లక్నో : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ మరణ రహస్యాన్ని ఛేదించే క్రమంలో సీబీఐ విచారణ జరిపించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే సెప్టెంబరు 25, 1968లో మొఘల్‌సరాయ్ రైల్వే స్టేషన్(ప్రస్తుతం దీనదయాళ్ స్టేషన్) ట్రాక్‌పై దీనదయాళ్ శవం దొరికింది. కాగా ఆయన మరణం హత్య లేదా ప్రమాదమా అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.
ఈ నేపథ్యంలో యూపీలోని అంబేద్కర్ నగర్‌కి చెందిన బీజేపీ కార్యకర్త రాకేశ్ గుప్తా దీనదయాళ్ మరణ రహస్యాన్ని ఛేదించాలంటూ గతేడాది కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. దీనదయాళ్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం యోగి సర్కారును ఆదేశించింది.
ఆ ఫైల్ మిస్సయింది..!
ఈ క్రమంలో దీనదయాళ్ మరణానికి సంబంధించిన ఫైల్‌ను సమర్పించాల్సిందిగా రైల్వే శాఖ ఎస్పీ(అలహాబాద్)ని యోగి ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, కేస్ డైరీ సహా డాక్యుమెంట్లు అన్నీ కూడా మిస్సయ్యాయని సదరు ఎస్పీ తెలిపినట్లు సమాచారం. కాగా ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారందరికీ నాలుగేళ్ల పాటు జైలు శిక్ష పడినట్లు పోలీసు స్టేషనులో లభించిన మరో డాక్యుమెంట్‌లో రికార్డైంది. దీంతో సీబీఐని రంగంలోకి దింపి దీనదయాళ్ మరణ రహస్యాన్ని ఛేదించే దిశగా యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
ఆ ముగ్గురికి శిక్ష పడింది..!
అలహాబాద్ ఎస్పీ ఐజీకి సమర్పించిన నివేదికలో.. ‘ ఫిబ్రవరి 11, 1968లో దీనదయాళ్ మరణంపై అఙ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ కేసు నంబరు. 67/1968. ఈ ఫిర్యాదు ఆధారంగా రామ్ అవధ్, లల్టా, భరత్ రామ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 1969లో భరత్ రామ్‌కు ఐపీసీ సెక్షన్ 379/411 ప్రకారం శిక్ష పడింది. మిగిలిన ఇద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు’ అని పేర్కొన్నారు. అయితే ఎఫ్‌ఐఆర్ సహా అన్ని డాక్యుమెంట్లు మిస్సయ్యానని ఎస్పీ చెప్పడం, ఐజీకి సమర్పించిన లేఖలో వివరాలు పొందుపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment