Debt re-scheduling
-
5 మండలాల్లోనే రుణాల రీ షెడ్యూల్
ఎస్ఎల్బీసీలో నిర్ణయం సర్కారుపై రైతుల నిరసన సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఖరీఫ్‌లో పంట దెబ్బతిన్న ఐదు మండలాల్లో పంట రుణాల రీ షెడ్యూల్‌కు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జీఓ నంబర్ 16ను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ జీఓ విడుదలైంది. ఈ విషయాన్ని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జగన్నాథస్వామి ‘సాక్షి’కి ధృవీకరించారు. ఆ జీఓను అనుసరించి ఐదు మండలాల్లో మాత్రమే పంట రుణాల రీ షెడ్యూల్ జరగనుంది. ఖరీఫ్‌లో (ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య) రుణాలు తీసుకుని పంట దెబ్బతిన్న రైతులకు ఇది వర్తిస్తుంది. జిల్లా యంత్రాంగం పంపించిన సిఫార్సుల మేరకు ఐదు మండలాల్లో రీ షెడ్యూల్‌కు ఆమోదం తెలియచేశారని సమాచారం.ఆ ఐదు మండలాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో (తుని, తొండంగి, కోటనందూరు) మూడు మండలాలు ఉండటం గమనార్హం. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలాలకు కూడా రుణాల రీ షెడ్యూల్ జాబితాలో చోటుకల్పించారు. రీ షెడ్యూల్ గడువు ఎంతో..! ఆ మండలాల్లో ఏప్రిల్-అక్టోబరు మధ్య పంట రుణాలుండి, పంట దెబ్బతిన్న వారికి మాత్రమే ఈ రీ షెడ్యూల్ అమలవుతుందంటున్నారు. ఆ మండలాల్లో రుణాలున్న రైతుల నుంచి మూడు లేదా ఐదేళ్ల వరకు రుణాలు వసూలు చేయకుండా వెసులుబాటు లభించనుంది. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారమైతే రుణవసూళ్లకు మూడేళ్ల గడువు లభించనుందని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రుణాలు రీ షెడ్యూల్ అయ్యే సందర్భాల్లో రీ షెడ్యూల్ చేసిన రుణం ఎంత ఉంటే అంత మేరకు తిరిగి రుణం పొందేందుకు రైతుకు అవకాశం ఉంది. కానీ రెండో పంట వేస్తేనే ఈ రుణం లభిస్తుందని బ్యాంక్‌లు చెబుతున్నాయి. రీ షెడ్యూల్‌కు నిర్ణయించిన ఐదు మండలాల్లో ఏయే గ్రామాల్లో, ఎంతమందికి వర్తిస్తుంది, ఎంత మేరకు రుణాలు రీ షెడ్యూల్ అవుతాయి అనే విషయాలపై జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. వ్యవసాయ రుణ మాఫీ రేపు, మాపంటూ గత ఐదారు నెలలుగా నానుస్తున్న సర్కార్ ఇప్పుడు ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్న రైతుల రుణాల రీ షెడ్యూల్‌ను ఐదు మండలాలకే పరిమితం చేయడం దాని స్వభావానికి అద్దం పడుతోందని కోనసీమకు చెందిన రైతు సంఘ ప్రతినిధి జున్నూరు బాబీ ఆక్షేపించారు. ఇంత కంటే గొప్పగా అమలు చేస్తుందనే నమ్మకం రైతుల్లో కనిపించడం లేదన్నారు. పాత రుణాలపై వడ్డీలకు చక్రవడ్డీలతో తడిసి మోపెడై రైతులు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్న పరిస్థితుల్లో రుణాల మాఫీకి చాపచుట్టేసి, ఐదు మండలాల్లో ఖరీఫ్ పంటరుణాల రీ షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు మండిపడుతున్నారు. -
15లోగా రుణాల రీషెడ్యూల్ పూర్తి చేయాలి
వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్ సదాశివపేట: ఈనెల 15వ తేదీలోగా రైతు రుణాల రీ షెడ్యూల్ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరక్టర్ హుక్యా నాయక్, అడిషనల్ లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం. రఘురాములు బ్యాంకు మేనేజర్లకు అదేశించారు. శనివారం పట్టణంలోని ఎస్బీఐ, ఏపీజీవీబీ బ్యాంకును సందర్శించిన అనంతరం వారు ఆయా బ్యాంకుల మేనేజర్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 15లోగా రైతులు తాము రుణాలు తీసుకున్న బ్యాంకుల వద్దకు వెళ్లి సంతకం పెట్టి రుణాలను రీషెడ్యూలు చేయించుకోవాలన్నారు. బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి సహకరించి 15లోగా రైతు రుణాలను రీ షెడ్యూల్ చేయాలన్నారు. రీ షెడ్యూల్‌కు నోడ్యూస్ ధ్రువీకరణ పత్రం తేవాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారని రైతులు హుక్యానాయక్‌కు ఫిర్యాదు చేయగా రెన్యువల్‌కు, రీ షెడ్యూల్‌కు నోడ్యూస్ సర్టిఫికెట్ అవసరం లేదని జేసీ సూచించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశాను సారం ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 31 వరకు రుణాలు తీసుకున్న రైతులే రీ షెడ్యూల్‌కు అర్హులన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్ సాయి, ఎపీజీవీబీ బ్యాంకు మేనేజర్ మూర్తి, మండల వ్యవసాయాధికారి బాబూ నాయక్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు వెంటనే కొత్త రుణాలు
