రైలు ఎక్కగానే థ్రిల్ అవుతారు!
న్యూఢిల్లీ: రైలు బోగిలోకి ఎక్కగానే మంద్రంగా వినిపించే సంగీతం నేపథ్యంలో నవ్వుతూ చూడచక్కని భామ గులాబీ పువ్వుతో స్వాగతం చెబితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇదంతా త్వరలో నిజం కాబోతోంది. విమానంలో మాదిరిగానే రైళ్లలోనూ సేవికలు(హోస్టెస్) కనిపించనున్నారు. ట్రైన్ హోస్టెస్ లను నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ముందుగా ఢిల్లీ-ఆగ్రా గాటిమాన్ ఎక్స్ ప్రెస్ లో సేవికలను నియమించనున్నారు. ఈ నెల 25న ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ లో ఈ అంశాన్ని మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించనున్నారు.
దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు ఇది. వచ్చే నెలలో ప్రారంభించనున్న ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్ లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విమానాల్లో మాదిరిగానే సేవికలను నియమిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు.