ఈ నాలుగు ముఖ్యం
ఈక్విటీలు గత కొన్నేళ్లుగా ఆశించిన లాభాలను ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్లు, బంగారం వంటి ఇతర ప్రత్యామ్నాయాలపైకి దృష్టి మళ్లించారు. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పసిడిలో పెట్టుబడులు పెట్టారు. 2011 అక్టోబర్ నుంచి 2013 మే మధ్యకాలంలో (ఈ వ్యవధిలో రెపో రేటు 8 శాతం పైనుంచి 7.25 శాతానికి తగ్గింది) రిజర్వు బ్యాంకు అనుసరించిన విధానాల కారణంగా డెట్ ప్రొడక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారికి 10% వరకు ఆదాయం లభించింది.
2013 జూన్ తర్వాత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్లలో అసాధారణ అస్థిరత్వం నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు లిక్విడిటీని కట్టడి చేసే చర్యలను రిజర్వు బ్యాంకు చేపట్టింది. స్థూల ఆర్థిక వాతావరణం మెరుగుపడడంతో ఆ చర్యల ఉపసంహరణను రిజర్వు బ్యాంకు క్రమంగా అమలుచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటును ఆర్బీఐ మరోమారు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందనేది మార్కెట్ అంచనా. కనుక, మీ కష్టార్జితాన్ని డెబిట్ ప్రొడక్టుల్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవేమిటంటే...
{పొడక్టుపై వసూలు చేసే చార్జీలను పరిశీలించాలి. చార్జీల వ్యయం అధికంగా ఉంటే ఆ మేరకు ఆదాయం తగ్గిపోతుంది.
{పొడక్టుకు ఉన్న క్రెడిట్ రేటింగ్‌ను చూడాలి. సొమ్మును ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెడతారో గమనించాలి.
అధిక ఆదాయం ఉన్నదంటే.. తక్కువ రేటింగ్ కలిగిన ఇన్‌స్ట్రుమెంట్లపై ఈ ప్రొడక్టు దృష్టి కేంద్రీకరిస్తుందన్న మాట. టాక్స్-ఫ్రీ బాండ్లు మినహా, ఇతర బాండ్ల విషయంలో పన్ను భారం ఉంటుంది. తక్కువ పన్ను సౌలభ్యం డెట్ ఫండ్లలో ఉంది.
డెబిట్ మ్యూచువల్ ఫండ్లలో ఏడాదికి మించి చేసే పెట్టుబడులపై ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను(ద్రవ్యోల్బణం పెరుగుదల) కోరడం ద్వారా పెట్టుబడిదారులు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.
గత కొన్ని నెలలుగా కొంత అస్థిరత్వం ఉన్నప్పటికీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, డెబిట్ మ్యూచువల్ ఫండ్లు (ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లు, షార్ట్ టర్మ్ ఫండ్ల వంటివి) అధిక రాబడి ఇస్తూనే ఉన్నాయి. డెబిట్ ఫండ్లలో పెట్టుబడులను నాలుగు అంశాల ఆధారంగా చేయాలి. అవి: 1. ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ 2. ప్రొడక్టులు 3. పోర్ట్‌ఫోలియోలు 4. పనితీరు.