హైకోర్టు వద్దంది.. కిందికోర్టు ఇచ్చింది..
డీసీ సోదరులకు మాండేటరీ బెయిల్
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) డెరైక్టర్లు టి.వెంకటరామిరెడ్డి, వినాయక రవిరెడ్డిల బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించినా.. కింది కోర్టులో మాత్రం వారికి మాండేటరీ బెయిల్ లభించింది. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆధారాలను మాయం చేయరాదని, రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించడంతోపాటు దేశం విడిచి వెళ్లరాదని నాంపల్లి ఆరవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భాస్కర్రావు షరతు విధించారు.
60 రోజులుగా వీరు రిమాండ్లో ఉన్నారని... సీబీఐ దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేయని నేపథ్యంలో నేరవిచారణ చట్టం (సీఆర్సీపీ) సెక్షన్ 167(2) కింద తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది చంద్రశేఖర్ వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసిం ది. వీరిద్దరినీ ఫిబ్రవరి 13న సీబీఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హైకోర్టులో ఏం జరిగిందంటే...
తమ బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితులు గతం వారం హైకోర్టును ఆశ్రయించారు. అయితే వీరికి బెయిల్ మంజూరు చేయరాదని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రెండు రోజుల కింద రిజర్వు చేశారు. బుధవారం వీరి పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ దుర్గాప్రసాద్ తీర్పునిచ్చారు.