అంబానీకి భారీ రుణభారం, జియో షాక్
ముంబై: బడా పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్ కాం) సోమవారం నాటిమార్కెట్ లో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. టెలికాం సేవల్లోకి జియో ఎంట్రీ, భారీ రుణ భారం కారణంగా బిలియనీర్ అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. దాదాపు 10కి పైగా దేశీయ బ్యాంకులకు భారీగా బకాయిపడిందన్న వార్తలతో భారీ నష్టాలు నమోదు చేసింది. యాక్సిస్ , ఎస్, ఎస్బీఐ బ్యాంకు తదితర బ్యాంకులకు అప్పులను చెల్లించడంలో వెనకబడిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
భారీ అప్పల్లో కూరుకుపోయిందన్న ఆందోళనల నేపథ్యంలో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లలో భారీ అమ్మకాలకు తెరలేచింది. ప్రధానంగా ఆర్కామ్ 23శాతం కుప్పకూలింది. అంబానీకి చెందిన మరో ప్రధాన కంపెనీ రిలయన్స్ కేపిటల్ 8 శాతం, రిలయన్స్ డిఫెన్స్ 6 శాతం రిలయన్స్ ఇన్ఫ్రా 8 శాతం, రిలయన్స్ పవర్ 7 శాతం పతనం కావడం గమనార్హం.
ముఖ్యంగా సోదరుడు ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో 4 జి సేవల్లో గత ఏడాది వాయిస్ అండ్ డేటా సేవలతో సునామీలా దూసుకు రావడంతో ఆర్కాం భారీ నష్టాలతో రికార్డ్ కనిష్టాన్ని నమోదు చేసింది. అలాగే జియోకి పోటీగా ఇతర టెలికాం కంపెనీలు భారతి, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ లు డేటా సేవలను సమీక్షించుకుంటూ వస్తుండగా, ఈ విషయంలో ఆర్కాం వెనుకబడింది. వినియోగదారులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫలితంగా మార్చి 31 నాటికి దాదాపు రూ.42 వేలకోట్ల అప్పులను ఆర్కాం మూటగట్టుకుంది. మరోవైపు రేటింగ్ సంస్థ ఇక్రా కూడా ఆర్ కాం రేటింగును బీబీబీ నుంచి బీబీ డౌన్ గ్రేడ్ చేసింది.
10 బ్యాంకులకు పైగా రుణాల చెల్లింపు ఆలస్యమైందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. మొండిబకాయిల(ఎన్పీఏలు) సమస్యలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉపశమనాన్ని కల్పించే బాటలో కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుతో సంప్రదింపుల ద్వారా కొత్త చట్టాన్ని తీసుకు రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. దీంతో అడాగ్ గ్రూపునకు చెందిన పలు కౌంటర్లు భారీ అమ్మకాలతో కుదేలయ్యాయి. అయితే ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ నిరాకరించింది.
కాగా వైర్ లెస్ వ్యాపారాన్ని ప్రత్యర్థి ఎయిర్ సెల్లో విలీనం చేస్తున్నట్టు రిలయన్స్ కమ్యూనికేషన్స్ గతంలో ప్రకటించింది. అలాగే టవర్ బిజినెస్లో రూ. 10,000 కోట్లవిలువైన 51 శాతం వాటాలను కెనడా బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ గ్రూపునకు విక్రయించింది. ఈ అమ్మకంద్వారా రూ .25,000 కోట్లు (3.9 బిలియన్ డాలర్లు) విలువైన రుణాలను తిరిగి చెల్లించాలని కంపెనీ భావిస్తోంది. దీంతో గతవారం ఆర్ కాం భారీగా నష్టపోయింది. గత ఏడాది మార్చి నాల్గవ త్రైమాసికంలో రూ. 966 కోట్ల నష్టాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే.