‘ఎబోలా’పై అప్రమత్తం
సాక్షి, ముంబై : ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ డిసీజ్ (ఈవీడీ)పై బీఎంసీ అప్రమత్తమైంది. అసాధారణమైన ఈ వ్యాధి ఆఫ్రికాలోప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఇటీవల ప్రకటించడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటోంది. వైరస్ను ఎదుర్కోవడానికి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వైరస్ను నగరంలో గుర్తిస్తే తీసుకోవాల్సిన చర్యలపై బీఎంసీ కసరత్తు చేస్తోంది.
ఎయిర్పోర్టు అధికారులకు అవగాహన
అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణికులు ఎవరైనా ఈ వైరస్ను మోసుకొస్తున్నారా అనే అంశంపై కూడా బీకేసీ ఆరోగ్య విభాగం ఆరా తీస్తోంది. ఎయిర్ పోర్టులోని అతి ముఖ్యమైన విభాగాలకుఈవైరస్పై సంబంధిత అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఈ వైరస్ సోకిన వారిని సున్నితంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని వివరిస్తారు. వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల కాలంలో ఎంత మంది ప్రయాణికులు వచ్చారో, వారి వివరాలను అందజేయాలని బీఎంసీ ఎయిర్ పోర్ట్ అధికారులకు లేఖ రాసింది. 20 రోజులల్లోపు ఇక్కడికి వచ్చిన ప్రయాణికుల వివరాలను అందజేయాలని కోరింది. ఈ ప్రయాణికులకు వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షించనున్నారు. వ్యాధి సోకితే వీరికి చికిత్స కూడా నిర్వహించనున్నారు.
గుర్తించిన ఆస్పత్రులు
కేం, సైన్, బీవైఎల్ నైర్ ఆస్పత్రి వైద్య సిబ్బందికి... ఈ వైరస్ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వ్యాధి బాధితులకు చికిత్స అందజేయడానికి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కొత్త జోగేశ్వరి ట్రామా ఆస్పత్రి, చించ్పోక్లీలోని కస్తూర్బా ఆస్పత్రులను కార్పొరేషన్ గుర్తించింది. ఈ వ్యాధి అనుమానితులను జోగేశ్వరి ఆస్పత్రికి తరలిస్తారు, వ్యాధి నిర్ధాణ అయిన కేసులను కస్తూర్బా ఆస్పత్రికి తరలించనున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఏవీడీ కోసం 10 బెడ్లను రిజర్వ్ చేసి ఉంచామన్నారు.
ఆందోళన అవసరం లేదు: డాక్టర్ పద్మజ
ఎబోలా వైరస్ పట్ల నగరానికి ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని కార్పొరేషన్ ప్రకటించింది. నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ ఎగ్జిక్యూటివ్ వైద్యాధికారి డాక్టర్ పద్మజ కేత్కర్ పేర్కొన్నారు. ఈ వైరస్ను ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా తగు చర్యలు తీసుకొంటున్నారన్నారు. ముంబైలో కూడా మందస్తు చర్యలు తీసుకొంటున్నామని వెల్లడించారు. సమీప రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు నమోదుకాలేదన్నారు.