27 కిలోమీటర్లు 20 ప్రమాదకర మలుపులు | Karnatak People Died in Ghat Road Accident East Godavari | Sakshi
Sakshi News home page

కాటేసిన ఘాట్‌..

Published Wed, Oct 16 2019 1:32 PM | Last Updated on Wed, Oct 16 2019 1:32 PM

Karnatak People Died in Ghat Road Accident East Godavari - Sakshi

ఘాట్‌ రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనం

వారందరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించిన వారు జిల్లాలోని అన్నవరం సత్యదేవుని దర్శనానికి పయనమయ్యారు. చింతూరు– మారేడుమిల్లిలో వీరు ప్రయాణిస్తున్న టూరిజం టెంపో వాహనం ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

రంపచోడవరం/మారేడుమిల్లి: జిల్లాలోని ప్రధాన దేవాలయాలను సందర్శించేందుకు వచ్చిన కర్ణాటక యాత్రికుల బృందం పర్యటన విషాదంతమైంది. ఏజెన్సీ అందాల చుట్టూ ఉన్న జలపాతాలను, ఎత్తయిన కొండలను, వాటి పక్కనే ఉన్న లోయలను చూస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పులకించిపోతున్న యాత్రికుల ప్రాణాలు కనురెప్పపాటులో గాలిలో కలిసిపోయాయి. మరో ఐదు నిమిషాలు ప్రయాణం చేస్తే ప్రమాదకరమైన ఘాట్‌ రోడ్డు దిగువకు వచ్చే వారే. అంతలోనే అనుకొని ప్రమాదం జరిగిపోయింది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డుపై ప్రయాణం ఎంత ప్రమాదకరమైందో మరోసారి రుజువైంది. ఇటీవల పర్యాటకులతో గోదావరిలో మునిగిన ప్రైవేట్‌ టూరిజం బోటు సంఘటన మరువక ముందే మరో సంఘటన జరగడంతో ఏజెన్సీలో విషాదం అలముకుంది.

కనురెప్ప పాటులో ప్రమాదం
కర్ణాటకు చెందిన యాత్రికులు 24 మంది రెండు వాహనాల్లో శనివారం రాష్ట్రంలోని దేవాలయాలను దర్శించుకునేందుకు బయల్దేరారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా సెలికేరు నుంచి పయనమయ్యారు. ఏపీకి చెందిన వాహనాలను అద్దెకు తీసుకున్నారు. యాగంగి బసవన్న దగ్గర నుంచి మహానంది నుంచి ప్రారంభమైన వీరి యాత్ర భద్రాద్రి రామచంద్రుడి దర్శనం ముగించుకుని అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వెళుతుండగా ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఐదుగురు, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కుంచం రమేష్, (56), కుంచం అమృతవాణి (48), మేడా గాయిత్రమ్మ(52), మేడా శ్వేత(25), మేడా శ్రీనివాసు(65), మేడా మధురాక్షమ్మ(56), మేడా రామలక్ష్మ
మ్మ(42) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్ర, స్వల్పగాయాలతో బయటపడ్డారు.

రోడ్డుపై నిలిచిన వాహనాలు
ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరగడంతో సుమారు గంట పాటు మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌ రోడ్డు వాహనాలు నిలిచిపోయాయి. మారేడుమిల్లి పోలీసులు స్థానికుల సహాయంతో ప్రమాదంలో నుజ్జునుజ్జయిన వాహనాన్ని పక్కకు తొలగించారు. జిల్లా కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంపచోడవరం ఐటీడీఏ నిషాంత్‌కుమార్, ఏఎస్పీ వకుల్‌ జిందాల్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్‌ సూచనలతో ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా ఘటన స్థలానికి చేరుకున్నాయి. మారేడుమిల్లి పీహెచ్‌సీకి ఏజెన్సీ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సిబ్బంది చేరుకుని వైద్యపరంగా అందించాల్సిన సేవలపై సత్వరం స్పందించి అత్యవసర వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాలకు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగింత
రాజమహేంద్రవరం క్రైం :  మారేడుమిల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఏడు మృతదేహా లు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. మృతదేహాల వెంట మారేడుమిల్లి పోలీసులు, మృతుల బంధువులు ఉన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ టి. రమేష్‌ కిశోర్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ లక్ష్మీపతి, డాక్టర్‌ సునీల్‌ రాజు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

కర్నాటక తరలించేందుకు ఏర్పాట్లు
రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ టి.రమేష్‌ కిశోర్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు  మృతదేహాలు కర్నాటక తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాత్రికి పోస్టుమార్టం పూర్తి చేసి వీలైనంత త్వరగా బంధువులకు అప్పగిస్తామన్నారు.

అన్నవరం దర్శనం కాకుండానే..
కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా చెలికేరి గ్రామానికి చెందిన 24 మంది రెండు వాహనాలో (ఒక్కో వాహనానికి 12 మంది చొప్పున) ఈనెల 12న బయల్దేరామని ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిరలో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన రెండు వాహనాలు బుక్‌ చేసుకున్నామని, ఈ ప్రమాదంలో మృతి చెందిన కుందం రమేష్, (బావ), అమృతవాణి సోదరుడు గోవిందరాజు తెలిపారు. ముందు వాహనంలో తన బావ రమేష్, చెల్లెలు అమృతవాణి ఉన్నారని, తమ వాహనం వెనుక వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్‌ పరారయ్యాడని పేర్కొన్నారు. శనివారం బయలుదేరిన తాము మహానంది, శ్రీశైలం, భద్రాచలం దేవాలయాలు దర్శించుకొని అన్నవరం దేవాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిపారు. దర్శనం చేసుకోకుండానే తన చెల్లి అమృత వాణి, బావ కుందం రమేష్‌ మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  

కళ్లెదుటే ప్రమాదం జరిగిపోయింది
సెలికేరు నుంచి మహానంది వెళ్లాం. దర్శనం తరువాత రాత్రి అక్కడే బస చేశాం. భద్రాచలంలో సోమవారం రాత్రి బస చేసి మంగళవారం ఉదయం సీతారాములు వారి దర్శనం చేసుకున్నాం. అందరూ ఒకటి రెండుసార్లు దర్శనం చేసుకుని బాగా దర్శనమయిందని ఎంతో సంతోషం చెందారు. అన్నవరం ప్రయాణమై మార్గ మధ్యలో ప్రమాదంకు గురి కావడం ఎంతో కలిచివేసింది. అందరూ కలిసి వచ్చాం, సంతోషంగా అందరూ తిరిగి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. కళ్లేదుటే గాయాలు పాలైన వారు అర్తనాదాలు గుండెలను పిండేశాయి.– గోవిందరాజు, సెలికేరు.

డ్రైవర్‌ అవగాహన లోపంతో..
రంపచోడవరం/మారేడుమిల్లి:  భద్రాచలం నుంచి అన్నవరం బయల్దేరిన యాత్రికుల వాహనం మారేడుమిల్లికి 12 కిలోమీటర్ల దూరంలోని ఘాట్‌ రోడ్డులో ప్రమాదానికి గురైంది. మలుపును చూపుతున్న బోర్డును ఢీకొట్టుకుంటూ రోడ్డు అంచు నుంచి ఏటవాలుగా సుమారు వంద అడుగులు కిందికి వెళ్లిపోయింది. 13 మంది యాత్రికులతో ఉన్న టెంపో వాహనం రోడ్డును ఢీకొట్టిన వెంటనే వెనుక వైపున్న టెంపో తలుపు ఊడిపోవడంతో వెనుక భాగంలో ఉన్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.   ఘాట్‌ రోడ్డులో వాహనం నడిపిన అనుభవం లేకపోవడం, మలుపును సరిగా అంచనా వేయకపోవడంతో ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

27 కిలోమీటర్లు 20 ప్రమాదకర మలుపులు
మారేడుమిల్లి నుంచి భద్రాచలం వరకు 120 కిలోమీటర్లు దూరం ఉంటుంది. దీనిలో మారేడుమిల్లి నుంచి చింతూరు వరకు 27 కిలోమీటర్లు మేర ఘాట్‌ రోడ్డు ఉంటుంది. ఈ ఘాట్‌ రోడ్డులో 20 ప్రమాదకర మలుపులున్నాయి. పెద్ద పెద్ద లోయలున్న మలుపును దాటుకుంటూ వచ్చి యాత్రికులతో టెంపో డ్రైవర్‌ ఆఖరి ఘాట్‌ రోడ్డు మలుపునకు చేరుకున్న తరువాత ప్రమాదానికి గురైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement