Deccan Infrastructure and Land Holdings Limited
-
కాపాడలేం.. అమ్మేద్దాం!
సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డు, దానికి అనుబంధంగా ఉన్న ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)’ఆధీనంలోని భూములను అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల నిర్వహణ కోసం భారీగా నిధుల సమీకరణ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో.. ఈ భూముల విక్రయంపై దృష్టిసారించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గృహనిర్మాణ శాఖ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలిసింది. సదరు భూములపై ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. తొమ్మిదో షెడ్యూల్లో ఉండటంతో.. ఉమ్మడి రాష్ట్ర సమయంలో.. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే అనువైన ఇళ్లను సమకూర్చేలా హౌసింగ్‌బోర్డు ఆధ్వర్యంలో కాలనీలు రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. బోర్డు ఏర్పడే నాటికే తెలంగాణ ప్రాంతంలో దాని ఆ«దీనంలో భారీగా భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కూడా బోర్డు భూములను సమకూర్చుకుంది. ఇందులో భారీ వెంచర్ల కోసం ప్రత్యేకంగా ‘డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ హోల్డింగ్స్ లిమిడెడ్ (దిల్)’పేరిట అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో దిల్ పరిధిలో 1,800 ఎకరాల భూములు, హౌసింగ్ బోర్డు ఆ«దీనంలో మరో 820 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల అంశం రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం పరిధిలో ఉంది. హౌజింగ్‌బోర్డు, దిల్లకు సంబంధించి ఏ ప్రాంతంలోని భూములు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ పట్టుబట్టినా.. షీలా భిడే కమిటీ భిన్న నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఈ అంశం అలాగే తొమ్మిదో షెడ్యూల్లో తెగని పంచాయితీగా ఉండిపోయింది. హైకోర్టులో కేసు కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో సదరు భూములను అమ్మేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారుతోంది. కాపాడలేమంటూ కేంద్రం దృష్టికి.. హౌసింగ్‌బోర్డు, దిల్ భూములు కీలక ప్రాంతాల్లో ఉండటంతో వాటిపై కబ్జారాయుళ్ల దృష్టి పడింది. ఇప్పటికే చాలా భూములపై వివాదాలు మొదలయ్యాయి. ఈ భూముల విక్రయానికి ప్రక్రియ మొదలుపెట్టగానే.. అభ్యంతరాలు వస్తాయని, కోర్టులో కేసు ఉండగా ఎలా అమ్ముతారన్న ప్రశ్న వస్తుందని సర్కారు ముందుగానే అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇటు కోర్టుకు, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ భూముల పరిరక్షణ సవాల్‌గా మారిందన్న విషయాన్ని తెలియపర్చాలని భావిస్తోంది. ‘‘ఇప్పటికే చాలా భూములు వివాదంలో ఉన్నాయి. వాటితోపాటు క్లియర్‌గా ఉన్న మిగతా భూములను పరిరక్షించటం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కబ్జాలు ఇంకా పెరిగి వివాదాలు కోర్టుల్లో పెరిగేంత వరకు ఉపేక్షించటం సరికాదు. ఈ భూములకు సంబంధించి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అనుసరిస్తాం. ముందు వాటిని వేలం ద్వారా విక్రయించి, వచి్చన డబ్బును తదనుగుణంగా వినియోగించుకోవచ్చు. అందుకు వీలు కల్పించాలి’’అని కోర్టును కోరాలని యోచిస్తోంది. కేంద్రానికి కూడా ఇదే వివరించాలని.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ స్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ ప్రతినిధిని కూడా నియమించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. -
‘దిల్’ భూములు వెనక్కి!
వీటి విలువ రూ.3 వేల కోట్లపైనే.. నిరుపయోగంగా ఉన్న భూ కేటాయింపులు రద్దు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) సంస్థకు కట్టబెట్టిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఆ సంస్థకు ధారాదత్తం చేసిన 541.27 ఎకరాలకు సంబంధించిన కేటాయింపులను రద్దు చేసింది. ఈ భూముల విలువ దాదాపు రూ.3 వేల కోట్లపైనే ఉంటుం దని అంచనా.రాజధాని శివార్లలోని రాజేంద్రనగర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, మొయినాబాద్, శంషాబాద్, కీసర, ఘట్కేసర్, శంకర్పల్లి, మల్కాజిగిరి, సరూర్‌నగర్, మేడ్చల్‌లలో ఆ సంస్థకు కట్టబెట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అల్పాదాయవర్గాలకు సొంతింటి భాగ్యం కలిగించేందుకు... వివిధ సంస్థలకు భూములను కేటాయించేందుకు గత ప్రభుత్వం ‘దిల్’ను ఏర్పాటు చేసింది. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో వేల ఎకరాల భూనిధి (ల్యాం డ్ బ్యాంక్)ని ఆ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో చతికిలపడింది. దీనికితోడు రియల్ఎస్టేట్ రంగం కుదేలు కావడం.. రాష్ట్రంలో రాజ కీయ అనిశ్చితి నెలకొనడంతో దిల్ కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆ సంస్థ అట్టిపెట్టుకున్న భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణ యం తీసుకుంది. నిరుపయోగ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద సర్వే నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా నాలుగు ఎకరాలను మాత్రమే ఆ సంస్థ వినియోగంలోకి తెచ్చిందని గుర్తించింది. జిల్లాలో దిల్‌కు 2,084.19 ఎకరాలను కేటాయించారు. దీంట్లో నాలుగు ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నట్లు తేల్చింది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని భావిస్తున్న సర్కారు... వాటి స్థాపనకు తగినంత ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. దశలవారీగా మిగతా భూ కేటాయింపులను రద్దు చేయనున్నట్లు తెలిసింది. -
ఐదు వేల ఎకరాల ‘దిల్’ భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్టింగ్స్ లిమిటెడ్(దిల్) సంస్థకు భూమి కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంస్థకు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో గత ప్రభుత్వం కేటాయించిన 4,999.14 ఎకరాల భూములు ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నందున ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ బోర్డుకు అనుబంధంగా ఏర్పడిన దిల్‌కు పారిశ్రామికాభివృద్ధి అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఈ మేరకు భూములను కేటాయించింది. పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ భూములను దిల్ పలు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. అయితే భూములు పొందిన సంస్థలు ఏళ్లు గడిచినా నేటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో భూ కేటాయింపులను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.