే రూ.300 కోట్లు ఉన్నాయని, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఏమూలకు సరిపోవని తెలిపారు. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు ఆరోగ్యశ్రీలో లేకపోవడం వల్ల నిరుపేదలు వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు వ్యాధులు కూడా చేర్చితే ఆరోగ్యశ్రీ పథకం అమలుకు వెయ్యికోట్లు అవసరమవుతుందన్నారు. ఈ డిమాండ్ల సాధనకు ఈనెల 9వ తేదీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుçపునిచ్చారన్నారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో జెడ్పీ ఛైర్మెన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ పాల్గొంటారని తెలిపారు. ఒంగోలులో జరిగే ధర్నాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ప్రజలు ఈ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మోకాలి కీళ్లమార్పిడిని కూడా చేర్చాలి
ఆరోగ్యశ్రీలో కిడ్నీ, క్యాన్సర్ వ్యాధులతోపాటు మోకాలి కీళ్లమార్పిడిని కూడా చేర్చాలని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమలో ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగడం వల్ల ఇక్కడి ప్రజలకు కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన పథకం
దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని అమలు చేశారని నగర మేయర్ కె. సురేష్‌బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసేందుకు ఈ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు పులి సునీల్‌కుమార్, చల్లా రాజశేఖర్, కరిముల్లా, షఫీ, ఖాజా పాల్గొన్నారు.