మరికొద్ది గంటల్లో పెళ్లి.. వరుడి మృతి
సూర్యాపేట (మోతే): మరికొద్ది గంటల్లో పెళ్లి జరగనుండగా వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాజా బజంత్రీలతో వేద మంత్రాల సాక్షిగా నూతన వధువరులు ఒకటి కావల్సిన ఇంట్లో పెళ్లి కూతరు రోదన పలువురిని కంటతడిపెట్టించింది. డీసీఎంలో వెళ్తున్న పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పెళ్లికొడుకు సహా ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రం సమీపంలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి ఖమ్మం జిల్లా చర్లకు చెందిన వధువు నామగరి సత్యనాగలక్ష్మీ ఇంటికి వరుడు తప్పెట శేష సాయినాథ్ సహా బంధువులు డీసీఎంలో బయలుదేరారు.
మార్గం మధ్యలో మోతే మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంక్ సమీపంలో డీసీఎంను ఆపగా, వేగంగా దూసుకొచ్చిన లారీ పెళ్లిబృందం వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు తప్పెట శేష సాయినాథ్, అతని బంధువు దామోదర్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి గాయాలు కాగా క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ, మూడేళ్ల చిన్నారి అఖిల్ మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. బుధవారం రాత్రి పెళ్లి జరగనున్న నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి కుకట్పల్లి నుంచి పెళ్లిబృందం డీసీఎంలో బయలుదేరగా మార్గం మధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో వధువు, వరుడి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.