మలుపులే ప్రాణాలు తీస్తున్నాయి | Accidents Are Occurring At Ghat Roads And Mountain Areas | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 9:31 PM | Last Updated on Tue, Sep 11 2018 9:34 PM

Accidents Are Occurring At Ghat Roads And Mountain Areas - Sakshi

కొండల్లో, కోనల్లో ప్రయాణాలు ఎంత ఆహ్లాదాన్ని పంచుతాయో, దాని వెనుక అంతటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.  ఘాట్‌ రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.  దేశవ్యాప్తంగా గత మూడేళ్లుగా బస్సులు లోయల్లో పడిన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం గత ఏడాది బస్సు ప్రమాదాల్లో సగటున రోజుకి 29 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. బస్సు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలు ముందున్నాయి. ఇక హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో ప్రతీరోజూ ఏదో ఒక చోట బస్సు లోయలో పడిన ప్రమాదాల గురించే వింటున్నాం. 2017లో బస్సు ప్రమాదాల్లో  9,069 మంది మరణించారు. ఇందులో తమిళనాడులోనే అత్యధికంగా ప్రమాదాలు జరిగాయి. ఆ ఒక్క రాష్ట్రంలోనే గత ఏడాది 1856 మంది మరణించినట్టు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇక ఆ తర్వాత స్థానంలో ఉత్తప్రదేశ్‌ ఉంది. ఆ రాష్ట్రంలో గత ఏడాది 1406 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కర్ణాటకలో బస్సులు లోయలో పడిన ప్రమాదాల్లో 800 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ప్రమాదాలకు కారణాలు
ఘాట్‌ రోడ్లపై ప్రమాదాలకు చాలా కారణాలున్నాయి. కొండల్లో సన్నటి ఇరుకు దారులు, ప్రమాదకరమైన మలుపులు, చెత్త రోడ్లు,  వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, వేరే వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయడానికి డ్రైవర్లు ప్రయత్నించడం,  డ్రైవర్లు మద్యం సేవించడం వంటివి ఘాట్‌ రోడ్లపై ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.  మొత్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదకరమైన మలుపుల కారణంగా జరుగుతూ ఉంటే, డ్రైవర్‌ నిర్లక్ష్యంతో 25 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. 

కారణాలు శాస్త్రీయంగా అన్వేషించాలి
ఘాట్‌రోడ్లపై భద్రతాపరమైన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఘాట్‌రోడ్లలో రహదారికి ఇరువైపులా బారియర్లు నిర్మించాలని రోడ్డు భద్రతా నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫైబర్‌ మిర్రర్స్‌ ఏర్పాటు చేసినా కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఘాట్‌రోడ్లపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతున్నాయి. ఆ ఘాట్‌ల గురించి క్షుణ్ణంగా తెలిసిన డ్రైవర్లనే నియమిస్తున్నాయి. ఘాట్‌రోడ్లపై కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని రోడ్డు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏదైనా ప్రమాదం జరగ్గానే అందరూ డ్రైవర్‌ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అది సరైనది కాదు. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో కనుక్కోవాలి.

అప్పుడే పరిష్కార మార్గాలు ఆలోచించగలం.. రోడ్డు తీరుతెన్నులు, డ్రైవింగ్‌కి ప్రతికూల పరిస్థితులు, వాహన సామర్థ్యం, మితిమీరి ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం, రోడ్డు నిబంధనల్ని సరిగా పాటించకపోవడం, డ్రైవర్‌కున్న సామర్థ్యం వంటివి కూడా బస్సు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అందుకే ఒక ప్రమాదం జరగగానే కేవలం డ్రైవర్‌నే బోనులో ఉంచకుండా క్షుణ్ణంగా అన్ని అంశాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది‘ అని ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. రంగనాథన్‌ అభిప్రాయపడ్డారు. ‘రోడ్డు ప్రమాదం జరగ్గానే ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ కేసు క్లోజ్‌ చేసేస్తున్నారు. మృతుల కుటుంబాలకు పరామర్శ, వారికి నష్టపరిహారం చెల్లించి మన నేతలు చేతులు దులిపేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రమాదానికి గల కారణాలను శాస్త్రీయంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది‘ అని రోడ్డు భద్రతా నిపుణుడు రోహిత్‌ బలూజా అంటున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement