Defense Company
-
అండగా ఉంటాం.. పెట్టుబడులతో రండి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రక్షణరంగ కంపెనీలకు అనుకూల పరిస్థితులు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. గత ఏడేళ్లలో ఈ వ్యవస్థ బాగా విస్తరించిందన్నారు. ఆదిభట్ల, నాదర్గుల్, జీఎంఆర్ ఏరోస్పేస్, హార్డ్‌వేర్ పార్క్, ఈ–సిటీ, ఇబ్రహీంపట్నం వంటి ప్రత్యేక ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ పారిశ్రామికవాడలు తెలంగాణలో ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని విజ్ఞప్తి చేశారు. అన్ని విధాలుగా సహకారం అందించి, అండగా ఉంటామని డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన రక్షణరంగ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో స్థానికంగా వెయ్యికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనదని, హైదరాబాద్ నగరానికి ‘మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియా’గా పేరు ఉందన్నారు. డీఆర్డీఓ, భెల్, హెచ్ఏఎల్ వంటి అనేక రక్షణరంగ సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (ఓఈఎం) కంపెనీలు ఒకేచోట ఇంత భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం మరొకటి లేదని తేల్చిచెప్పారు. లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్షణ రంగమే ప్రాధాన్యత ఏరోస్పేస్, డిఫెన్స్‌ను ప్రాధాన్యత రంగంగా గుర్తించి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సంస్కరణలను తెచ్చామని కేటీఆర్ తెలిపారు. టీఎస్–బీపాస్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ‘టాస్క్’ద్వారా ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చెప్పారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్‌లతో నగరంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమొచ్చిందన్నారు. -
నాలుగు డిఫెన్స్ కంపెనీల్లో వాటా విక్రయం
► ఐపీవో ద్వారా 25 శాతం వాటా ఉపసంహరణ ► రిజిస్ట్రార్ల కోసం బిడ్లు ఆహ్వానం; గడువు తేదీ 18 న్యూఢిల్లీ: రక్షణ రంగానికి చెందిన నాలుగు కంపెనీల్లో 25 శాతం వరకు వాటాలను ఐపీవో ద్వారా ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఉన్నాయి. వీటిలో 25 శాతం వరకు వాటాల ఉపసంహరణకు సంబంధించి రిజిస్ట్రార్లను ఆహ్వానిస్తూ పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీలోపు బిడ్లు సమర్పించాలని కోరింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారాలను ఈ విభాగం చూస్తుంటుంది. ఈ నాలుగు కంపెనీల్లో వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అనుమతించింది. తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ విభాగం మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల కోసం బిడ్లు కూడా పిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.72,000 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకుంది. ఇందులో రూ.46,500 కోట్లను మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, రూ.15,000 కోట్లు వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా, రూ.11,000 కోట్లు బీమా కంపెనీల లిస్టింగ్ ద్వారా సమీకరించనుంది. ఇప్పటికే పలు కంపెనీల్లో వాటాల విక్రయంతో రూ.8,000 కోట్ల సమీకరణ పూర్తయింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) మినీరత్న ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీడీఎల్ హైదరాబాద్ కేంద్రం గా పనిచేస్తోంది. గైడెడ్ క్షిపణులు, వాటి అనుబంధ రక్షణ పరికరాల తయారీలో ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి అధీకృత మూలధనం రూ.125 కోట్లు. 2015–16లో రూ.563 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ నికర విలువ రూ.1,652 కోట్లు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ... నేవీ, కోస్ట్‌గార్డ్‌లకు యుద్ధనౌకలు, సహాయక నౌకలను తయారు చేస్తోంది. అధీకృత మూలధనం రూ.125 కోట్లు. 2015–16లో లాభం 160 కోట్లు. నికర విలువ 1,064 కోట్లు. మజగాన్ డాక్ (ఎండీఎల్) ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మినీరత్న కంపెనీ ఇది. ప్రస్తుతం 3 భారీ యుద్దనౌకలు, ఒక సబ్‌మెరైన్ నిర్మాణ పనులను చూస్తోంది. 2016 మార్చికి అధీకృత మూలధనం రూ.323.72 కోట్లు. పెయిడప్ క్యాపిటల్ రూ.249 కోట్లు. 2015–16లో 637 కోట్ల లాభాన్ని ఆర్జించింది. నికర విలువ రూ.2,846 కోట్లు. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్న ఈ సంస్థ... మెటల్స్, అలాయ్స్ తయారీలో ఉంది. అధీకృత మూలధనం రూ.200 కోట్లు. 2015–16లో లాభం రూ.118 కోట్లు. నికర విలువ రూ.576 కోట్లు.