సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) జిల్లా రైతులపై కరుణ చూపలేదు. రుణాల రీ-షెడ్యూల్ వర్తించే జిల్లాల్లో ఇందూరు పేరు ప్రకటించలేదు. రాష్ర్టంలోని మూడు జిల్లాలకే రీ-షెడ్యూల్ అవకాశం కల్పించిన ఆర్‌బీఐ జిల్లా పేరును ప్రస్తావించలేదు. ఫలితంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్‌లలో సహకార, గ్రామీణ, వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రూ.1810 కోట్లపై సందేహం నెలకొంది.
రుణాల రీ-షెడ్యూల్ విషయమై ఆర్‌బీఐ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్న 2,26,282 మంది రైతులకు నిరాశే మిగిలింది. 2013లో తుఫాన్, వడగళ్ల వర్షాల కారణంగా జిల్లాలోని 22 మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఐదు జిల్లాల్లోని 78 మండలాలను ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తూ జులై 17న జీవో ఎమ్మెస్ నంబర్ 1 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రమే రీ-షెడ్యూల్ వర్తింప చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన ఆర్‌బీఐ జిల్లా రైతులకు నిరాశ మిగిల్చింది.
జిల్లాలోని 22 మండలాల్లో నష్టపోయిన రైతులకు వ్యవసాయశాఖ నివేదికల ప్రకారం త్వరలోనే రూ.21 కోట్ల నష్టపరిహారం, పంట రుణాల రీ-షెడ్యూల్ కూడా చేయనున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి బీఆర్ మీనా పేర్కొన్నారు. ఇదిలా వుండగా 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ఖరీఫ్, రబీలకు గాను రూ.1921 కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే ఖరీఫ్‌లో రూ.1,152.6 కోట్లకు గాను రూ.1,075.24 కోట్లు (83.29శాతం), రబీలో రూ. 768.4 కోట్లకు రూ.734.77 కోట్లు (95.65 శాతం) ఇచ్చారు. మొత్తంగా రూ. 1,921.00 కోట్లకు గాను రూ.1,810.01 కోట్లు (94.22 శాతం) పంట రుణాలుగా ఇవ్వగా.. ఆ రుణాల రీ-షెడ్యూల్ కోసం వేచిచూస్తున్న రైతులకు ఆర్బీఐ ప్రకటన అశనిపాతంగా మారింది.
ప్రభుత్వ సిఫారసులు బేఖాతరు
2013లో రైతులు నాలుగు పర్యాయాలు భారీ వర్షాలు, వడగళ్ల వర్షాల నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. జనవరి 25, 26 తేదీలలో కురిసిన వర్షాలు పంటలను దెబ్బతీశాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో వరుసగా కురిసిన భారీ వర్షాలకు రైతులు అతలాకుతలం అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 9 జిల్లాల్లో 415 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆ మండలాల్లో రుణాల రీ-షెడ్యూల్‌కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆర్బీఐకి సుమారు నెల రోజుల క్రితం లేఖ రాసింది.
అందులో ఆదిలాబాద్ జిల్లాలో 39, మహబూబ్‌నగర్‌లో 7, కరీంనగర్‌లో 7, వరంగల్‌లో 3, నిజామాబాద్ లోని 22 మండలాలను చేర్చింది. బాల్కొండ, బీర్కూరు, మోర్తాడ్, దోమకొండ, మాచారెడ్డి, ఆర్మూరు, భిక్కనూర్, లింగంపేట్, కామారెడ్డి, గాంధారి, వర్ని, రెంజల్, నిజామాబాద్, బాన్సువాడ, నవీపేట, కోటగిరి, సిరికొండ, నాగిరెడ్డిపేట్, నందిపేట్, బోధన్ తదితర 22 మండలాలు ఆర్బీఐకి పంపిన జాబితాలో ఉన్నాయి. అయితే తాజాగా శనివారం ఆర్‌బీఐ ప్రభుత్వానికి రాసిన లేఖలో కేవలం మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రమే రుణాల రీ-షెడ్యూల్‌కు అవకాశం కల్పించింది. ఇందూరు జిల్లాను విస్మరించడంపై ఇక్కడి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. మొక్కుబడిగానే రిజర్వుబ్యాంకు రీ-షెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది.
ఇందూరు రైతన్నపై శీతకన్ను
Published Mon, Aug 11 2014 1:53 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement