ghat road accident
-
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. మహిళ మృతి
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి బస్సును ఢీకొన్ని ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఇక, మృతిచెందిన మహిళను గుంటూరు జిల్లాకు చెందిన జ్యోతిగా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ బైక్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న జ్యోతి తీవ్రంగా గాయపడ్డింది. దీంతో, ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. జ్యోతిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. కాగా, మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లలోని ఎర్రగడ వీధికి చెందినట్టు పోలీసులు తెలిపారు. -
తిరుమల ఘాట్ రోడ్లో జాగ్రత్త..! వాహనదారులకు కీలక సూచనలు..
వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక మొత్తంలో వాహనాలు వస్తున్నాయి. రెండవ ఘాట్ రోడ్డు ద్వారా పది వేల వాహనాలు, మొదటి ఘాట్ రోడ్డులో ఎనిమిది వేల వాహనాలు వస్తున్నాయి. ఘాట్ రోడ్డుపై అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే తిరుమలకు రావాలని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య సూచించారు. ఫిట్నెస్ ఉండే వాహనాలను మాత్రమే ఘాట్ రోడ్డులో ఉపయోగించాలని ఎస్పీ మునిరామయ్య కోరారు. అవగాహన లేని డ్రైవర్లు ఘాట్ రోడ్లో ముందు వెళ్లే వాహనాలను అధికమించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్లో వాహనాలు పక్కన పెట్టి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొద్దని కోరారు. దివ్య రామం వద్ద వాహనాలను ఆపి ఉండడం చేత ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమలలో టైం లిమిటేషన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నామని ఎస్పీ మునిరామయ్య చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో 28 నిమిషాలు, మొదటి ఘాట్ రోడ్డులో 48 నిమిషాలు నియమించామని తెలిపారు. మొదటి ఘాట్ రోడ్డులో ఒకటో కిలోమీటరు వద్ద వాహనాలు ఆపుతున్నారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్పెషల్ టీంగా ఏర్పడి బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల డ్రైవర్లకు, భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించడంపై ప్రతిపాదన పంపాం కానీ ఇంకా వాటిపై ఎలాంటి నిర్ణయం రాలేదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డులో నిబంధనలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: తిరుపతి: టపాసుల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి -
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..టెంపో బోల్తా..
సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో ఘెర ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్ రోడ్డులో ఆరవ మలుపు వద్ద టెంపో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ టెంపోలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన భక్తులకు ప్రయాణిస్తున్నట్లు అధికారుల తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్లే ఈప్రమాదం జరిగినట్లు కొందరు భక్తుల చెబుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతను మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులను సమీపంలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఐతే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో రుయా నుంచి బర్డ్ ఆస్పత్రికి తరలించారు. భక్తులకు మరింత మెరుగైన వైద్యం అందేలా ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా ఈ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరమని, సత్వరమే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వాహనాల వేగ నియంత్రణకు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు ధర్మారెడ్డి. (చదవండి: చంద్ర పుష్కరణి బావిలో జారిపడ్డ భక్తురాలు) -
తిరుమల ఘాట్‌రోడ్డులో రన్నింగ్ కారు మంటలు
సాక్షి, చిత్తూరు: తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో కారు అక్కడికక్కడే దగ్ధం అయింది. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా చివరి మలుపులో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అప్రమత్తమవడంతో భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని కర్నూలుకు చెందిన మహేశ్వర్‌రెడ్డి, సుజాతగా గుర్తించారు. -
మూగ రోదన.. మౌన వేదన
తిరుమల: నవమాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. ప్రాణం పోయేంత నొప్పులను పంటి బిగువన భరించే తల్లి.. పండంటి బిడ్డను చూసుకొని ఆనందబాష్పాలు రాలుస్తుంది. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ.. తన ఊపిరి పోతున్నా తన ప్రతిరూపాన్ని ఈ లోకానికి పరిచయం చేయడం ఓ పోరాటం. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ జింక.. ఆ నొప్పిని మించిన ప్రసవవేదనతో ఓ జీవికి ప్రాణం పోసింది. తన బిడ్డను కళ్లారా చూసుకొని ఈ లోకం వీడింది. తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకెళ్తే.. తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్న పరకామణి బస్సు మొదటి ఘాట్ రోడ్డులో వెళ్తుండగా ఓ జింక అమాంతం రోడ్డు మీదకు ఎగిరి దూకింది. ఊహించని ఘటనతో డ్రైవర్ తేరుకునేలోపే జింకను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కడుపుతో ఉన్న ఆ జింక తన ప్రాణం పోతున్నా ఓ పిల్లకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అక్కడున్న భక్తులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో జూ క్యూరేటర్ హిమశైలజతో మాట్లాడి జింక పిల్లను ఆమెకు అప్పగించారు. మరణించిన జింకను పోస్టుమార్టం కోసం వెటర్నరీ కళాశాలకు తరలించారు. అచ్చం మనుషుల్లానే.. మనుషుల్లానే జింకలు కూడా 7 నుంచి 9 నెలల వ్యవధిలో పిల్లలకు జన్మనిస్తాయి. ఈ పిల్లలను తల్లి జింక సుమారు రెండేళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పురుడు సమయంలో తల్లి జింక ఏకాంతంగా ఉంటుంది. బిడ్డకు జన్మనివ్వగానే తల్లి జింక దాన్ని నాలుకతో శుభ్రం చేసి ఆ వెంటనే పాలు పడుతుంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో వీక్షించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి చలించిపోయారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా టీటీడీ అధికారులకు సూచనలు చేస్తామని తెలిపారు. -
చుక్కల దుప్పిని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
పెద్దదోర్నాల: రోడ్డు దాటుతున్న చుక్కల దుప్పిని అతివేగంతో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దుప్పి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎకో టూరిజం సమీపంలో తెట్టగుండం వద్ద ఆదివారం జరిగింది. పెద్దదోర్నాల రేంజి అధికారి విశ్వేశ్వరరావు కథనం మేరకు శ్రీశైలం నుంచి సింథనూర్ వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు తెట్టగుండం వద్దకు చేరుకునేసరికి ఆ ప్రాంతంలో ఉన్న చుక్కల దుప్పి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. వేగంగా వస్తున్న బస్సు దుప్పిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న స్వచ్ఛ సేవక్‌లు వెంటనే మండల కేంద్రంలో ఉన్న గణపతి చెక్‌పోస్టుకు సమాచారమందించడంతో అధికారులు చెక్‌పోస్టు వద్ద బస్సును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతిచెందిన చుక్కల దుప్పికి అటవీశాఖకు చెందిన పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. -
తిరుమల మొదటి ఘాట్‌లో ప్రమాదం
తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తిరుమల ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, పటాన్‌చెరువుకు చెందిన శివలింగ గౌడ్ (32), కృష్ణ, గోపాల్ అనే స్నేహితులతో కలిసి కారులో శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు చేరుకున్నాడు. శ్రీవారిని దర్శించుకుని శనివారం మధ్యాహ్నం కారులో మొదటిఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగుతుండగా రెండో టర్నింగ్ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణగోడను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముందర కూర్చున్న శివలింగ గౌడ్ ముఖం ముందర అద్దానికి కొట్టుకుని తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న కృష్ణ సీటు బెల్టు పెట్టుకోవడంతోపాటు, బెలూన్ ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వెనుక సీటులో కూర్చున్న గోపాల్ స్వల్పగాయాలతోనే బయటపడ్డాడు. తిరుమల ట్రాఫిక్, టీటీడీ భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ రుయా ఆస్పత్రికి తరలించారు. కారు టైరు పంచర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవింగ్ సీటులో ఉన్న కృష్ణ తెలిపారు. ప్రమాదంపై తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రమాదం: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
సాక్షి, తిరుపతి: భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో 22 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. బళ్లారి నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ కి గుండెనొప్పి రావటంతో బస్సు అదుపు తప్పిందని సమాచారం. -
పెళ్లి సందడిలో మృత్యుఘోష
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: దైవ సన్నిధి చెంత మూడుముళ్ల బంధంతో ఆ జంట ఒక్కటైంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆ పెళ్లికి అతి తక్కువ మందే హాజరైనా.. నిండు నూరేళ్లూ పచ్చగా వర్ధిల్లమని మనసారా ఆశీర్వదించారు. ఆనందోత్సాహాలతో ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో విధి వక్రించింది. పెళ్లి కుమారుడి బంధువుల్ని మృత్యువు కబళించింది. టాటా ఏస్ వాహనం ఘాట్ రోడ్డు (కొండ)పైనుంచి ఆలయం మెట్లపై పడిపోయి ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు దుర్మరణం పాలవగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తంటికొండ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఘాట్ రోడ్డుపై శుక్రవారం వేకువజామున చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని గోకవరం మండలం ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి వీరబాబుకు, రాజానగరం మండలం వెలుగుబందకు చెందిన ప్రగడ వీరజకు గురువారం రాత్రి 11.17 గంటలకు వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. పెళ్లి సందడి ముగిశాక 2.26 గంటల సమయంలో పెళ్లి కుమారుడి తరఫు బంధువులు 16 మంది టాటా ఏస్ వాహనంలో తిరుగు ప్రయాణం కాగా.. బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఆ వాహనం ఘాట్ రోడ్డు పైనుంచి దిగువన ఉన్న మెట్ల మార్గంపైకి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో గోకవరం మండలం గంగంపాలేనికి చెందిన టాటా ఏస్ డ్రైవర్ పచి్చకూరి నరసింహదొర (29), ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి దుర్గాప్రసాద్ (25), పెళ్లి కుమారుడి సోదరి, గోకవరానికి చెందిన కంబాల భాను (33), రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన తల్లీకూతుళ్లు యాళ్ల నాగశ్రీలక్ష్మి (34), యాళ్ల దివ్యశివ గాయత్రి (10) ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కోరుకొండ మండలం గాదరాడకు చెందిన చాగంటి హేమనీ శ్రీలలిత (13), పశి్చమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు సమీపంలోని తల్లాపురం గ్రామానికి చెందిన సోమరౌతు గోపాలకృష్ణ (72) రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమం ప్రమాదంలో గోకవరానికి చెందిన కంబాల వెంకటరమణ (7), మోహన సీతామహాలక్ష్మి, ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి చంద్ర (60), కోరుకొండ మండలం కాపవరానికి చెందిన జాజుల లక్ష్మన్న (45), జాజుల లక్ష్మి (40), గాదరాడకు చెందిన చాగంటి నూకరత్నం (40), చాగంటి సుజాత (38), పశి్చమ గోదావరి జిల్లా తల్లాపురానికి చెందిన సోమరౌతు వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. మరో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరిలో ఏడుగురు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోను, ఒకరు ప్రైవేట్ ఆస్పత్రిలోను, మరొకరు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలోను చికిత్స పొందుతున్నారు. వీరిలో సోమరౌతు వెంకటలక్షి్మ, కంబాల మోహన సీతామహాలక్ష్మి, సింహాద్రి చంద్ర, చాగంటి సుజాత పరిస్థితి విషమంగా ఉంది. ఘాట్ రోడ్డుపై నుంచి వాహనం కిందకు పడిపోయినప్పుడు పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడి నిద్ర లేచారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ శేముషీబాజ్పాయి ప్రమాద ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరామర్శించారు. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద కారణాలపై భిన్న కథనాలు ప్రమాదానికి గల కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన టాటా ఏస్ వాహనం ఘాట్ రోడ్డు మీదుగా కిందకు దిగే సమయంలో డ్రైవర్ నరసింహదొర హ్యాండ్ బ్రేక్ తీయగానే వాహనం ముందుకు కదలిందని.. డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు వచి్చన కార్లను కొండ దిగువన పార్క్ చేయగా.. ప్రమాదానికి కారణమైన వాహనం సెల్ఫ్ మోటార్ పని చేయకపోవడంతో డ్రైవర్ వాహనాన్ని నేరుగా కొండపైకి పోనిచ్చాడని చెబుతున్నారు. తిరుగు ప్రయాణంలో వాహనం కొండ పైనుంచి దిగువకు వచ్చేప్పుడు సులభంగా స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేశాడని తెలుస్తోంది. అయినా వాహనం స్టార్ట్ కాకపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు దానిని తోస్తుండగా బ్రేక్ ఫెయిలై.. ప్రమాదం జరిగిందని మరో వాదన వినిపిస్తోంది. కొండపై గల ఘాట్ రోడ్డు నుంచి సుమారు 20 అడుగుల దిగువకు వాహనం బోల్తా కొట్టడంతో ఆలయ మెట్ల మార్గం రక్తసిక్తమైంది. మెట్ల మార్గంపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో ఘటనా స్థలం హృదయ విదారకంగా కనిపించింది. వాహనంలోని పెళ్లి సామగ్రి కూడా అదే ప్రాంతంలో చెల్లాచెదురుగా పడింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. మృతుల కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. -
27 కిలోమీటర్లు 20 ప్రమాదకర మలుపులు
వారందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించిన వారు జిల్లాలోని అన్నవరం సత్యదేవుని దర్శనానికి పయనమయ్యారు. చింతూరు– మారేడుమిల్లిలో వీరు ప్రయాణిస్తున్న టూరిజం టెంపో వాహనం ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రంపచోడవరం/మారేడుమిల్లి: జిల్లాలోని ప్రధాన దేవాలయాలను సందర్శించేందుకు వచ్చిన కర్ణాటక యాత్రికుల బృందం పర్యటన విషాదంతమైంది. ఏజెన్సీ అందాల చుట్టూ ఉన్న జలపాతాలను, ఎత్తయిన కొండలను, వాటి పక్కనే ఉన్న లోయలను చూస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పులకించిపోతున్న యాత్రికుల ప్రాణాలు కనురెప్పపాటులో గాలిలో కలిసిపోయాయి. మరో ఐదు నిమిషాలు ప్రయాణం చేస్తే ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు దిగువకు వచ్చే వారే. అంతలోనే అనుకొని ప్రమాదం జరిగిపోయింది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఎంత ప్రమాదకరమైందో మరోసారి రుజువైంది. ఇటీవల పర్యాటకులతో గోదావరిలో మునిగిన ప్రైవేట్ టూరిజం బోటు సంఘటన మరువక ముందే మరో సంఘటన జరగడంతో ఏజెన్సీలో విషాదం అలముకుంది. కనురెప్ప పాటులో ప్రమాదం కర్ణాటకు చెందిన యాత్రికులు 24 మంది రెండు వాహనాల్లో శనివారం రాష్ట్రంలోని దేవాలయాలను దర్శించుకునేందుకు బయల్దేరారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా సెలికేరు నుంచి పయనమయ్యారు. ఏపీకి చెందిన వాహనాలను అద్దెకు తీసుకున్నారు. యాగంగి బసవన్న దగ్గర నుంచి మహానంది నుంచి ప్రారంభమైన వీరి యాత్ర భద్రాద్రి రామచంద్రుడి దర్శనం ముగించుకుని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వెళుతుండగా ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఐదుగురు, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కుంచం రమేష్, (56), కుంచం అమృతవాణి (48), మేడా గాయిత్రమ్మ(52), మేడా శ్వేత(25), మేడా శ్రీనివాసు(65), మేడా మధురాక్షమ్మ(56), మేడా రామలక్ష్మ మ్మ(42) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర, స్వల్పగాయాలతో బయటపడ్డారు. రోడ్డుపై నిలిచిన వాహనాలు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరగడంతో సుమారు గంట పాటు మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డు వాహనాలు నిలిచిపోయాయి. మారేడుమిల్లి పోలీసులు స్థానికుల సహాయంతో ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనాన్ని పక్కకు తొలగించారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంపచోడవరం ఐటీడీఏ నిషాంత్‌కుమార్, ఏఎస్పీ వకుల్ జిందాల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ సూచనలతో ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటన స్థలానికి చేరుకున్నాయి. మారేడుమిల్లి పీహెచ్‌సీకి ఏజెన్సీ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సిబ్బంది చేరుకుని వైద్యపరంగా అందించాల్సిన సేవలపై సత్వరం స్పందించి అత్యవసర వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగింత రాజమహేంద్రవరం క్రైం : మారేడుమిల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఏడు మృతదేహా లు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. మృతదేహాల వెంట మారేడుమిల్లి పోలీసులు, మృతుల బంధువులు ఉన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ టి. రమేష్ కిశోర్, ఆర్ఎంఓ డాక్టర్ లక్ష్మీపతి, డాక్టర్ సునీల్ రాజు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. కర్నాటక తరలించేందుకు ఏర్పాట్లు రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ టి.రమేష్ కిశోర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మృతదేహాలు కర్నాటక తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాత్రికి పోస్టుమార్టం పూర్తి చేసి వీలైనంత త్వరగా బంధువులకు అప్పగిస్తామన్నారు. అన్నవరం దర్శనం కాకుండానే.. కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెలికేరి గ్రామానికి చెందిన 24 మంది రెండు వాహనాలో (ఒక్కో వాహనానికి 12 మంది చొప్పున) ఈనెల 12న బయల్దేరామని ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిరలో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన రెండు వాహనాలు బుక్ చేసుకున్నామని, ఈ ప్రమాదంలో మృతి చెందిన కుందం రమేష్, (బావ), అమృతవాణి సోదరుడు గోవిందరాజు తెలిపారు. ముందు వాహనంలో తన బావ రమేష్, చెల్లెలు అమృతవాణి ఉన్నారని, తమ వాహనం వెనుక వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్ పరారయ్యాడని పేర్కొన్నారు. శనివారం బయలుదేరిన తాము మహానంది, శ్రీశైలం, భద్రాచలం దేవాలయాలు దర్శించుకొని అన్నవరం దేవాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిపారు. దర్శనం చేసుకోకుండానే తన చెల్లి అమృత వాణి, బావ కుందం రమేష్ మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే ప్రమాదం జరిగిపోయింది సెలికేరు నుంచి మహానంది వెళ్లాం. దర్శనం తరువాత రాత్రి అక్కడే బస చేశాం. భద్రాచలంలో సోమవారం రాత్రి బస చేసి మంగళవారం ఉదయం సీతారాములు వారి దర్శనం చేసుకున్నాం. అందరూ ఒకటి రెండుసార్లు దర్శనం చేసుకుని బాగా దర్శనమయిందని ఎంతో సంతోషం చెందారు. అన్నవరం ప్రయాణమై మార్గ మధ్యలో ప్రమాదంకు గురి కావడం ఎంతో కలిచివేసింది. అందరూ కలిసి వచ్చాం, సంతోషంగా అందరూ తిరిగి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కళ్లేదుటే గాయాలు పాలైన వారు అర్తనాదాలు గుండెలను పిండేశాయి.– గోవిందరాజు, సెలికేరు. డ్రైవర్ అవగాహన లోపంతో.. రంపచోడవరం/మారేడుమిల్లి: భద్రాచలం నుంచి అన్నవరం బయల్దేరిన యాత్రికుల వాహనం మారేడుమిల్లికి 12 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. మలుపును చూపుతున్న బోర్డును ఢీకొట్టుకుంటూ రోడ్డు అంచు నుంచి ఏటవాలుగా సుమారు వంద అడుగులు కిందికి వెళ్లిపోయింది. 13 మంది యాత్రికులతో ఉన్న టెంపో వాహనం రోడ్డును ఢీకొట్టిన వెంటనే వెనుక వైపున్న టెంపో తలుపు ఊడిపోవడంతో వెనుక భాగంలో ఉన్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఘాట్ రోడ్డులో వాహనం నడిపిన అనుభవం లేకపోవడం, మలుపును సరిగా అంచనా వేయకపోవడంతో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. 27 కిలోమీటర్లు 20 ప్రమాదకర మలుపులు మారేడుమిల్లి నుంచి భద్రాచలం వరకు 120 కిలోమీటర్లు దూరం ఉంటుంది. దీనిలో మారేడుమిల్లి నుంచి చింతూరు వరకు 27 కిలోమీటర్లు మేర ఘాట్ రోడ్డు ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డులో 20 ప్రమాదకర మలుపులున్నాయి. పెద్ద పెద్ద లోయలున్న మలుపును దాటుకుంటూ వచ్చి యాత్రికులతో టెంపో డ్రైవర్ ఆఖరి ఘాట్ రోడ్డు మలుపునకు చేరుకున్న తరువాత ప్రమాదానికి గురైంది. -
ఎంత 'ఘాట్' బాధయో..
తూర్పుగోదావరి, చింతూరు/మారేడుమిల్లి: చింతూరు, మారేడుమిల్లి ఘాట్రోడ్లో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తుపల్లాలు, మలుపులు ఓ పక్క.. రాతికొండ మరో పక్క లోతైన లోయలో హొయలు తిరుగుతూ ప్రవహించే జలపాతాలు, మధ్యలో వ్యూ పాయింట్లు ఈ ఘాట్‌రోడ్ సొంతం. ఇక మారేడుమిల్లి మండలం పాములేరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు ఈ అందాలన్నీ ప్రయాణికులను కనువిందు చేస్తాయి. ఇదంతా నాణేనికి ఒకవైపే. అదే ఘాట్రోడ్లో అడుగడుగునా ఆపదలు పొంచి ఉన్నాయి. చింతూరు, రంపచోడవరం ఆర్అండ్బీ సబ్ డివిజన్లో ఉండే ఈ ఘాట్‌రోడ్ 25 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు వద్ద ఘాట్రోడ్లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీలోని ఘాట్‌రోడ్లు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లోయ వైపు పొంచి ఉన్న ప్రమాదం ఘాట్‌రోడ్ పొడవునా ఓవైపు లోతైన లోయ ఉంది. దీని వైపు రక్షణగోడలు, ప్రమాదాన్ని తెలిపే సూచికలు లేకపోవడంతో చాలా వాహనాలు లోయలో పడి అనేకమంది దుర్మరణం చెందారు. గతంలో పలుచోట్ల నిర్మించిన రక్షణ గోడలు రహదారుల వెడల్పు, వర్షాలకు కొట్టుకొచ్చిన మట్టితో పూడుకుపోయాయి. మూడేళ్లక్రితం ఘాట్‌రోడ్ వెడల్పు చేసినా నేటికీ రక్షణ గోడలు నిర్మించలేదు. దీంతో చాలా వాహనాలు ఘాట్‌రోడ్ ఎక్కేటప్పడు, దిగేటప్పుడ అదుపుతప్పి లోయలోకి పడిపోతున్నాయి. ఘాట్‌రోడ్ దిగే సమయంలో హై గేర్‌లో నెమ్మదిగా దిగాలనే నిబంధన ఉన్నా డీజిల్ మిగులుతుందనే ఆశతో డ్రైవర్లు న్యూట్రల్లో దింపుతున్నారు. దీంతో వాహన వేగం పెరిగి మలుపుల వద్ద అదుపుతప్పి లోయలోకి, కిందనున్న రహదారిపై పడి ప్రాణాపాయం సంభవిస్తోంది. మరోవైపు వివిధ డిపోల నుంచి విలీన మండలాలకు సరైన ఫిట్నెస్ లేని బస్సులు తిప్పుతుండడంతో పలుమార్లు అవి మొరాయిస్తున్నాయి. ప్రధానంగా ఇటీవలి కాలంలో బ్రేకులు ఫెయిలై అనేక బస్సులు నిలిచిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరోవైపు ఘాట్రోడ్లో కొన్నిచోట్ల ఏడు మీటర్లు, మలుపుల వద్ద ఐదున్నర మీటర్ల వెడల్పు మాత్రమే ఉండడంతో వాహనాల ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఘాట్రోడ్లో ప్రమాదాలెన్నో.. చింతూరు, మారేడుమిల్లి ఘాట్రోడ్లో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకోవడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గగుడి సమీపంలోని గోపి టర్నింగ్ వద్ద విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న వ్యాను లోయలో పడి ఏడుగురు భవానీలు మృత్యువాత పడ్డారు. దుర్గగుడి సమీపంలోనే కూలీలతో వెళ్తున్న లారీ బోల్తాపడి ఐదుగురు పొగాకు కూలీలు మృతిచెందారు. గతేడాది డిసెంబర్లో చింతూరులో జరిగిన సువార్త కూటమిలో పాల్గొని టాటామేజిక్పై తిరిగి వెళుతుండగా అది లోయలో పడి కాకినాడ, సామర్లకోటకు చెందిన ఐదుగురు మృతిచెందారు. ఇజ్జలూరు సమీపంలో మలుపు వద్ద తీర్ధయాత్రలకు వెళ్లి భక్తులతో తిరిగి వస్తున్న బస్సు బోల్తాపడి తెలంగాణాకు చెందిన ఓ ప్రయాణికురాలు మృతిచెందింది. టైగర్‌క్యాంపు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో జెన్కోకు చెందిన ఇంజినీర్ మృతిచెందాడు. రూ.38 కోట్లు మంజూరయ్యాయి మారేడుమిల్లి నుంచి చింతూరు వరకు రహదారుల మరమ్మతుల నిమిత్తం రూ.38 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ నిధులతో ఘాట్రోడ్లో మలుపుల వద్ద రహదారి వెడల్పు, రక్షణగోడలు నిర్మించాల్సి ఉంది. అటవీశాఖ అభ్యంతరాల వల్ల పనులు ఆలస్యమవుతున్నాయి. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.– గణేష్, చింతూరు ఆర్అండ్బీ డీఈ -
మలుపులే ప్రాణాలు తీస్తున్నాయి
కొండల్లో, కోనల్లో ప్రయాణాలు ఎంత ఆహ్లాదాన్ని పంచుతాయో, దాని వెనుక అంతటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా గత మూడేళ్లుగా బస్సులు లోయల్లో పడిన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం గత ఏడాది బస్సు ప్రమాదాల్లో సగటున రోజుకి 29 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బస్సు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలు ముందున్నాయి. ఇక హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ప్రతీరోజూ ఏదో ఒక చోట బస్సు లోయలో పడిన ప్రమాదాల గురించే వింటున్నాం. 2017లో బస్సు ప్రమాదాల్లో 9,069 మంది మరణించారు. ఇందులో తమిళనాడులోనే అత్యధికంగా ప్రమాదాలు జరిగాయి. ఆ ఒక్క రాష్ట్రంలోనే గత ఏడాది 1856 మంది మరణించినట్టు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇక ఆ తర్వాత స్థానంలో ఉత్తప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలో గత ఏడాది 1406 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కర్ణాటకలో బస్సులు లోయలో పడిన ప్రమాదాల్లో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాలకు కారణాలు ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కొండల్లో సన్నటి ఇరుకు దారులు, ప్రమాదకరమైన మలుపులు, చెత్త రోడ్లు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్లు ప్రయత్నించడం, డ్రైవర్లు మద్యం సేవించడం వంటివి ఘాట్ రోడ్లపై ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మొత్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదకరమైన మలుపుల కారణంగా జరుగుతూ ఉంటే, డ్రైవర్ నిర్లక్ష్యంతో 25 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణాలు శాస్త్రీయంగా అన్వేషించాలి ఘాట్‌రోడ్లపై భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఘాట్‌రోడ్లలో రహదారికి ఇరువైపులా బారియర్లు నిర్మించాలని రోడ్డు భద్రతా నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫైబర్ మిర్రర్స్ ఏర్పాటు చేసినా కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఘాట్‌రోడ్లపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతున్నాయి. ఆ ఘాట్ల గురించి క్షుణ్ణంగా తెలిసిన డ్రైవర్లనే నియమిస్తున్నాయి. ఘాట్‌రోడ్లపై కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరగ్గానే అందరూ డ్రైవర్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో కనుక్కోవాలి. అప్పుడే పరిష్కార మార్గాలు ఆలోచించగలం.. రోడ్డు తీరుతెన్నులు, డ్రైవింగ్‌కి ప్రతికూల పరిస్థితులు, వాహన సామర్థ్యం, మితిమీరి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, రోడ్డు నిబంధనల్ని సరిగా పాటించకపోవడం, డ్రైవర్‌కున్న సామర్థ్యం వంటివి కూడా బస్సు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందుకే ఒక ప్రమాదం జరగగానే కేవలం డ్రైవర్‌నే బోనులో ఉంచకుండా క్షుణ్ణంగా అన్ని అంశాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది‘ అని ట్రాన్స్పోర్ట్ ప్లానర్ ప్రొఫెసర్ ఎన్. రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ‘రోడ్డు ప్రమాదం జరగ్గానే ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ కేసు క్లోజ్ చేసేస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శ, వారికి నష్టపరిహారం చెల్లించి మన నేతలు చేతులు దులిపేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రమాదానికి గల కారణాలను శాస్త్రీయంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది‘ అని రోడ్డు భద్రతా నిపుణుడు రోహిత్ బలూజా అంటున్నారు. -
ఘాట్ రోడ్డులో ప్రమాదం: 15 మందికి గాయాలు
వలేటివారిపాలెం : ప్రకాశం జిల్లాలో ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టిన సంఘటన శనివారం జరిగింది. నెల్లూరుజిల్లా రాజుపాలెంకు చెందిన భక్తులు 30 మంది డీసీఎం వ్యాన్‌లో వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి తరలివచ్చారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా ఈ మధ్యాహ్నం వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.