కొండంత సందడి
గోల్కొండ: స్వాతంత్య్ర దినోత్సవానికి గోల్కొండ కోటను ముస్తాబు చేస్తున్నారు. అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ కోట, గోల్కొండలోని ప్రధాన రహదారులతో పాటు టోలీచౌకి, మెహిదీపట్నం, రేతీబౌలి, నానల్‌నగర్ తదితర ప్రాంతాలలోని ప్రధాన రహదారులు, పుట్‌పాత్‌లకు మెరుగులు దిద్దుతున్నారు. కోట బస్టాప్ వద్ద బారికేడ్లు నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర వీఐపీలు వ చ్చే ప్రధాన రహదారులను సుందరీకరిస్తున్నారు. కోటలోకి పర్యాటకులను అనుమతించడంలేదు.
ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ...
రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ ఎం.భగవత్ ఏర్పాట్లను పరిశీలించారు. కోటకు వచ్చే దారుల్లో పర్యటించారు. గౌరవ వందనం, పతావిష్కరణ ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కోట ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌ను, ఎడమ భాగంలో ఉన్న గార్డెన్‌లోకి తరలించాలని ఆదేశించారు. అంతే కాకుండా మరో భారీ సైజు ఎల్ఈడీ స్క్రీన్‌ను రాణిమహల్ కింది భాగంలో ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుల రిహార్సిల్స్‌ను ఆయన తిలకించారు.
తుది దశలో ఏర్పాట్లు...
కాగా పంద్రాగస్టు వేడుకల కోసం కోటలో జరుగుతున్న ఏర్పాట్లు తుదిదశకు చేరాయి. జెండా ఆవిష్కరించడానికి 60 అడుగుల పోల్‌ను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన వేదికకు ఇరువైపుల పరిమిత సంఖ్యలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం రెండవ వరుసలో సింగిల్ చైర్లు వేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన సేఫ్‌హౌస్‌ను ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు.
మోహరించిన పోలీసులు...
బుధవారం ఉదయం నుంచి కోటకు వచ్చే మార్గాలలో పోలీసులు మొహరించారు. రాందేవ్గూడా చౌరస్తా నుంచి కోట మెయిన్‌గేట్ వరకు బాంబు స్క్వాడ్ బృందం ముమ్మర తనిఖీలు నిర్వహించింది. లంగర్‌హౌస్ - గోల్కొండ కోట రోడ్డు, టోలీచౌకి నుంచి గోల్కొండకు వె ళ్లే రోడ్ల పరిసరాల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో పుట్‌పాత్‌లపై ఉన్న తోపుడు బండ్లు, డబ్బాలను తొలగించారు. వీవీఐపీల వాహనాలను పార్కింగ్ చేసే ప్రదేశాలలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.