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆమోదం మేరకు రుణాలు రీ షెడ్యూల్ కానున్న 3 జిల్లాలతో సహా తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా రైతులందరికీ రుణ మాఫీని అమలు చేస్తున్నట్లు టీ సర్కారు స్పష్టం చేసింది. తొలివిడతగా విడుదల చేసిన 25 శాతం నిధులను అన్ని బ్యాంకులకూ వాటి రుణ వితరణ ఆధారంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. కొత్తరుణాల మంజూరుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటాయని వెల్లడించింది. తొలి విడతలో రూ. 4,250 కోట్ల విడుదలకు వ్యవసాయ శాఖ పరిపాలనాపరమైన ఆమో దం తెలపడంతో బుధవారం నిధులను రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ)కి అందజేయనున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం మీడియాకు వివరించారు. అక్కడి నుంచి ఆయా బ్యాంకులకు సర్దుబాటు జరుగుతుందని మంత్రులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో సమావేశం అనం తరం వారితో కలసి మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఒకేసారి భారీ మొత్తంలో నిధులు విడుదల చేసినందున, బ్యాంకర్లు కూడా ప్రస్తుతం చెల్లించిన 25 శాతం నిధులతోపాటు, అదనంగా మరో 30 నుంచి 35 శాతం మేర నిధులను కలిపి రైతులకు కొత్త రుణాలను ఇస్తారని తెలిపారు. దీంతో తక్షణమే రైతులకు రుణాలందుతాయన్నారు. మిగిలిన బకాయిల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లను కోరామని, అందుకు వారు అంగీకరించారని ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు, ఆప్కాబ్, దక్కన్ గ్రామీణ బ్యాంకుల ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు వెల్లడించారు. గురువారం నుంచి బ్యాంకులకు రుణాల చెల్లింపులు ప్రారంభమవుతాయన్నారు. రైతులు వెంటనే బ్యాంకులకు వెళ్లి రుణాలను రెన్యువల్ చేసుకొని ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
రుణాల రీ షెడ్యూల్ వట్టిమాటే
భీమడోలు : రుణమాఫీ అమల్లోకి వచ్చేలోగా రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న ఊకదంపుడు ప్రకటనలు వట్టిమాటేనని తేలిపోయింది. ఇదే విషయూన్ని యూనియన్ బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ కేఎల్ రాజు (విజయవాడ) స్పష్టం చేశారు. భీమడోలు మండలం పోలసానిపల్లిలో గురువా రం ఏటీఎం సెంటర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన ఖాతాదారులతో మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లాకు రుణాల రీ షెడ్యూల్ అమలు చేయడం లేదని చెప్పారు. రాష్ర్టంలోని శ్రీకాకుళం, నెల్లూరు, కృష్ణా, విజయనగరం జిల్లాలకు మాత్రమే రుణాలను రీ షెడ్యూల్ చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్దేశంతో మహిళా సంఘాలకు చెందిన 95 శాతం మంది వాయిదాలను చెల్లించడం లేదని చెప్పారు. రైతులు సకాలంలో రుణాలను చెల్లించి ఉంటే తమ బ్యాంకు ద్వారా వారికి ఈ సీజన్లో రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకూ రుణాలు ఇచ్చేవారమని పేర్కొన్నారు. రైతులెవరూ బకారుులు చెల్లించకపోవడంతో కొత్తగా రుణాలను పొందలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ భానుప్రకాష్, మేనేజర్ సీహెచ్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇందూరు రైతన్నపై శీతకన్ను
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జిల్లా రైతులపై కరుణ చూపలేదు. రుణాల రీ-షెడ్యూల్ వర్తించే జిల్లాల్లో ఇందూరు పేరు ప్రకటించలేదు. రాష్ర్టంలోని మూడు జిల్లాలకే రీ-షెడ్యూల్ అవకాశం కల్పించిన ఆర్బీఐ జిల్లా పేరును ప్రస్తావించలేదు. ఫలితంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లలో సహకార, గ్రామీణ, వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రూ.1810 కోట్లపై సందేహం నెలకొంది. రుణాల రీ-షెడ్యూల్ విషయమై ఆర్బీఐ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్న 2,26,282 మంది రైతులకు నిరాశే మిగిలింది. 2013లో తుఫాన్, వడగళ్ల వర్షాల కారణంగా జిల్లాలోని 22 మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఐదు జిల్లాల్లోని 78 మండలాలను ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తూ జులై 17న జీవో ఎమ్మెస్ నంబర్ 1 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రమే రీ-షెడ్యూల్ వర్తింప చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన ఆర్బీఐ జిల్లా రైతులకు నిరాశ మిగిల్చింది. జిల్లాలోని 22 మండలాల్లో నష్టపోయిన రైతులకు వ్యవసాయశాఖ నివేదికల ప్రకారం త్వరలోనే రూ.21 కోట్ల నష్టపరిహారం, పంట రుణాల రీ-షెడ్యూల్ కూడా చేయనున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి బీఆర్ మీనా పేర్కొన్నారు. ఇదిలా వుండగా 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ఖరీఫ్, రబీలకు గాను రూ.1921 కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఖరీఫ్‌లో రూ.1,152.6 కోట్లకు గాను రూ.1,075.24 కోట్లు (83.29శాతం), రబీలో రూ. 768.4 కోట్లకు రూ.734.77 కోట్లు (95.65 శాతం) ఇచ్చారు. మొత్తంగా రూ. 1,921.00 కోట్లకు గాను రూ.1,810.01 కోట్లు (94.22 శాతం) పంట రుణాలుగా ఇవ్వగా.. ఆ రుణాల రీ-షెడ్యూల్ కోసం వేచిచూస్తున్న రైతులకు ఆర్బీఐ ప్రకటన అశనిపాతంగా మారింది. ప్రభుత్వ సిఫారసులు బేఖాతరు 2013లో రైతులు నాలుగు పర్యాయాలు భారీ వర్షాలు, వడగళ్ల వర్షాల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. జనవరి 25, 26 తేదీలలో కురిసిన వర్షాలు పంటలను దెబ్బతీశాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో వరుసగా కురిసిన భారీ వర్షాలకు రైతులు అతలాకుతలం అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 9 జిల్లాల్లో 415 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆ మండలాల్లో రుణాల రీ-షెడ్యూల్‌కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆర్బీఐకి సుమారు నెల రోజుల క్రితం లేఖ రాసింది. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 39, మహబూబ్‌నగర్‌లో 7, కరీంనగర్లో 7, వరంగల్‌లో 3, నిజామాబాద్ లోని 22 మండలాలను చేర్చింది. బాల్కొండ, బీర్కూరు, మోర్తాడ్, దోమకొండ, మాచారెడ్డి, ఆర్మూరు, భిక్కనూర్, లింగంపేట్, కామారెడ్డి, గాంధారి, వర్ని, రెంజల్, నిజామాబాద్, బాన్సువాడ, నవీపేట, కోటగిరి, సిరికొండ, నాగిరెడ్డిపేట్, నందిపేట్, బోధన్ తదితర 22 మండలాలు ఆర్బీఐకి పంపిన జాబితాలో ఉన్నాయి. అయితే తాజాగా శనివారం ఆర్బీఐ ప్రభుత్వానికి రాసిన లేఖలో కేవలం మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రమే రుణాల రీ-షెడ్యూల్‌కు అవకాశం కల్పించింది. ఇందూరు జిల్లాను విస్మరించడంపై ఇక్కడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మొక్కుబడిగానే రిజర్వుబ్యాంకు రీ-షెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది. -
గతంలో లేనిది ఇప్పుడెందుకు?
పంటల దిగుబడి వివరాలను ఆర్బీఐ కోరటంపై సర్కారు విస్మయం హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్‌కు గతంలో ఎన్నడూ లేనివిధంగా పంటల దిగుబడి వివరాలు ఇవ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడగడంపై తెలంగాణ ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా నోటిఫై చేసిన తొంభై రోజుల్లోగా పంట నష్టం జరిగిన మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ చేయాల్సి ఉందని, అయితే తొంభై రోజులు దాటినందున రీ షెడ్యూల్ చేయాలని మళ్లీ కోరుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. దీనికి ఆర్బీఐ స్పష్టత ఇవ్వకుండా ఇతర అంశాలు ప్రస్తావించడమేమిటని అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానించుకుంటున్నారు. అయినా రిజర్వ్ బ్యాంకు అడిగిన మేరకు వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు లేఖ సిద్ధంచేశారు.ఆర్బీఐ గవర్నర్ అపాయింట్మెంట్ కంటే ముందే ఆ లేఖను వారికి పంపాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. మరోవైపు ఆర్బీఐ గవర్నర్‌తో భేటీకి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.