ఉప ముఖ్యమంత్రికీ నోటీసులిస్తాం: ఏసీబీ
ఢిల్లీ మహిళ కమిషన్‌లో ఇష్టం వచ్చినట్లు అక్రమంగా నియామకాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌పై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఈ విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నామని, దీంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తామని ఏసీబీ చీఫ్ ఎంకే మీనా తెలిపారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కూడా ఈ కేసులో నోటీసులు ఇస్తామని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (డి), ఐపీసీలోని 409, 120బి, సెక్షన్ల కింద స్వాతి మలివాల్‌పై కేసులు నమోదు చేసినట్లు మరో అధికారి వెల్లడించారు. స్వాతిని ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం దాదాపు రెండు గంటల పాటు ప్రశ్నించారు. దాంతోపాటు మరో్ 27 ప్రశ్నలు చేతికిచ్చి, వాటికి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని తెలిపారు.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ బర్ఖా శుక్లా సింగ్ చేసిన ఫిర్యాదుతో ఏసీబీ స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో మహిళా కమిషన్‌ను నింపేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. తగిన అర్హతలు లేకుండా కమిషన్‌లో చేరిన 85 మంది పేర్లను కూడా ఆమె జత చేశారు. మహిళా కమిషన్‌లో అంతమందిని ఎలా నియమించారంటూ తనను వాళ్లు ప్రశ్నించారని స్వాతి మలివాల్ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన నవీన్ జైహింద్ భార్యే స్వాతి. ఇటీవలి కాలంలో మహిళా భద్రతపై తాము పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నామని, తమ నోరు మూయించడానికే ఇలా చేస్తున్నారని ఆమె ఆరోపించారు.