► ఐపీవో ద్వారా 25 శాతం వాటా ఉపసంహరణ
► రిజిస్ట్రార్ల కోసం బిడ్లు ఆహ్వానం; గడువు తేదీ 18
న్యూఢిల్లీ: రక్షణ రంగానికి చెందిన నాలుగు కంపెనీల్లో 25 శాతం వరకు వాటాలను ఐపీవో ద్వారా ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఉన్నాయి. వీటిలో 25 శాతం వరకు వాటాల ఉపసంహరణకు సంబంధించి రిజిస్ట్రార్లను ఆహ్వానిస్తూ పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ప్రకటన జారీ చేసింది.
ఈ నెల 18వ తేదీలోపు బిడ్లు సమర్పించాలని కోరింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారాలను ఈ విభాగం చూస్తుంటుంది. ఈ నాలుగు కంపెనీల్లో వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అనుమతించింది. తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ విభాగం మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల కోసం బిడ్లు కూడా పిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.72,000 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకుంది. ఇందులో రూ.46,500 కోట్లను మైనారిటీ వాటాల విక్రయం ద్వారా, రూ.15,000 కోట్లు వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా, రూ.11,000 కోట్లు బీమా కంపెనీల లిస్టింగ్ ద్వారా సమీకరించనుంది. ఇప్పటికే పలు కంపెనీల్లో వాటాల విక్రయంతో రూ.8,000 కోట్ల సమీకరణ పూర్తయింది.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)
మినీరత్న ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీడీఎల్ హైదరాబాద్ కేంద్రం గా పనిచేస్తోంది. గైడెడ్ క్షిపణులు, వాటి అనుబంధ రక్షణ పరికరాల తయారీలో ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి అధీకృత మూలధనం రూ.125 కోట్లు. 2015–16లో రూ.563 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ నికర విలువ రూ.1,652 కోట్లు.
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్
కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ... నేవీ, కోస్ట్‌గార్డ్‌లకు యుద్ధనౌకలు, సహాయక నౌకలను తయారు చేస్తోంది. అధీకృత మూలధనం రూ.125 కోట్లు. 2015–16లో లాభం 160 కోట్లు. నికర విలువ 1,064 కోట్లు.
మజగాన్ డాక్ (ఎండీఎల్)
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మినీరత్న కంపెనీ ఇది. ప్రస్తుతం 3 భారీ యుద్దనౌకలు, ఒక సబ్‌మెరైన్ నిర్మాణ పనులను చూస్తోంది. 2016 మార్చికి అధీకృత మూలధనం రూ.323.72 కోట్లు. పెయిడప్ క్యాపిటల్ రూ.249 కోట్లు. 2015–16లో 637 కోట్ల లాభాన్ని ఆర్జించింది. నికర విలువ రూ.2,846 కోట్లు.
మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)
హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్న ఈ సంస్థ... మెటల్స్, అలాయ్స్ తయారీలో ఉంది. అధీకృత మూలధనం రూ.200 కోట్లు. 2015–16లో లాభం రూ.118 కోట్లు. నికర విలువ రూ.576 కోట్లు.