Deity
-
Supreme Court of India: ఆలయ భూహక్కులు దేవుడివే
న్యూఢిల్లీ: దేవాలయ భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని, పూజారి ఎప్పటికీ భూస్వామి కాలేడని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దేవాలయ ఆస్తులుగా ఉన్న భూముల నిర్వహణ మాత్రమే పూజారిదని, భూములన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భూమి హక్కులకు సంబంధించిన పత్రాలలో యజమాని అన్న కాలమ్‌లో ఆ ఆలయంలో కొలువు తీరిన దేవుడి పేరు రాయాలని, చట్టపరంగా దేవుడికే ఆ భూమిపై హక్కులుంటాయని న్యాయమూర్తులు చెప్పారు. పూజారులు, దేవస్థానంలో ఇతర సిబ్బంది ఆ దేవతామూర్తి తరఫునే పనులు నిర్వహిస్తారని, పూజారి ఎన్నటికీ కౌలుదారుడు కాలేడని భూ చట్టాలలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో దేవాలయ భూముల్ని పూజారులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరోధిస్తూ రెవెన్యూ రికార్డుల నుంచి పూజారి పేరుని తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లను హైకోర్టు కొట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కింది. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ దేవాలయ భూముల నిర్వహణ, పరిరక్షణ మాత్రమే పూజారి విధి అని ఒకవేళ తన విధుల్ని నిర్వర్తించడంలో విఫలమైతే మరొకరికి అప్పగించే అవకాశాలు ఉండడం వల్ల ఆయనను భూస్వామిగా చెప్పలేమంది. రెవెన్యూ రికార్డుల్లో పూజారి, మేనేజర్ల పేర్లు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
గ్రామ దేవత ఆదేశం.. ఊరు మొత్తం ఖాళీ
బెంగళూరు : గ్రామ దేవత మారమ్మ దేవి అదేశించిందని గ్రామం మొత్తం ఖాళీ అయిన ఘటన తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. కరోనా వైరస్ ప్రమాదం ఉందని, ఈ వైరస్‌ను అరికట్టడానికి మూడు రోజుల పాటు ఊరిలో ఎవరూ ఉండకూదని మారమ్మదేవి భవిష్యవాణి చెప్పడం జరిగిందని గ్రామస్తులు చెప్పారు. దీంతో ఊరికి వెళ్లే దారిని పూర్తిగా ముళ్ల కంచెను వేసిన గ్రామస్తులు ఊరి చివరి చిన్నపాటి డేరాలు వేసుకున్నారు. గ్రామంలో ఉన్న పెద్దలు, వృద్ధులు, చిన్నారులు, కోళ్లు, మేకలు, పశువులను కూడా ఊరి బయటకు తరలించారు. దీంతో ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారింది. -
‘డైటీ’గా హాలీవుడ్‌కు ‘కహానీ’
యష్‌రాజ్ ఫిల్స్మ్ ప్రకటన న్యూఢిల్లీ: బాలీవుడ్లో విజయవంతమైన ‘కహానీ’ సినిమాను ‘డైటీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రీమేక్ చేయనున్నట్లు సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. కహానీ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించగా, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కాగా, దీన్ని ఇంగ్లిష్‌లో నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు వైఆర్ఎఫ్ సన్నాహాలు చేస్తోంది. నీల్స్ ఇంతకుముందు‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా, ‘డైటీ’సినిమాలో ఒక అమెరికన్ యువతి తన భర్త కోసం ఇండియా వచ్చి కోల్‌కతాలో అన్వేషిస్తుంది. ఆమె నిజం తెలుసుకునేసరికి, తాను అపాయంలో చిక్కుకున్నట్లు అర్థమవుతుంది. ఆ పరిస్థితులనుంచి ఆమె ఎలా బయటపడింది.. అసలు ఆమె భర్త దొరికాడా.. లేదా అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వైఆర్ఎఫ్ వర్గాలు తెలిపాయి. 2015 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా మొత్తం కోల్‌కతాలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఒప్లేవ్ మాట్లాడుతూ సినిమా ఆద్యం తం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ఇం దులోని ప్రతిపాత్రకు ప్రాధాన్యముంటుందన్నారు. దీనిలో భిన్న ధృవాలవంటి అమెరికన్ -ఇండియన్ సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని, దాని వల్ల హీరోయిన్ ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తనదైన శైలిలో చూపించనున్నట్లు ఒప్లేవ్ వివరించారు. ఈ సినిమాలో కోల్‌కతా నగరాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో ఉదయ్ చోప్రా మాట్లాడుతూ..‘కహానీ’ చిత్రాన్ని ‘డైటీ’గా రీమేక్ చేయడానికి నీల్స్ మాత్రమే సమర్థుడని పొగడ్తలతో ముంచెత్తారు. తన సినిమా రీమేక్‌పై ఘోష్ మాట్లాడుతూ..‘కొంత కాలం కిందట ‘కహానీ’ని ఇంగ్లిష్‌లో రీమేక్ చేస్తానని ఉదయ్ చెబితే సరదాగా అంటున్నాడనుకున్నా కాని వాళ్లు ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని తెలుసుకుని చాలా ఆనందించా.. నీల్స్ మంచి డెరైక్టర్. ప్రపంచ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ‘కహానీ’ని మలిచే సామర్థ్యం అతడికి ఉంది’ అని కితాబు ఇచ్చాడు. -
ఏ మతానికీ ప్రచారం చేయొద్దు
కేంద్రం, ఆర్బీఐలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం నాణాలపై మతచిహ్నాల ముద్రణపై వివరణ ఇవ్వాలని నిర్దేశం న్యూఢిల్లీ: హిందూ, ముస్లిం, క్రైస్తవం సహా ఏ మతాన్నీ ప్రోత్సహించినట్లుగా, ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించొద్దని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు లౌకికత్వం అనే దానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. కరెన్సీ నాణాలపై మతానికి సంబంధించిన చిహ్నాలు, చిత్రాలను ముద్రించడంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వు బ్యాంకులను ఆదేశించింది. తాంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రభుత్వం.. ఆ ఆలయం చిత్రంతో ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది. అలాగే, వైష్ణోదేవి ఆలయ బోర్డుకు సంబంధించిన బొమ్మతో 2013లో రిజర్వుబ్యాంకు ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది. దీనిని ప్రశ్నిస్తూ.. ఢిల్లీకి చెందిన నఫీస్ ఖాజీ, అబు సయీద్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నాణాలపై మతానికి చెందిన చిహ్నాలు, చిత్రాలు రాజ్యాంగ మూల సూత్రమైన లౌకికతత్వానికి విఘాతం కలిగిస్తాయని.. ఆ నాణాలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి (ప్రభుత్వానికి) చెందిన స్థిర, చరాస్తులు వేటిపైనా మతాలకు సంబంధించిన చిహ్నాలను ముద్రించకుండా, వినియోగించకుండా... ఒక జాతీయ పాలసీని రూపొందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.