Deendayal Upadhyaya
-
సర్కారు బడి కూల్చివేతకు బీజేపీ యత్నాలు: ఆప్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించే పార్టీ కేంద్ర కార్యాలయం కోసం బీజేపీ ప్రభుత్వ పాఠశాలను కబ్జా చేస్తోందని ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న పాఠశాల స్థలాన్ని ఇప్పటికే కొంత ఆక్రమించిన బీజేపీ..ఇప్పుడు అభివృద్ధి పేరుతో భవనాన్ని సైతం కూలగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆప్ అలా జరగనీయబోదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. స్కూలు భవనాన్ని కూలగొడితే 350 మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఒక్క స్కూల్‌ను కూడా ధ్వంసం కానివ్వమన్నారు. -
కేంద్ర పథకాలకు మార్గదర్శి
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గొప్ప మేధావి, కార్యశీలి, రాజనీతిజ్ఞుడు, నిస్వార్థ సేవకుడు. దీనదయాళ్ ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ఆర్ఎస్ఎస్ శాఖలో చేరారు, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రేరణతో 1951లో రాజకీయ క్షేత్రం భారతీయ జనసంఘ్‌లో ప్రచారకులుగా చేరారు. ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణలో క్రియాశీలక పాత్ర పోషించారు. అఖిలభారత అధ్యక్షులుగా పట్నాకు రైలులో ప్రయాణిస్తున్న దీన దయాళ్ ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం వద్ద శవమై పడి ఉన్నారు. ఆయన మరణం గురించి ఇప్పటివరకు అసలు నిజాలు వెలుగులోకి రాలేదు. దీనదయాళ్ అందించిన ఏకాత్మ మానవ దర్శనం (ఇంటిగ్రల్ హ్యూమనిజం) అనే గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని బీజేపీ తన రాజకీయ తాత్విక సిద్ధాంతంగా పేర్కొంటుంది. దీన దయాళ్ తన ఏకాత్మ మానవ దర్శనంలో ఈ దేశం అభివృద్ధికి చేపట్టే ప్రణాళిక ఏదైనా... అది దేశానుగుణం, కాలానుగుణమై ఉండాలని చెప్పారు. రాజకీయ, ఆర్థిక రంగాలలో వికేంద్రీ కరణను; ప్రభుత్వ రంగంతో పాటు ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం ప్రాధాన్యం కూడా గుర్తించాలనీ, దేశంలో ప్రతి వ్యక్తీ ఉపాధి పొందాలనీ, తద్వారా ఉత్పత్తికి దోహదపడాలనీ వారు కోరుకున్నారు. భారీ పరిశ్రమలు వద్దన్నారు. కుటీర పరిశ్రమలే కావాలన్నారు. లోటు బడ్జెట్, ద్రవ్యోల్బణాలకు ప్రభుత్వం చేసే అధిక ఖర్చు కారణమని చెప్పి... పొదు పును ప్రోత్సహించారు. ఆర్థిక అవసరాల కోసం ప్రకృతిని నాశనం చేయకూడదనీ, ఆర్థిక ఫలాలు అందరికీ అందజేయాలనీ అన్నారు. (చదవండి: శతవసంత స్వరమాధురి) ఈ సిద్ధాంతం ఆధారంగానే... దీన దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన, ప్రధాని ఆవాస్ యోజన, గ్రామ జ్యోతి యోజన, కౌశల్ యోజన, ప్రధాన మంత్రి సడక్ యోజన, బేటీ బచావో బేటీ పఢావో, ఆత్మనిర్బర్ భారత్ వంటి అనేక పథకాలతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ వంటి నినాదాలతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీనదయాళ్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి! – శ్రీశైలం వీరమల్ల, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు (ఫిబ్రవరి 11న దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి) -
ఈ మానవతావాదం ‘సంపూర్ణ’మేనా?
దీన్‌దయాళ్ ప్రతిపాదించినట్లు చెబుతున్న సంపూర్ణ మానవతావాద సిద్ధాంతం తమ అధికారిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే కీలకమైన తత్వశాస్త్రమని ఆరెస్సెస్, బీజేపీ మేధావులు చెబుతున్నారు. మన దేశంలోని మైనారిటీలు మాత్రమే కాకుండా శూద్ర, దళిత, ఆదివాసులు కూడా ఈ సిద్ధాంతాన్ని పరిశీలించడం ముఖ్యం. ఎందుకంటే హిందుత్వ వర్ణధర్మ పరంపరలో చెప్పిన కనీస సమానత్వ ప్రతిపత్తిని కూడా శూద్ర, దళిత, ఆదివాసులకు కల్పించలేదు. సంపూర్ణ మానవతావాదం... హిందుత్వ బ్రాహ్మణిజంతో పోలిస్తే ఎలా భిన్నమైంది అని దేశానికి తెలపాల్సి ఉంది. మానవ, లింగ సమానత్వాన్ని, కులనిర్మూలనను, అస్పృశ్యత రద్దును ప్రతిపాదించని, ఆచరించని సిద్ధాంతం సంపూర్ణ మానవతావాదం ఎలా అవుతుందో వీరు స్పష్టం చేయవలసి ఉంది. ఆరెస్సెస్, బీజేపీకి చెందిన మేథావులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ (1916–1968) ప్రతిపాదించినట్లు చెబుతున్న సంపూర్ణ మానవతావాదం సిద్ధాంతాన్ని ముందుపీఠికి తీసుకొస్తున్నారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, కార్యదర్శి రామ్ మాధవ్ పదేపదే ఉపాధ్యాయ సూత్రీకరించిన సంపూర్ణ మానవతావాదం గురించి మాట్లాడుతున్నారు. తమ అధికారిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండే కీలకమైన తత్వశాస్త్రంగా వీరు ఈ సిద్ధాంతాన్ని భావిస్తున్నారు. ఈ తాత్వికతే తన ప్రభుత్వాన్ని నడిపించే దీపస్తంభమని ప్రధాని నరేంద్రమోదీ తరచుగా చెబుతూ వస్తున్నారు. రామ్ మాధవ్ తాజా పుస్తకం ‘ది హిందుత్వ పారడైమ్: ఇంటెగ్రల్ హ్యూమనిజం అండ్ క్వెస్ట్ ఫర్ ఎ నాన్–వెస్టర్న్ వరల్డ్ వ్యూ’ ఆవిష్కరణ సందర్భంగా హొసబలె ఈ సిద్ధాంతాన్ని వివరిస్తూ ‘హిందూత్వ అనేది వామపక్షమూ కాదు, మితవాద పక్షమూ కాదు.. సంపూర్ణ మానవతావాదమే దాని సారాంశం’ అని పేర్కొన్నారు. సంపూర్ణ మానవతావాదం అనేది ఆరెస్సెస్ తొలి ప్రబోధకులైన సావర్కర్, హెగ్డేవార్, గోల్వాల్కర్ల ప్రతిపాదనలకు అంత భిన్నమైనదా అనేదే అసలు ప్రశ్న. మన దేశంలోని మైనారిటీలు మాత్రమే కాకుండా శూద్ర, దళిత, ఆదివాసుల కోణంలో కూడా ఈ సిద్ధాంతాన్ని పరిశీలించడం ముఖ్యం. ఎందుకంటే హిందుత్వ తత్వవేత్తలు వర్ణధర్మ పరంపరలో చెప్పిన కనీస సమానత్వ ప్రతిపత్తిని కూడా శూద్ర, దళిత, ఆదివాసులకు కల్పించకపోగా, మైనారిటీలకు వ్యతిరేకంగా వారిని బలమైన శక్తిగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఒక ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేస్తూ తన జీవితకాలంలోనే ఆ సంస్థ రాజకీయ విభాగమైన భారతీయ జనసంఘ్ రెండో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈయన మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె, రామ్ మాధవ్ లాగే ఒకేరకమైన బాల్య వాతావరణంలో పెరిగారు. వివిధ రాష్ట్రాలకు చెందినప్పటికీ వీరందరూ ఒకే కులనేపథ్యం కలిగినవారు. ప్రారంభంలోని వీరి సైద్ధాంతిక రచనల్లో, ప్రత్యేకించి గోల్వాల్కర్ రచనల్లో హిందుత్వ పరంపరాగత వ్యవస్థను విస్తృతంగా వివరిస్తూ వచ్చారు. వీరు మాత్రమే కాదు.. హిందూయిజాన్ని ఒక మిలిటెంట్ రాజకీయ శక్తిగా మార్చాలని సూత్రీకరించిన ఆరెస్సెస్ తొలి సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్ కూడా బ్రాహ్మణుడే. ఇప్పుడు సంపూర్ణ మానవతావాదం అని పిలుస్తున్న గొప్ప మూల సిద్ధాంత నిర్మాణ కర్తగా దీన్దయాళ్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, ఆరెస్సెస్ సిద్ధాంతకర్తల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా శూద్ర, దళిత, ఆదివాసీల నుంచి పుట్టుకురాలేదు. చివరకు రిజర్వేషన్లకు వెలుపల ఉండిపోయిన జాట్లు, మరాఠాలు, పటేల్స్, కమ్మ, రెడ్డి, లింగాయత్, ఒక్కళిగ, నాయికర్లు, మహిస్యాలు వంటి శూద్ర వ్యవసాయ కులాలు మొత్తంగా ఆరెస్సెస్ మద్దతుదారులుగా, కార్యకర్తలుగా చాలాకాలంగా పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఇంతకాలంగా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తగా గానీ, దాని అధినేతగా గానీ కాలేకపోయారు. హిందుత్వ చారిత్రక వికాస దశలో కూడా శూద్ర, దళిత, ఆదివాసీలకు చెందినవారు ఒక్కరు కూడా చింతనాపరులుగా రూపొందలేకపోయారు. ఇప్పుడు అసలు ప్రశ్న. బ్రాహ్మణులు మాత్రమే ఆరెస్సెస్ అధినేతలవుతూ అప్పుడూ, ఇప్పుడూ సంపూర్ణ మానవతావాద సిద్ధాంతాలను ఎలా వల్లించగలుగుతున్నారు? హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో శూద్ర, దళిత, ఆదివాసులు భాగమై ఉంటున్నప్పటికీ వీరిలో ఒక్కరు కూడా ఒక పూజారిగా, సిద్ధాంతవేత్తగా కాకతాళీయంగా కూడా ఎందుకు కాలేకపోయారు? దేశంలో మతపరమైన సాంస్కృతిక నిర్మాణం కొనసాగుతున్నం దున, కుల సాంస్కృతిక అభివృద్ధి కూడా బాల్యం నుంచే కొనసాగుతూ వస్తోంది. ఈ కులపరమైన సాంస్కృతిక పెంపకం ఇతర కులాలతో కలిసి జీవించే ఎలాంటి సమగ్ర అస్తిత్వాన్ని పెంచి పోషించలేదు. అందుకే భారత్‌ని వ్యక్తిగతంగా అందరూ సమానంగా ఉండే సాంస్కృతిక దేశంగా రూపొందించే లక్ష్యాన్ని ఈ సంపూర్ణ మానవతావాదం కలిగిలేదని చెప్పాలి. కాబట్టి హిందూయిజాన్ని ఆధ్యాత్మిక ప్రజాస్వామిక మతంగా మార్చే ఎలాంటి గొప్ప నిర్మాణం కూడా ఉనికిలో లేదు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రాన్ని పరిమితంగా సమర్థిస్తూనే.. పెట్టుబడిదారీ వ్యక్తివాదం, మార్క్సిస్ట్ సోషలిజం రెండింటినీ వ్యతిరేకించారు. అయితే పాశ్చాత్య, ప్రాచ్య విజ్ఞాన శాస్త్రాలు ఏవైనా సరే.. వ్యవసాయ ఉత్పాదక, చేతివృత్తులకు సంబంధించిన పనుల్లో పవిత్రత, మాలిన్యం సూత్రాలను ప్రతిపాదించకుండానే, శ్రమను గౌరవించే పునాదులను కలిగి ఉంటూ వచ్చాయి. శ్రామికులు ఉత్పత్తిచేసే సరకులు, వస్తువుల విషయంలో ఇవి ఎలాంటి భేదభావాన్ని ప్రకటించలేదు. కానీ ఒక సంస్థగా బ్రాహ్మణిజం పునాదులపై నిలిచిన ఆరెస్సెస్... పవిత్రత, అపవిత్రత, కులాలు, జెండర్ వారీగా అసమానత్వం, మానవ అస్పృశ్యతను ప్రతిపాదించే బ్రాహ్మణవాద విలువల చుట్టూ ఏర్పడిన భారతీయ పరంపరతో కొనసాగుతోంది. ఈ దేశంలోని బ్రాహ్మణ మార్క్సిస్టులు, ఉదారవాద మేధావులు తీసుకొచ్చినట్లుగా కులాన్ని ఒక సమస్యాత్మక అంశంగా కూడా దీన్‌దయాళ్ ఎన్నడూ ప్రతిపాదించలేదు. అలాగే మహాత్మా పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు సూత్రీకరించిన కుల సంస్కృతిపై సమకాలీన ఆరెస్సెస్/బీజేపీ మేధావులు ఎవరూ వ్యాఖ్యానించిందీ లేదు. మానవ అస్పృశ్యత, కుల నిర్మూలన అనేవి మానవ జీవితంలోని అన్ని అంశాల్లో కీలక సూత్రంగా ఉండాలని పూలే, అంబేడ్కర్ చేసిన ప్రతిపాదనలను వీరు కనీసంగా కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో మానవ అస్పృశ్యత మినహా హిందూ వర్ణ ధర్మాన్ని బలపర్చిన మహాత్మాగాంధీ సర్వోదయ, గ్రామ్ స్వరాజ్లను మిళితం చేయడానికి దీన్‌దయాళ్ ప్రయత్నించారు. హిందూ పురాణాలు, దేవుళ్లు కూడా తొలినుంచి మైనారిటీలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడాన్నే ప్రబోధిస్తూ వచ్చాయన్నది అందరికీ తెలిసి విషయమే. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న ఆరెస్సెస్, బీజేపీ మేధావులు ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తారు? హిందూ దేవతలు కులపరమైన ఆధ్యాత్మిక మూలాలను ప్రోత్సహిస్తూ, సంస్థాగతీకరిస్తున్నప్పుడు వీరు ముందుకు తీసుకొస్తున్న సంపూర్ణ మానవతావాద భావం ఎలా సాధ్యమవుతుంది? దేవుడొక్కడే, మనుషులందరినీ దేవుడు సమానులుగా సృష్టించాడు అనే సూత్రం ఉనికిలో ఉన్నప్పుడే ఏకాత్మవాద భావన సాధ్యమవుతుంది. అందుకే హిందుత్వ ప్రాపంచిక దృక్పథంలో పనిచేస్తున్న శూద్ర, దళిత, ఆదివాసీల ముందు ఇప్పుడున్న పెను సవాలు ఏమిటి? అంటే ఈ సంపూర్ణ మానవతావాద సిద్ధాంతం ప్రతిపాదిస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక జాతీయవాదంలో తమ స్థానం ఎక్కడ అనేది వీరు ప్రశ్నించుకోవాలి. ఆరెస్సెస్, బీజేపీ మేధావులు ప్రచారం చేస్తున్న సంపూర్ణ మానవతవాద తాత్వికతలో కుల నిర్మూలన, లైంగిక సమానత్వం, అస్పృశ్యత రద్దు అనే కీలకమైన అంశాలకు చోటే లేదు. అందుకే హిందుత్వ సంస్థల్లో కూడా శూద్రులు, దళితులు, ఆదివాసీల అసమాన స్థితి కొనసాగుతూనే ఉంది. శూద్ర, దళిత, ఆదివాసీ మేధావుల స్వీయప్రతిపత్తిని హిందుత్వ సంస్థల నిర్మాణాలు ఇప్పటికీ అనుమతించలేదు. మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె, రామ్ మాధవ్ వంటివారు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న సంపూర్ణ మానవతావాదం అనేది హిందుత్వ బ్రాహ్మణిజంతో పోలిస్తే ఎలా భిన్నమైంది అని దేశానికి తెలియజెప్పాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కీలక సమస్యలుగా ఉన్నవాటిని ఈ కొత్త సిద్ధాంతం ఎలా పరిష్కరిస్తుంది అని వీరు వివరించాలి. అప్పుడు మాత్రమే జాతి వీరికి ధన్యవాదాలు చెబుతుంది. వ్యాసకర్త: ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
సంస్కృతీ పథ నిర్దేశకుడు దీన్‌దయాళ్
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పుణికిపుచ్చుకొన్న పథ నిర్దేశకుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా నాగుల చంద్రభాన్ గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో రామ్ పారి, భగవతి ప్రసాద్‌లకు జన్మించారు. చిరుప్రాయంలోనే తల్లితండ్రులను కోల్పోయి బంధువుల దగ్గర పెరిగారు. చదువులో చురుకుగా ఉండేవారు. సర్వ బోర్డు పరీక్షలో ఆయన ప్రథముడు. కాన్పూర్‌లో బీఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. 1937లో ఆర్ఎస్ఎస్తో పరిచయమైంది. సంఘ నిర్మాత డా. కేశవరావ్ బలిరావ్ హెగ్డేవార్‌తో కలిశారు. 1939లో లక్షిపూర్లో సంఘ్ ప్రచారక్‌గా నియమితులయ్యారు. 1945లో సంపూర్ణ ఉత్తరప్రదేశ్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వల్కర్.. దీన్‌దయాళ్ కార్య నిబద్ధతను గ్రహించారు. 1947లో స్వాతంత్య్రం లభించిన తరువాత దేశ విభజనలో కాశ్మీర్ లో జరుగుతున్న అల్లకల్లోలం, హిందువుల ఊచకోతలు మానభంగాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో నెహ్రూ ప్రభుత్వం అసహాయత, నిర్లిప్తతతో అనేకమంది నిరాశకు గురయ్యారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తితో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1950లో నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి వ్యతిరేకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గురూజీ గోల్వాల్క ర్ను సంప్రదించి 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు.. కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాకుండా ప్రత్యామ్నాయ పరిష్కారాలతో, స్పష్టమైన సిద్ధాంతాలతో సమృద్ధ భారత నిర్మాణానికీ ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. తర్వాత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. రష్యాతో పాటు అనేక పాశ్చాత్య దేశాల్లో నూతన ప్రజాస్వామిక విలువలతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని లోతుగా అధ్యయనం చేసి భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్. అదే ఏకాత్మ మానవతా వాదం. చదువులేని వారు, దరిద్రులు, దీన హీన స్థితిలో ఉన్నవారు, నిరుపేద వ్యక్తులే నారాయణులు అని ‘దరిద్రో దేవోభవ’ అని వారు చెప్పారు. సాధారణ జీవితం.. అసాధారణ చింతన అన్నదే ఆయన ఆలోచన. పేదలు, దీనుల పట్ల దళితుల పట్ల మమత్వ భావం ఉండాలనీ, వారికి సముచిత స్థానం కల్పించాలని కూడా చెప్పారు. సిద్ధాంతాలను ఆచరించడంలో నిబద్ధతతో ఉండేవారు. ఉదాహరణకు 1953లో రాజస్తాన్‌లో 9 మంది ఎమ్మెల్యేలు జనసంఘ్ తరపున గెలిచారు. అప్పుడు జమిందారీ విధానం రద్దు చేయమని చట్టం తెస్తున్న సమయంలో 6 మంది ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకించడంతో పార్టీ సిద్ధాం తానికి వ్యతిరేకం అని వారిని దీన్‌దయాళ్ బహిష్కరిం చారు. 1967 ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌కు 9.33 శాతం ఓట్లు సంపాదించి భారత రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాతి స్థానాన్ని సంపాదించారు. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా కృపాలాని లాంటి వారితో మంచి సంబంధాలు కొనసాగించి పార్టీకి విస్తృత స్థాయిని కల్పించారు. 1963లో కేరళలోని కాలికట్ సమావేశంలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో ఆయన హత్యకు గురయ్యారు. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆయనతో పాటు కలిసి పనిచేసిన వారిలో బావురావు దేవరసు, బాలరాజ్ మండల్, అటల్ బిహారి వాజ్‌పేయ్, లాల్‌కృష్ణ అడ్వాణీ నానాదేశ్‌ముఖ్, సుందర్ సింగ్ బండారు, జగన్నాథరావు జోషి, మురళీ మనోహర్ జోషి, జేపీ మాథుర్ ముఖ్యులు. ఆనాడు దీన్‌దయాళ్ నాటిన చిన్న బీజం ఈ రోజు మహా వటవృక్షంగా మారింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే అటల్ బిహారి వాజ్‌పేయ్ 1998లో మొదటిసారి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు. ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే వాజ్‌పేయ్ ఆర్థిక సంస్కరణలు చేసి అణుబాంబు పరీక్ష కూడా నిర్వహించారు. అదే సిద్ధాంత స్ఫూర్తితో ప్రస్తుతం నరేంద్ర మోదీ తొలిసారిగా సంపూర్ణ మెజారిటీతో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి పలు సంస్కరణలు వేగవంతం చేస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ సిద్ధాంతాలను, ఆదర్శాలను అంకితభావంతో పాటించడమే వారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. (పండిట్ దీన్‌దయాళ్ 104వ జయంతి సందర్భంగా) వ్యాసకర్త: బండారు దత్తాత్రేయ , హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ -
దీన్‌దయాళ్ అడుగుజాడలు అనుసరణీయం
కొందరు మరణించేవరకు జీవి స్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన వారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఉత్తరప్రదేశ్‌లోని మొగల్ సరాయ్ రైల్వే స్టేష న్లో ఒక గుర్తు తెలియని మృతదేహం రైలు పట్టాలపై ఉంది. పోలీ సులు ఆయన పెట్టెలోని వస్తువులను బట్టి అందులో సంఘ్ నిక్కరుని చూసి గుర్తుపట్టారు తాను జనసంఘ్ వ్యవస్థాపకులు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అని. నిత్యం ఉదయం సంఘ ప్రార్థన, రాత్రి పడుకునే ముందు సంఘ ప్రతిజ్ఞను మననం చేసుకొని జీవించేవారు. ప్రార్థన, ప్రతిజ్ఞ రెండు కళ్లు అని సంఘ్ ప్రచారకులు భావిస్తారు. అలా ఆచరణలో భాగంగానే ఎప్పటిలానే రెండు జతల బట్టలతో పాటు సంఘ్ నిక్కరును తన పెట్టెలో పెట్టుకుని బయలుదేరారు. ఆ సంఘ్ నిక్కర్ వలననే అసామాన్యమైన ఆ వ్యక్తిని గుర్తు పట్టగలిగారు. భారతీయ జనసంఘ్ స్థాపనకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవు అన్న వారి నోళ్ళు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడి ఉన్న మానవుడు జీవితంలో సుఖంగా వర్ధిల్లి, ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. కేవలం భారతీయులను ఉద్దేశించి మాత్రమే కాకుండా విశ్వమానవాళిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన సిద్ధాంతం ఏకాత్మతా మానవతావాదం. వ్యక్తి శీలం గొప్పది, సమాజ శీలం ఇంకా గొప్పది అని ఆయన చెప్పేవారు. జాతి, జాతీయత, భారతీయ సంస్కృతి, ధర్మం వంటి విషయాలపై తన అభిప్రాయాలు, మౌలిక సిద్ధాంతాలు తదితరాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది. ఆనాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతో కూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆరెస్సెస్ సర్ సంఘ చాలకులు పూజ్య గురూజీ సహాయం అర్ధించగా ఆ పనిని వారికే అప్పగించారు. అలా పురుడు పోసుకున్నది భారతీయ జనసంఘ్. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న వారికి తోడుగా అప్పటికే యువకులుగా పనిచేస్తున్న అటల్ బిహారీ వాజ్‌పేయి, సుందర్ సింగ్ భండారి, జగన్నాథరావు గార్లను వారికి అప్పగించారు. ప్రేరణనిచ్చే ఆదర్శ మహాపురుషులలో పండిత దీన్ద యాళ్‌జీ ఒకరు. మహా పురుషుడు అని ఆయన విరోధులు కూడా అనేవారు. ఆనాడు ప్రజా సోషలిస్టు పార్టీ నాయకులు నాదపాయ్ గాంధీ, దీన్ దయాళ్ను తిలక్, బోసుల పరంపరలో ఒకరిగా అభివర్ణిం చారు. ఆనాటి కమ్యూనిస్టు నాయకులు హీరేన్ గారు అజాత శత్రువుగా పేర్కొన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ యువకుడిగా ఉన్నప్పుడే వ్యక్తి, సమాజం, స్వదేశీ, స్వధర్మం, పరంపర, సంస్కృతి లాంటి విషయాలపై ఆకర్షితులయ్యారు. వీటిపై లోతుగా అధ్యయనం చేశారు కూడా. భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు వారే అయినప్పటికీ 1951లో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల నుండి బయటకు వచ్చిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 1967 వరకు దీన్‌దయాళ్‌జీ బాధ్యతలు నిర్వహించారు. డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం తరువాత జాతీయ అధ్యక్షులుగా పార్టీ పనిని తన భుజాలపై వేసుకుని నడిపించారు. జాతి సమగ్ర ఉన్నతిని సాధించడంలో సమర్థంకాగల ఒక రాజనీతి సిద్ధాంతాన్ని వికసింపచేయాలని కోరుకునేవారు. అదే ఏకాత్మతా మానవతావాదం. ఈ అంశంపై తొలిసారిగా 1964 గ్వాలియర్ మహాసభలో చర్చకు ప్రతిపాదించారు. ఆ తర్వాత 1965లో విజయవాడలో జరిగిన జనసంఘ్ మహాసభలలో ఇది ఆమోదం పొందింది. అదే ఏడాది పుణేలో 4 రోజుల పాటు జరిగిన ఉపన్యాస మాలలో విస్తృతమైన వివరణ ఇచ్చారు. సంపదను ఒకేచోట కేంద్రీకృతం చేయకూడదు అన్నారు దీన్‌దయాళ్‌జీ. ఏకాత్మక రాజ్యం అంటే సంపూర్ణమైన శక్తి లేదా అధికారాల కేంద్రీకరణ కాదు. ఏకాత్మక రాజ్యం అంటే కేంద్రీకృత నిరంకుశత్వం కాదు. అలాగే ప్రాంతాలను పరిసమాప్తం చేయాలని కూడా దాని అర్థం కాదు. ప్రాంతాలకు అధికారాలు ఉండాలి. ఈ ప్రాంతాల కింద మిగిలిన సంస్థలు, జిల్లాలు ఉంటాయి వాటికి కూడా అధికారాలు ఉంటాయి అదేవిధంగా పంచాయతీలు కూడా. ఈవిధంగా అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడు శక్తి కింద వరకు విస్తరిస్తుంది. ఈ మాదిరిగా అనేక శక్తి స్థానాలు ఏర్పడి వీటన్నిటి కేంద్రంగా ఏకాత్మక రాజ్యం ఉంటుంది. అది మన ధర్మానికి అనుగుణం కాగలదు. వసతులు, రవాణా వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు ఇప్పటిలాగా లేకపోయినా జనసంఘ్ విస్తరణలో నిష్ణాతులైన కార్యకర్తలను దేశానికి అందించడంలో ఆయన కార్యదీక్ష ఎనలేనిది. అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్ 25న జన్మించిన దీన్‌దయాళ్‌జీ ఆసామాన్య వ్యక్తిగా ఎదిగారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో మేనమామ ఇంట్లోనే పెరిగారు. 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన కాన్పూర్‌లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. సంఘంలో పనిచేస్తూనే బీఏ డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ, ఎంఏ ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. సంఘ కార్య విస్తరణ కోసం చదువుకు స్వస్తి పలికి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి ప్రచారకులుగా వెళ్లి కొన్ని సంవత్సరాలకే సంఘ కార్యాన్ని, విస్తరణను వికసింపచేశారు. తరువాత సహ ప్రాంత ప్రచారకర్తగా నియమితులయ్యారు. గాంధీ హత్యానంతరం హిందూ మహాసభతోపాటు ఆర్ఎస్ఎస్ను ప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో గణనీయమైన పాత్ర పోషిం చారు దీన్‌దయాళ్‌జీ. మరోపక్క ఆర్ఎస్ఎస్ వార పత్రిక అయిన ‘పాంచజన్య’, లక్నో దినపత్రిక ‘స్వదేశ’లకు దీన్‌దయాళ్‌జీ సంపాదకులుగా ఉన్నారు. నేడు కొత్తగా భారతీయ జనతా పార్టీలోకి చేరిన, చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరూ పండిట్ దీన్‌దయాళ్‌జీ చరిత్రను చదివి అభ్యసించి తెలుసుకుని పరి పూర్ణమైనటువంటి బీజేపీ కార్యకర్తగా ఎదగాలి. ఇప్పుడు బీజేపీలో పని చేస్తున్నటువంటి అనేకమంది నాయకులు, కార్యకర్తలు పండిత దీన్‌దయాళ్ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు నిజమైన నివాళి. నేడు పండిట్ దీన్‌దయాళ్ వర్ధంతి పురిఘళ్ల రఘురాం వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
దీనదయాళ్ డెత్ మిస్టరీ ఛేదించే దిశగా...
లక్నో : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ మరణ రహస్యాన్ని ఛేదించే క్రమంలో సీబీఐ విచారణ జరిపించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే సెప్టెంబరు 25, 1968లో మొఘల్సరాయ్ రైల్వే స్టేషన్(ప్రస్తుతం దీనదయాళ్ స్టేషన్) ట్రాక్‌పై దీనదయాళ్ శవం దొరికింది. కాగా ఆయన మరణం హత్య లేదా ప్రమాదమా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో యూపీలోని అంబేద్కర్ నగర్‌కి చెందిన బీజేపీ కార్యకర్త రాకేశ్ గుప్తా దీనదయాళ్ మరణ రహస్యాన్ని ఛేదించాలంటూ గతేడాది కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. దీనదయాళ్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం యోగి సర్కారును ఆదేశించింది. ఆ ఫైల్ మిస్సయింది..! ఈ క్రమంలో దీనదయాళ్ మరణానికి సంబంధించిన ఫైల్‌ను సమర్పించాల్సిందిగా రైల్వే శాఖ ఎస్పీ(అలహాబాద్)ని యోగి ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, కేస్ డైరీ సహా డాక్యుమెంట్లు అన్నీ కూడా మిస్సయ్యాయని సదరు ఎస్పీ తెలిపినట్లు సమాచారం. కాగా ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారందరికీ నాలుగేళ్ల పాటు జైలు శిక్ష పడినట్లు పోలీసు స్టేషనులో లభించిన మరో డాక్యుమెంట్లో రికార్డైంది. దీంతో సీబీఐని రంగంలోకి దింపి దీనదయాళ్ మరణ రహస్యాన్ని ఛేదించే దిశగా యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఆ ముగ్గురికి శిక్ష పడింది..! అలహాబాద్ ఎస్పీ ఐజీకి సమర్పించిన నివేదికలో.. ‘ ఫిబ్రవరి 11, 1968లో దీనదయాళ్ మరణంపై అఙ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసు నంబరు. 67/1968. ఈ ఫిర్యాదు ఆధారంగా రామ్ అవధ్, లల్టా, భరత్ రామ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 1969లో భరత్ రామ్‌కు ఐపీసీ సెక్షన్ 379/411 ప్రకారం శిక్ష పడింది. మిగిలిన ఇద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు’ అని పేర్కొన్నారు. అయితే ఎఫ్ఐఆర్ సహా అన్ని డాక్యుమెంట్లు మిస్సయ్యానని ఎస్పీ చెప్పడం, ఐజీకి సమర్పించిన లేఖలో వివరాలు పొందుపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది.