కేంద్రం, ఆర్‌బీఐలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
నాణాలపై మతచిహ్నాల ముద్రణపై వివరణ ఇవ్వాలని నిర్దేశం
న్యూఢిల్లీ: హిందూ, ముస్లిం, క్రైస్తవం సహా ఏ మతాన్నీ ప్రోత్సహించినట్లుగా, ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించొద్దని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు లౌకికత్వం అనే దానికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. కరెన్సీ నాణాలపై మతానికి సంబంధించిన చిహ్నాలు, చిత్రాలను ముద్రించడంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వు బ్యాంకులను ఆదేశించింది.
తాంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రభుత్వం.. ఆ ఆలయం చిత్రంతో ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది. అలాగే, వైష్ణోదేవి ఆలయ బోర్డుకు సంబంధించిన బొమ్మతో 2013లో రిజర్వుబ్యాంకు ఐదు రూపాయల నాణాన్ని విడుదల చేసింది.
దీనిని ప్రశ్నిస్తూ.. ఢిల్లీకి చెందిన నఫీస్ ఖాజీ, అబు సయీద్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నాణాలపై మతానికి చెందిన చిహ్నాలు, చిత్రాలు రాజ్యాంగ మూల సూత్రమైన లౌకికతత్వానికి విఘాతం కలిగిస్తాయని.. ఆ నాణాలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
దేశానికి (ప్రభుత్వానికి) చెందిన స్థిర, చరాస్తులు వేటిపైనా మతాలకు సంబంధించిన చిహ్నాలను ముద్రించకుండా, వినియోగించకుండా... ఒక జాతీయ పాలసీని రూపొందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది.
తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.
ఏ మతానికీ ప్రచారం చేయొద్దు
Published Thu, Mar 20 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement