deer dies
-
పాపం.. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాయి
సాక్షి, తిరుపతి: సూళ్లూరుపేట పట్టణంలోని కోళ్లమిట్ట జనావాసంలోకి పలు జింకలు తప్పిపోయి వచ్చాయి. ఈ క్రమంలో షార్ క్వార్టర్స్ డీఓఎస్ కాలనీ ఫెన్సింగ్‌లో ఇరుక్కుని ఓ జింక మృత్యువాత పడింది. జింకలను చూసి కుక్కలు తరమడంతో మరో జింక బావిలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానిక యువకుడు వినోద్.. చాకచక్యంగా బావిలో నుంచి జింకను కాపాడాడు. అనంతరం దానికి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
మూగ రోదన.. మౌన వేదన
తిరుమల: నవమాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. ప్రాణం పోయేంత నొప్పులను పంటి బిగువన భరించే తల్లి.. పండంటి బిడ్డను చూసుకొని ఆనందబాష్పాలు రాలుస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ.. తన ఊపిరి పోతున్నా తన ప్రతిరూపాన్ని ఈ లోకానికి పరిచయం చేయడం ఓ పోరాటం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ జింక.. ఆ నొప్పిని మించిన ప్రసవవేదనతో ఓ జీవికి ప్రాణం పోసింది. తన బిడ్డను కళ్లారా చూసుకొని ఈ లోకం వీడింది. తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకెళ్తే.. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న పరకామణి బస్సు మొదటి ఘాట్ రోడ్డులో వెళ్తుండగా ఓ జింక అమాంతం రోడ్డు మీదకు ఎగిరి దూకింది. ఊహించని ఘటనతో డ్రైవర్ తేరుకునేలోపే జింకను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కడుపుతో ఉన్న ఆ జింక తన ప్రాణం పోతున్నా ఓ పిల్లకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అక్కడున్న భక్తులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో జూ క్యూరేటర్ హిమశైలజతో మాట్లాడి జింక పిల్లను ఆమెకు అప్పగించారు. మరణించిన జింకను పోస్టుమార్టం కోసం వెటర్నరీ కళాశాలకు తరలించారు. అచ్చం మనుషుల్లానే.. మనుషుల్లానే జింకలు కూడా 7 నుంచి 9 నెలల వ్యవధిలో పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పిల్లలను తల్లి జింక సుమారు రెండేళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పురుడు సమయంలో తల్లి జింక ఏకాంతంగా ఉంటుంది. బిడ్డకు జన్మనివ్వగానే తల్లి జింక దాన్ని నాలుకతో శుభ్రం చేసి ఆ వెంటనే పాలు పడుతుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో వీక్షించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి చలించిపోయారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా టీటీడీ అధికారులకు సూచనలు చేస్తామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
తనకల్లు: సీజీ ప్రాజెక్టు గిరిజన గురుకుల పాఠశాల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. ఇదే ప్రమాదంలో ఇమామ్‌బాషా అనే ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...వైఎస్సార్ జిల్లా గాలివీడుకు చెందిన కృష్ణారెడ్డి తన మిత్రుడు ఇమామ్బాషాతో కలిసి ద్విచక్రవాహనంలో అమడగూరు మండలం లోకోజుపల్లికి వ్యక్తిగత పనిమీద బయలుదేరాడు. గురుకుల పాఠశాల సమీపంలో జింక అడ్డంగా రావడంతో బలంగా ఢీకొన్నాడు. జింక అక్కడికక్కడే మృతి చెందిగా, బండిలో నుంచి కింద పడిన ఇమామ్బాషాకు ముఖం, తల, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా కృష్ణారెడ్డికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స కోసం 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, వైద్యుల సూచన మేరకు కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జింక మృతదేహాన్ని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
లేపాక్షి : మండలంలోని చోళసముద్రం సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. గురువారం ఉదయమే అటుగా వెళ్తున్న వారు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. హిందూపురం సెక్షన్ రేంజ్ ఆఫీసర్ మదన్మోహన్ వెంటనే అక్కడికి చేరుకుని జింక కళేబరాన్ని లేపాక్షి పశువైద్య కేంద్రానికి తీసుకువచ్చారు. పశువైద్యాధికారిణి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో జింక కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
వాహనం ఢీకొని జింక మృతి
చిలమత్తూరు : యర్రకొండ నర్సరీ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక గురువారం మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎఫ్బీఓ జి.అనిల్‌కుమార్, పశువైద్యాధికారి శివశంకర్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఈ సందర్భంగా ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ మదన్మోహన్ మాట్లాడుతూ బ్రహ్మేశ్వరంపల్లి నుంచి కాపుచెన్నంపల్లి వరకు యర్రకొండ అటవీ ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా వెళ్లాలని కోరారు. నీటి కోసం వన్యప్రాణులు రోడ్డు దాటుతుంటాయని అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.