భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పుణికిపుచ్చుకొన్న పథ నిర్దేశకుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా నాగుల చంద్రభాన్ గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో రామ్ పారి, భగవతి ప్రసాద్‌లకు జన్మించారు. చిరుప్రాయంలోనే తల్లితండ్రులను కోల్పోయి బంధువుల దగ్గర పెరిగారు. చదువులో చురుకుగా ఉండేవారు. సర్వ బోర్డు పరీక్షలో ఆయన ప్రథముడు. కాన్పూర్‌లో బీఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. 1937లో ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయమైంది. సంఘ నిర్మాత డా. కేశవరావ్ బలిరావ్ హెగ్డేవార్‌తో కలిశారు. 1939లో లక్షిపూర్‌లో సంఘ్ ప్రచారక్‌గా నియమితులయ్యారు. 1945లో సంపూర్ణ ఉత్తరప్రదేశ్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వల్కర్.. దీన్‌దయాళ్ కార్య నిబద్ధతను గ్రహించారు. 1947లో స్వాతంత్య్రం లభించిన తరువాత దేశ విభజనలో కాశ్మీర్ లో జరుగుతున్న అల్లకల్లోలం, హిందువుల ఊచకోతలు మానభంగాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో నెహ్రూ ప్రభుత్వం అసహాయత, నిర్లిప్తతతో అనేకమంది నిరాశకు గురయ్యారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తితో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1950లో నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి వ్యతిరేకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గురూజీ గోల్వాల్క ర్‌ను సంప్రదించి 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు.. కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాకుండా ప్రత్యామ్నాయ పరిష్కారాలతో, స్పష్టమైన సిద్ధాంతాలతో సమృద్ధ భారత నిర్మాణానికీ ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. తర్వాత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
రష్యాతో పాటు అనేక పాశ్చాత్య దేశాల్లో నూతన ప్రజాస్వామిక విలువలతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని లోతుగా అధ్యయనం చేసి భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్. అదే ఏకాత్మ మానవతా వాదం. చదువులేని వారు, దరిద్రులు, దీన హీన స్థితిలో ఉన్నవారు, నిరుపేద వ్యక్తులే నారాయణులు అని ‘దరిద్రో దేవోభవ’ అని వారు చెప్పారు. సాధారణ జీవితం.. అసాధారణ చింతన అన్నదే ఆయన ఆలోచన. పేదలు, దీనుల పట్ల దళితుల పట్ల మమత్వ భావం ఉండాలనీ, వారికి సముచిత స్థానం కల్పించాలని కూడా చెప్పారు. సిద్ధాంతాలను ఆచరించడంలో నిబద్ధతతో ఉండేవారు. ఉదాహరణకు 1953లో రాజస్తాన్‌లో 9 మంది ఎమ్మెల్యేలు జనసంఘ్ తరపున గెలిచారు. అప్పుడు జమిందారీ విధానం రద్దు చేయమని చట్టం తెస్తున్న సమయంలో 6 మంది ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకించడంతో పార్టీ సిద్ధాం తానికి వ్యతిరేకం అని వారిని దీన్‌దయాళ్ బహిష్కరిం చారు. 1967 ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌కు 9.33 శాతం ఓట్లు సంపాదించి భారత రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాతి స్థానాన్ని సంపాదించారు. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా కృపాలాని లాంటి వారితో మంచి సంబంధాలు కొనసాగించి పార్టీకి విస్తృత స్థాయిని కల్పించారు. 1963లో కేరళలోని కాలికట్ సమావేశంలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్‌లో ఆయన హత్యకు గురయ్యారు.
తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆయనతో పాటు కలిసి పనిచేసిన వారిలో బావురావు దేవరసు, బాలరాజ్ మండల్, అటల్ బిహారి వాజ్‌పేయ్, లాల్‌కృష్ణ అడ్వాణీ నానాదేశ్‌ముఖ్, సుందర్ సింగ్ బండారు, జగన్నాథరావు జోషి, మురళీ మనోహర్ జోషి, జేపీ మాథుర్ ముఖ్యులు. ఆనాడు దీన్‌దయాళ్ నాటిన చిన్న బీజం ఈ రోజు మహా వటవృక్షంగా మారింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే అటల్ బిహారి వాజ్‌పేయ్ 1998లో మొదటిసారి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు. ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే వాజ్‌పేయ్ ఆర్థిక సంస్కరణలు చేసి అణుబాంబు పరీక్ష కూడా నిర్వహించారు. అదే సిద్ధాంత స్ఫూర్తితో ప్రస్తుతం నరేంద్ర మోదీ తొలిసారిగా సంపూర్ణ మెజారిటీతో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి పలు సంస్కరణలు వేగవంతం చేస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ సిద్ధాంతాలను, ఆదర్శాలను అంకితభావంతో పాటించడమే వారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. (పండిట్ దీన్‌దయాళ్ 104వ జయంతి సందర్భంగా)
వ్యాసకర్త: బండారు దత్తాత్రేయ , హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్
సంస్కృతీ పథ నిర్దేశకుడు దీన్‌దయాళ్
Published Fri, Sep 25 2020 1:17 AM | Last Updated on Fri, Sep 25 2020 1:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment