మూగ రోదన.. మౌన వేదన | Bus collided with deer At Tirumala Ghat Road | Sakshi
Sakshi News home page

మూగ రోదన.. మౌన వేదన

Jan 25 2022 3:42 AM | Updated on Jan 25 2022 7:59 AM

Bus collided with deer At Tirumala Ghat Road - Sakshi

తిరుమల: నవమాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. ప్రాణం పోయేంత నొప్పులను పంటి బిగువన భరించే తల్లి.. పండంటి బిడ్డను చూసుకొని ఆనందబాష్పాలు రాలుస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ.. తన ఊపిరి పోతున్నా తన ప్రతిరూపాన్ని ఈ లోకానికి పరిచయం చేయడం ఓ పోరాటం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ జింక.. ఆ నొప్పిని మించిన ప్రసవవేదనతో ఓ జీవికి ప్రాణం పోసింది. తన బిడ్డను కళ్లారా చూసుకొని ఈ లోకం వీడింది.

తిరుమల ఘాట్‌ రోడ్డులో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకెళ్తే.. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న పరకామణి బస్సు మొదటి ఘాట్‌ రోడ్డులో వెళ్తుండగా ఓ జింక అమాంతం రోడ్డు మీదకు ఎగిరి దూకింది. ఊహించని ఘటనతో డ్రైవర్‌ తేరుకునేలోపే జింకను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కడుపుతో ఉన్న ఆ జింక తన ప్రాణం పోతున్నా ఓ పిల్లకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అక్కడున్న భక్తులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో జూ క్యూరేటర్‌ హిమశైలజతో మాట్లాడి జింక పిల్లను ఆమెకు అప్పగించారు. మరణించిన జింకను పోస్టుమార్టం కోసం వెటర్నరీ కళాశాలకు తరలించారు.  

అచ్చం మనుషుల్లానే..
మనుషుల్లానే జింకలు కూడా 7 నుంచి 9 నెలల వ్యవధిలో పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పిల్లలను తల్లి జింక సుమారు రెండేళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పురుడు సమయంలో తల్లి జింక ఏకాంతంగా ఉంటుంది. బిడ్డకు జన్మనివ్వగానే తల్లి జింక దాన్ని నాలుకతో శుభ్రం చేసి ఆ వెంటనే పాలు పడుతుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో వీక్షించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి చలించిపోయారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా టీటీడీ అధికారులకు సూచనలు చేస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement