జాతి మరువని విరాణ్మూర్తి | Atal Bihari Vajpayee Birth Anniversary Guest Column Bandaru Dattatreya | Sakshi
Sakshi News home page

జాతి మరువని విరాణ్మూర్తి

Published Sat, Dec 25 2021 1:03 AM | Last Updated on Sat, Dec 25 2021 1:03 AM

Atal Bihari Vajpayee Birth Anniversary Guest Column Bandaru Dattatreya - Sakshi

నేడు క్రిస్‌మస్‌ పర్వదినం. సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్‌ అయిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. జాతీయవాద లక్ష్యం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఆయన హయాంలో తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని ప్రతిపక్షాలు భావించేవి. మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. సర్వశిక్షా అభియాన్, నదుల అనుసంధానం, స్వర్ణచతుర్భుజి, ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన వంటివి ఆయన మానస పుత్రికలు. వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి.

నేడు క్రిస్‌మస్‌. మానవులందరికీ ప్రేమ, కారుణ్యం, మానవీయతా సందేశాన్ని అందించే పర్వదినమిది. బహుముఖ రాజకీయ వ్యక్తిత్వం కలిగిన విశిష్టమూర్తి, కవి, జర్నలిస్టు, రాజనీతిజ్ఞుడు, న్యాయం, సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్‌ అయిన భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. ఆయన జాతీయవాద లక్ష్యం కోసం మనస్ఫూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. తనకుతానుగా ఆయన ఒక సంస్థ. అయస్కాంత సదృశమైన మూర్తిమత్వంతో దేశ ప్రజల హృదయాలను ఆయన ఆకర్షించారు. అసమానమైన అనురక్తితో ఆయన ప్రజల హృదయ సామ్రాట్‌ అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాజ్‌పేయి భారతీయ అజాతశత్రువు. 

ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, వాజ్‌పేయి అందరికీ సన్నిహితుడు. రాజకీయాల్లో అయనకు శత్రువులు లేరు. ఆయన జాతీయవాద స్ఫూర్తి, దేశభక్తి అందరికీ ప్రేరణ కలిగిస్తాయి. ఆయన వాగ్దాటి, భావ వ్యక్తీకరణా శైలి అత్యంత సహజంగానూ, స్వతస్సిద్ధంగానూ ఉంటాయి. రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇష్టపడేవారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాల్లో  తనపై విమర్శలను కూడా ఆయన నమ్రతతో ఆమోదించేవారు. పారదర్శకతను ఆయన ఎంతో దృఢంగా విశ్వసించేవారు. సుపరిపాలన లక్ష్యాన్ని ఆయన మనసారా ఆకాంక్షించేవారు. అందుకే ఆయన జయంతిని మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

బంగ్లాదేశ్‌ విముక్తికి దారితీసిన పాకిస్తాన్‌తో భారత్‌ యుద్ధ కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీని వాజ్‌పేయి ప్రశంసించారు. ఆమె తండ్రి భారతదేశ ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూని వాజ్‌పేయి గొప్పగా ప్రశంసించేవారు. దేశాన్ని దేవాలయంగా భావించే వాజ్‌పేయిని భవిష్యత్తు దార్శనిక నేతగా నెహ్రూ ఆనాడే దర్శించారు. అన్నిటికంటే దేశం ముందు అనేది వాజ్‌పేయి జీవితాంతం పాటించిన ఆదర్శం. ఆయన జీవితం తెరిచిన పుస్తకం.  లక్షలాదిమంది కార్యకర్తలనూ, ఇతరులనూ అది ప్రభావితం చేయడమే కాకుండా వారిలో జాతీయవాద బీజాలను నాటింది.

పార్టీ, రాజకీయాలు, పదవులు, హోదాలు ఏవీ శాశ్వతం కాదనే విషయంపై ఆయన ఎంతో స్పష్టతతో ఉండేవారు. దేశం, ప్రజాస్వామ్యం ఆయనకు అత్యంత ప్రధానమైన అంశాలు. పార్లమెంట్‌ ఒక చర్చా, సంభాషణా స్థలమే తప్ప పోరాట స్థలం కానీ సవాళ్లు విసిరే స్థలం కానీ కాదని ఆయన నమ్మకం. కులం, రంగు, మతం, ప్రాంతంకి సంబంధించిన సంకుచిత భావాలకు అతీతంగా ఆయన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఉన్నత స్థాయిలో నిలిపారు. రాజకీయాల ప్రధాన దృష్టి దేశంపైనా, అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోయే దేశాభివృద్ధిపైన మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయం. 

రాజకీయ పాలన పట్ల వాజ్‌పేయి వైఖరి ఎంత సమ్మిళితంగా ఉండేదంటే, ప్రతిపక్షాలు తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని భావించేవి. అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీయూ, నేషనల్‌ కాన్ఫరెన్స్, టీఎంసీ వంటి 23 పార్టీలతో కూడిన నేషనల్‌ డెమాక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీయే)ని ఆయన ఎంతో విజయవంతంగా నిర్వ హించారు. ఆయన పాలనా కాలం భారత రాజకీయాల్లో ఒక చారిత్రక ప్రయోగం. రాజకీయాల్లో కలిసి పనిచేయడంలో విజయవంతమైన, విశిష్టమైన ప్రయోగం అది. జనతా పార్టీ ప్రభుత్వంలో వాజ్‌పేయి భారత విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. అన్నిటికంటే దేశం ముందు అనే ఆయన రాజకీయ విశ్వాసంతో ప్రభావితుడైన నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రతినిధి బృందంలో వాజ్‌పేయిని చేర్చారు.

దౌత్య, విదేశీ వ్యవహారాలపై ఆయన సాధికారత మహత్తరమైనది. 1998లో పోఖ్రాన్‌–2 అణుపరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా, తదితర దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించినప్పటికీ వాజ్‌పేయి చెక్కుచెదరలేదంటే ఇదే కారణం. చైనాతో సరిహద్దు వివాదాలను తగ్గించుకుని వాణిజ్య బంధాలను మెరుగుపర్చుకున్నారు. మూడు తరాల చైనా నాయకత్వంతో (మావో సేటుంగ్, డెంగ్‌ జియావోపింగ్, హూ జింటావో) వాజ్‌పేయి వ్యవహరించారు. అలాగే పెర్వేజ్‌ ముషారఫ్‌ని ఆగ్రా సదస్సుకు ఆహ్వానించడం ద్వారా పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కూడా ఆయన సాహసించారు.

ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. టెలికాం రంగంలో పలు సంస్కరణలను మొదలెట్టడం ద్వారా ఆయన మొబైల్, ఫోన్‌ అనుసంధానతను విప్లవీకరించారు. 1999లో కార్గిల్‌ ఘర్షణ వంటి ఘటనలతో 1998–2004 మధ్య కాలంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, 1999–2000 మధ్య రెండు తుఫానులు, 2002–2003లో కరువుతో, చమురు సంక్షోభంతో దేశం విలవిల్లాడిపోయినప్పటికీ వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం 8 శాతం వృద్ధితో స్థిరమైన ఆర్థిక ప్రగతిని కొనసాగించింది. 

దేశంలో 6–14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించే సర్వ శిక్షా అభియాన్‌ పథకం ప్రారంభించడానికి వాజ్‌పేయి  చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ప్రారంభంతో బడి మధ్యలోనే మానేస్తున్న పిల్లల సంఖ్య 60 శాతానికి పడిపోయింది. నదుల అనుసంధాన ప్రాజెక్టు అనేది వాజ్‌పేయి చిరకాల స్వప్నాల్లో ఒకటి. అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి పథకం ద్వారా రహదారుల మౌలిక వసతుల కల్పనకు ఆయిన భారీగా ప్రోత్సాహం అందించారు. ఇకపోతే ప్రధానమంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన్‌ పథకం ద్వారా ఇవాళ మన గ్రామాలు సర్వకాలాల్లోను ఉపయోగంలో ఉండే రహదారులతో అనుసంధానమైన విషయం కూడా మనకు తెలుసు. ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన ద్వారా ఉద్యోగాల కల్పనకు ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్‌ కల్పించే నిబంధనను పునరుద్ధరించారు.

ఆనాడు వాజ్‌పేయి ప్రదర్శించిన దార్శనికతను నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తార్కిక ముగింపువైపు తీసుకుపోతున్నారు. అందరికీ హితం చేకూర్చే పరిపాలన ద్వారా దేశంలో ఏ ఒక్కరినీ వెనకబడకుండా పురోగమించేలా చేస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అనే స్వప్నాన్ని వీలైనంత త్వరగా ఫలింప చేశారు. జన్‌ధన్‌–ఆధార్‌–మొబైల్‌ త్రయం దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కాలంలో దాని ప్రభావానికి గురైన ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లను నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలకే పంపించింది. సమాజంలోని పేదల్లో కెల్లా నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ప్రత్యేకించి పేదలు, అధోజగత్‌ సహోదరుల్లో ఏ ఒక్కరినీ పక్కన పెట్టకుండా వారిని అభివృద్ధిలో భాగం చేయాలనే ఆయన కల నేడు నెరవేరుతుండటం సంతోషకరం.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో అనురాగాన్నీ, సమ్మిళితత్వాన్నీ, పారదర్శకతనూ ప్రోత్సహించడం ద్వారా సుపరిపాలనను అందించాలనే వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి. కోవిడ్‌–19 మహమ్మారి ద్వారా అనేకరంగాల్లో మనకు ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో పునర్మిర్మాణ ప్రక్రియను ఇప్పుడు చేపడుతున్నాం. అందరికీ నాణ్యమైన సౌకర్యాలను, అవకాశాలను కల్పించేందుకు మనం తీవ్రమైన ప్రయత్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాజ్‌పేయితో 1980నుంచి మొదలుకుని దశాబ్దాలపాటు పనిచేయగలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. ఆయన కేబినెట్‌లో మంత్రిగా పనిచేశాను. మనమంతా కష్టపడి పనిచేసి భారత్‌ను విశ్వగురువుగా మారుద్దాం. అదొక్కటే మన మహానేతకు మనం అర్పించే నిజమైన నివాళి. సర్వకాలాల్లో వాజ్‌పేయి  ఆదర్శవంతమైన నాయకుడిగా నా మదిలో నిలిచి ఉంటారు.

-బండారు దత్తాత్రేయ
వ్యాసకర్త హరియాణా గవర్నర్‌
(నేడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి, సుపరిపాలనా దినోత్సవం)



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement