భస్మాసుర హస్తమవుతున్న ఫిరాయింపులు
ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పక్షంలో విలీనమవడంతో మరోసారి పార్టీ ఫిరాయింపుల అంశంపై చర్చ తెరపైకి వచ్చింది. ఒక పార్టీనుంచి గెలిచిన ప్రజాప్రతినిధి మరో పార్టీలో చేరితే ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోతుందనే ఉద్దేశంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది. కానీ అధికారంలో ఉన్న పార్టీలు నిర్లజ్జగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజల దృష్టిలో ఎన్నికలు పలచనవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ, తెలం గాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు బాబు ఏమి చేశారు? రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను లాక్కొని, నోళ్ళు నొక్కే దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇప్పుడా సెగ వారికి తగులుతోంది. తీవ్ర ప్రమాదంలో పడిపోతున్నది.
తెలంగాణలో కాంగ్రెస్‌ను ఖతం చేస్తే ఎదురులేదనుకున్నారు కేసీఆర్. గతంలో టీడీపీ, సీపీఐ, వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఎంఎల్ఏలను తనలో కలిపేసుకున్న కేసీఆర్, ఈ అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొం తుల మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలను తమ పార్టీలోకి విలీనం చేసుకున్నారు. పార్లమెంటు ఎన్నికలలో తెలం గాణలో అనూహ్యంగా కాంగ్రెస్‌కు 3, బిజెపికి 4 సీట్లు రావడంతో ఖంగు తిన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణలో వచ్చిన ఫలితాలతో ఇప్పుడు బీజేపీ నాయకత్వం టీఆర్ఎస్ పని పట్టనున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు లేకుండా తిరుగులేని శక్తిగా ఎదుగుదామనుకున్న మమతా బెనర్జీకి చుక్కెదురై 18 సీట్లతో బీజేపీ పాగా వేయడంతో తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా పరిస్థితులు తారుమారయ్యాయి. అక్కడ వామపక్షాలు, కాంగ్రెస్‌లను తొక్కేసిన మమత, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనుంచి అదే పరిస్థితి ఎదుర్కోబోతుంది.
చంద్రబాబు కూడా ఏపీలో పార్టీ పిరాయింపులకు పెద్ద పీట వేయ్యడంతో ఆయన కూర్చున్న కొమ్మను ఆయనే నరుక్కున్నట్లు అయింది. ఆయన అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని కొందరికి మంత్రిపదవులు కట్టబెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల దెబ్బతిన్న జగన్ తాను అధికారంలోకి వచ్చాక ఫిరాయింపులను ప్రోత్సహించనని ప్రకటిం చడం ఆహ్వానించదగిన పరిణామం. కానీ ఏపీ అసెం బ్లీలో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ అక్కడ ఫిరాయింపు ప్రక్రియ ద్వారా బలోపేతమయ్యేందుకు పావులు కదుపుతోందని చెబుతున్నారు. చెరపుకురా చెడెదవు అనే సామెతను పాలకులు గమనిస్తే మంచిది. వామపక్షాలు మినహాయిస్తే ప్రజాస్వామ్యంలో పార్టీల ఫిరాయింపులు నిత్యకృత్యమైనాయి.
టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలోకి మారడం సిగ్గుచేటు.
15 రోజుల క్రితమే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజా ప్రతినిధులు పార్టీ మారినప్పుడు విధిగా అదే రోజు వారి పదవి కోల్పోయే చట్టముండాలని అభిలషించారు. ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్(యు) పక్ష నాయకుడు, రాజ్యసభ ఎంపి శరద్‌యాదవ్ ఆ పార్టీని వీడిన కొద్ది రోజులకే రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న వెంకయ్య ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు. దేశమంతటా ఫిరాయింపులు తామరతంపరగా జరుగుతున్న సమయంలో అత్యంత వేగంగా తీసుకున్న ఈ చర్య ద్వారా వెంకయ్య అందరినీ ఆశ్చర్య చకితులను చేశారు. కానీ టీడీపీ రాజ్యసభ సభ్యుల వ్యవహారంలో వెంకయ్య పాత్ర దేశాన్ని నిర్ఘాం తపర్చింది. మాతృపార్టీ విలీనం ఊసే లేకుండా ఆరుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ఇచ్చిన లేఖ ఆధారంగా వారిని రాజ్యసభలోని బీజేపీ పక్షంలో శరవేగంగా విలీనం చేశారు. నాడు శరద్‌యాదవ్ పదవిని తొలగించడంలో చూపిన వేగాన్నే అధికార పక్షంలో ప్రతిపక్ష ఎంపీలను కలిపేయడంలో కూడా చూపిం చారు. ఫిరాయింపుదారుల పదవి.. పార్టీ మారిన రోజే పోవాలన్న వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఉన్న సభలో ఫిరాయింపులను ఇలా ధ్రువీకరించడం చాలా అన్యాయంగా ఉన్నది.
ఇక తన్నుతాను ఒక భిన్నమైన పార్టీగా చెప్పుకునే బీజేపీ పార్టీ ఫిరాయింపుల ఆధారంగానే బలోపేతమయ్యేందుకు బాటలు వేసుకుంటోంది. గోవాలో మహారాష్ట్ర గోమంతక్ పార్టీ శాసనసభా పక్షాన్ని, జార్ఖండ్‌లో జార్ఖండ్ వికాస్ పార్టీ ఎంఎల్ఏలను, మణిపూర్‌లో కాంగ్రెస్ ఎంఎల్ఏలను బీజేపీలో కలిపేసుకున్నది. ఇక కర్ణాటకలో త్వరలో ఎన్నికల అవసరం లేకుండానే తాము అధికారంలోకి రానున్నామని ప్రకటించింది. ఇప్పటికే ప్రతిపక్షాలను అణచివేసేందుకు ఫిరాయింపులను అండగా మార్చుకున్న టీఎంసీ, టీడీపీలు దానికే ఎలా ఎరగా మారుతున్నాయో, టీఆర్ఎస్లో బీజేపీ ఎలా గుబులు కలిగిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఫిరాయింపులకు ప్రోత్సహించిన పార్టీలకే అదే భస్మాసురహస్తంగా మారుతుండడం గమనిస్తున్నాం. బీజేపీ ప్రయోగిస్తున్న ఈ అస్త్రం ఎంతో కాలం పని చేయకపోవచ్చు. ప్రజా వ్యతిరేకత ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదని చరిత్ర చెబుతోంది.
వ్యాసకర్త సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ
చాడ వెంకట్‌రెడ్డి