రెండ్రోజుల క్రితం ఘాట్‌రోడ్‌లో బ్రేకులు ఫెయిలై నిలిచిన బస్సు వద్ద వేచిచూస్తున్న ప్రయాణికులు
తూర్పుగోదావరి, చింతూరు/మారేడుమిల్లి: చింతూరు, మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తుపల్లాలు, మలుపులు ఓ పక్క.. రాతికొండ మరో పక్క లోతైన లోయలో హొయలు తిరుగుతూ ప్రవహించే జలపాతాలు, మధ్యలో వ్యూ పాయింట్లు ఈ ఘాట్‌రోడ్ సొంతం. ఇక మారేడుమిల్లి మండలం పాములేరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు ఈ అందాలన్నీ ప్రయాణికులను కనువిందు చేస్తాయి. ఇదంతా నాణేనికి ఒకవైపే. అదే ఘాట్‌రోడ్‌లో అడుగడుగునా ఆపదలు పొంచి ఉన్నాయి. చింతూరు, రంపచోడవరం ఆర్‌అండ్‌బీ సబ్ డివిజన్‌లో ఉండే ఈ ఘాట్‌రోడ్ 25 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్‌లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీలోని ఘాట్‌రోడ్‌లు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లోయ వైపు పొంచి ఉన్న ప్రమాదం
ఘాట్‌రోడ్ పొడవునా ఓవైపు లోతైన లోయ ఉంది. దీని వైపు రక్షణగోడలు, ప్రమాదాన్ని తెలిపే సూచికలు లేకపోవడంతో చాలా వాహనాలు లోయలో పడి అనేకమంది దుర్మరణం చెందారు. గతంలో పలుచోట్ల నిర్మించిన రక్షణ గోడలు రహదారుల వెడల్పు, వర్షాలకు కొట్టుకొచ్చిన మట్టితో పూడుకుపోయాయి. మూడేళ్లక్రితం ఘాట్‌రోడ్ వెడల్పు చేసినా నేటికీ రక్షణ గోడలు నిర్మించలేదు. దీంతో చాలా వాహనాలు ఘాట్‌రోడ్ ఎక్కేటప్పడు, దిగేటప్పుడ అదుపుతప్పి లోయలోకి పడిపోతున్నాయి. ఘాట్‌రోడ్ దిగే సమయంలో హై గేర్‌లో నెమ్మదిగా దిగాలనే నిబంధన ఉన్నా డీజిల్ మిగులుతుందనే ఆశతో డ్రైవర్లు న్యూట్రల్‌లో దింపుతున్నారు. దీంతో వాహన వేగం పెరిగి మలుపుల వద్ద అదుపుతప్పి లోయలోకి, కిందనున్న రహదారిపై పడి ప్రాణాపాయం సంభవిస్తోంది. మరోవైపు వివిధ డిపోల నుంచి విలీన మండలాలకు సరైన ఫిట్‌నెస్ లేని బస్సులు తిప్పుతుండడంతో పలుమార్లు అవి మొరాయిస్తున్నాయి. ప్రధానంగా ఇటీవలి కాలంలో బ్రేకులు ఫెయిలై అనేక బస్సులు నిలిచిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరోవైపు ఘాట్‌రోడ్‌లో కొన్నిచోట్ల ఏడు మీటర్లు, మలుపుల వద్ద ఐదున్నర మీటర్ల వెడల్పు మాత్రమే ఉండడంతో వాహనాల ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి.
ఘాట్‌రోడ్‌లో ప్రమాదాలెన్నో..
చింతూరు, మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకోవడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దుర్గగుడి సమీపంలోని గోపి టర్నింగ్ వద్ద విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న వ్యాను లోయలో పడి ఏడుగురు భవానీలు మృత్యువాత పడ్డారు. దుర్గగుడి సమీపంలోనే కూలీలతో వెళ్తున్న లారీ బోల్తాపడి ఐదుగురు పొగాకు కూలీలు మృతిచెందారు. గతేడాది డిసెంబర్‌లో చింతూరులో జరిగిన సువార్త కూటమిలో పాల్గొని టాటామేజిక్‌పై తిరిగి వెళుతుండగా అది లోయలో పడి కాకినాడ, సామర్లకోటకు చెందిన ఐదుగురు మృతిచెందారు. ఇజ్జలూరు సమీపంలో మలుపు వద్ద తీర్ధయాత్రలకు వెళ్లి భక్తులతో తిరిగి వస్తున్న బస్సు బోల్తాపడి తెలంగాణాకు చెందిన ఓ ప్రయాణికురాలు మృతిచెందింది. టైగర్‌క్యాంపు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో జెన్‌కోకు చెందిన ఇంజినీర్ మృతిచెందాడు.
రూ.38 కోట్లు మంజూరయ్యాయి
మారేడుమిల్లి నుంచి చింతూరు వరకు రహదారుల మరమ్మతుల నిమిత్తం రూ.38 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈ నిధులతో ఘాట్‌రోడ్‌లో మలుపుల వద్ద రహదారి వెడల్పు, రక్షణగోడలు నిర్మించాల్సి ఉంది. అటవీశాఖ అభ్యంతరాల వల్ల పనులు ఆలస్యమవుతున్నాయి. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.– గణేష్, చింతూరు ఆర్‌అండ్‌బీ డీఈ
Comments
Please login to add a commentAdd a comment