‘దిల్’ భూములు వెనక్కి!
వీటి విలువ రూ.3 వేల కోట్లపైనే..
నిరుపయోగంగా ఉన్న భూ కేటాయింపులు రద్దు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) సంస్థకు కట్టబెట్టిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఆ సంస్థకు ధారాదత్తం చేసిన 541.27 ఎకరాలకు సంబంధించిన కేటాయింపులను రద్దు చేసింది. ఈ భూముల విలువ దాదాపు రూ.3 వేల కోట్లపైనే ఉంటుం దని అంచనా.రాజధాని శివార్లలోని రాజేంద్రనగర్, బాలానగర్, కుత్బుల్లాపూర్, మొయినాబాద్, శంషాబాద్, కీసర, ఘట్‌కేసర్, శంకర్‌పల్లి, మల్కాజిగిరి, సరూర్‌నగర్, మేడ్చల్‌లలో ఆ సంస్థకు కట్టబెట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
అల్పాదాయవర్గాలకు సొంతింటి భాగ్యం కలిగించేందుకు... వివిధ సంస్థలకు భూములను కేటాయించేందుకు గత ప్రభుత్వం ‘దిల్’ను ఏర్పాటు చేసింది. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో వేల ఎకరాల భూనిధి (ల్యాం డ్ బ్యాంక్)ని ఆ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో చతికిలపడింది. దీనికితోడు రియల్‌ఎస్టేట్ రంగం కుదేలు కావడం.. రాష్ట్రంలో రాజ కీయ అనిశ్చితి నెలకొనడంతో దిల్ కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆ సంస్థ అట్టిపెట్టుకున్న భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణ యం తీసుకుంది.
నిరుపయోగ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద సర్వే నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా నాలుగు ఎకరాలను మాత్రమే ఆ సంస్థ వినియోగంలోకి తెచ్చిందని గుర్తించింది. జిల్లాలో దిల్‌కు 2,084.19 ఎకరాలను కేటాయించారు. దీంట్లో నాలుగు ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నట్లు తేల్చింది. నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని భావిస్తున్న సర్కారు... వాటి స్థాపనకు తగినంత ల్యాండ్‌బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. దశలవారీగా మిగతా భూ కేటాయింపులను రద్దు చేయనున్నట్లు తెలిసింది.