Deenanath Mangeshkar Awards
-
బిగ్ బీకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ బచ్చన్‌ను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2022న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఈ పురస్కారంతో అమితాబ్‌ను సత్కరించనున్నారు. కాగా.. 2023లో ఈ అవార్డ్‌ను మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లేకు బహుకరించారు. అంతేకాకుండా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గానూ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కూడా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారి కుటుంబం వెల్లడించింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్‌స్తంభ్ ఫౌండేషన్ మనోబల్‌కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహిస్తారని.. ఆశా భోంస్లే చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. -
మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
ఆదివారం జరిగిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముంబైకి వచ్చారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు లభించింది. ఆయన అవార్డును అందుకున్న తర్వాత కొంతసేపు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...లతా దీదీ నాకు అక్కలాంటిది. ఆమె నుంచి నేను ఎనలేని ప్రేమను పొందాను. లతా దీదీ లాంటి అక్క పేరు మీద అవార్డు వచ్చినప్పుడు, అది ఆమెలోని ఏకత్వానికి, నాపై ఉన్న ప్రేమకు ప్రతీక. అందుకే అంగీకరించక పోవడం నాకు సాధ్యం కాదు అని అన్నారు. ఈ అవార్డును ప్రధాని మోదీ తన దేశ ప్రజలందరికీ అంకితం చేశారు. అంతేకాదు లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే, తన సోదరి లతా మంగేష్కర్‌కు నివాళులర్పించడమే కాకుండా 'ఆయేగా ఆనేవాలా' పాట ట్యూన్‌ను హమ్ చేసింది. లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును నెలకొల్పారు. దేశ నిర్మాణానికి ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తికి ప్రతి ఏడాది ఈ అవార్డు ఇవ్వబడుతుందని లతా మంగేష్కర్ కుటుంబం, మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్ పేర్కొంది. సినిమా రంగంలో చేసిన సేవలకుగానూ ప్రముఖ నటులు ఆశా పరేఖ్, జాకీ ష్రాఫ్‌లు మాస్టర్ దీనానాథ్ పురస్కారం (ప్రత్యేక గౌరవం) అందుకున్నారు. భారతీయ సంగీతానికి గానూ రాహుల్ దేశ్‌పాండేకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం లభించగా, ఉత్తమ నాటక అవార్డు సంజయ్ ఛాయాకు లభించింది. (చదవండి: ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్లో మోదీ పర్యటన.. కామెంట్స్ ఇవే..) -
‘దీనానాథ్’ అవార్డు ప్రదానం
ముంబై: మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డులను సామాజిక కార్యకర్త అన్నాహజారే, సంగీత విద్వాంసుడు జాకిర్ హుస్సేన్, సీనియర్ నటుడు రిషి కపూర్ తదితరులకు గురువారం రాత్రి ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి, ప్రముఖ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి యేటా ఏప్రిల్ 24వ తేదీన ‘స్మృతి దిన్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా, సంగీతం, నటన, సాహిత్యం, సామాజిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులకు దీనానాథ్ అవార్డును అందజేసి సత్కరిస్తున్నట్లు వివరించారు. ఈ అవార్డు కింద రూ.లక్ష పారితోషికం, మెమెంటో అందజేశామన్నారు. సినిమా రంగానికి గాను సీనియర్ నటుడు రిషికపూర్‌కు, సంగీత రంగంలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్త అన్నాహజారే, శివాజీ సతమ్, పండిట్ పండరీనాథ్ కొల్హా పురీ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. కాగా రిషికపూర్ రెండేళ్ల వయసులో తన చేతుల్లో ఆడుకున్నాడని, ఇప్పుడు ఒక సీనియర్ నటుడిగా తన తండ్రి పేరిట అవార్డును అందుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఉస్తాద్ జాకీర్ హస్సేన్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అతడు తనను కన్నకూతురిగా చూసుకునేవారని, ఒకే రోజు ఆయన సంగీత సారథ్యంలో ఆరు పాటలు రికార్డు చేశామని లత వివరించారు. ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన రాలేగాంసిద్ధి మీదుగా ప్రయాణించినప్పుడు హృదయ్నాథ్ మంగేష్కర్ తనను కలిసినప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తనకు ఇటీవల కాలంలో రూ.కోటికిపైగా పారితోషికం కలిగిన అవార్డులను ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారని అయితే తాను తిరస్కరించానని చెప్పారు. అయితే లతా మంగేష్కర్ తనను ఈ అవార్డు కోసం సంప్రదించిన వెంటనే ఆనందంగా అంగీకరించానని వివరించారు.