ముంబై: మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డులను సామాజిక కార్యకర్త అన్నాహజారే, సంగీత విద్వాంసుడు జాకిర్ హుస్సేన్, సీనియర్ నటుడు రిషి కపూర్ తదితరులకు గురువారం రాత్రి ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి, ప్రముఖ సంగీత విద్వాంసుడు దీనానాథ్ మంగేష్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి యేటా ఏప్రిల్ 24వ తేదీన ‘స్మృతి దిన్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సినిమా, సంగీతం, నటన, సాహిత్యం, సామాజిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులకు దీనానాథ్ అవార్డును అందజేసి సత్కరిస్తున్నట్లు వివరించారు.
ఈ అవార్డు కింద రూ.లక్ష పారితోషికం, మెమెంటో అందజేశామన్నారు. సినిమా రంగానికి గాను సీనియర్ నటుడు రిషికపూర్‌కు, సంగీత రంగంలో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, సామాజిక కార్యకర్త అన్నాహజారే, శివాజీ సతమ్, పండిట్ పండరీనాథ్ కొల్హా పురీ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. కాగా రిషికపూర్ రెండేళ్ల వయసులో తన చేతుల్లో ఆడుకున్నాడని, ఇప్పుడు ఒక సీనియర్ నటుడిగా తన తండ్రి పేరిట అవార్డును అందుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఉస్తాద్ జాకీర్ హస్సేన్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అతడు తనను కన్నకూతురిగా చూసుకునేవారని, ఒకే రోజు ఆయన సంగీత సారథ్యంలో ఆరు పాటలు రికార్డు చేశామని లత వివరించారు. ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన రాలేగాంసిద్ధి మీదుగా ప్రయాణించినప్పుడు హృదయ్‌నాథ్ మంగేష్కర్ తనను కలిసినప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తనకు ఇటీవల కాలంలో రూ.కోటికిపైగా పారితోషికం కలిగిన అవార్డులను ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారని అయితే తాను తిరస్కరించానని చెప్పారు. అయితే లతా మంగేష్కర్ తనను ఈ అవార్డు కోసం సంప్రదించిన వెంటనే ఆనందంగా అంగీకరించానని వివరించారు.
‘దీనానాథ్’ అవార్డు ప్రదానం
Published Fri, Apr 25 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement