Delhi-assembly-elections -2015
-
మళ్లీ ఢిల్లీ ఎన్నికల బరిలో లిల్లీ
న్యూఢిల్లీ: మళ్లీ ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో హిజ్రా రమేష్‌కుమార్ లిల్లీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మంగోల్‌పురి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఇప్పుడు ‘ఇండియన్ బహుజన సమాజ్‌వాదీ శక్తి’ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. గెలుపోటములు తనకు ముఖ్యం కాదని, తన వర్గం గుర్తింపు కోసమే పోటీ చేస్తున్నాని ఆమె పేర్కొన్నారు. ‘‘ప్రతిసారీ పురుషుడికో లేక మహిళకో అవకాశం ఇస్తున్నారు. ఈ సారీ నాకు అవకాశం ఇవ్వండి. ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన పిల్లలు, బంధువుల కోసమే పని చేస్తాడు. నాకు ఎవ్వరూ లేరు. మధ్యతరగతి, పేద ప్రజల కోసం నేను పని చేస్తాను’’ అంటూ ఆమె ప్రచారం చే స్తున్నారు. ఈ సారి ఢిల్లీ ఎన్నికల బరిలో 673 మంది నిలవగా రమేష్‌కుమార్ ఒక్కడే హిజ్రా. -
బేడీ ర్యాలీకి మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మొదటిసారిగా త్రిలోక్‌పురిలో చేపట్టిన ఎన్నికల ర్యాలీకి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. గత సంవత్సరం అక్టోబరులో జరిగిన అల్లర్ల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. ర్యాలీ ప్రారంభంలో కొద్ది మందే హాజరవ్వగా, వీధుల్లోకి వె ళ్లేకొద్ది ప్రజలు తమ ఇళ్ల తలుపులు, కిటికీలు మూసేసుకున్నారు. అయితే మరో వర్గం ప్రజలు పూలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి కిరణ్ వైద్, ఆప్ మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీలతో కలసి బేడీ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు చెప్పిన సమస్యలు సావ ధానంగా ఆలకించిన కిరణ్ బేడీ తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2013 శాసన సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి మనీష్ శిసోడియా భారీ మెజారిటీతో గెలిచారు. యువత కోసం ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టో ప్రకటించకపోయినా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మాత్రం తన సొంత ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. మహిళల రక్షణ కోసం బుధవారం ప్రత్యేక కార్యక్ర మం ప్రకటించిన ఆమె తాజాగా యువత అభివృద్ధికి 15 అంశాలతో మరో కార్యక్ర మం చేపడతామని ప్రకటించారు. దీనిలో భాగంగా నగరంలోని క్రీడా ప్రాంగణాలు, సౌకర్యాలు యువత కోసం పూర్తి స్థాయిలో ఉపయోగిస్తామని తెలిపారు. అంతేకాకుండా అన్ని ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒకే ఛానల్ ద్వారా అనుమతులు ఇస్తామని ప్రకటించారు. -
నగరవాసులకు బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్
ఎన్నికల ప్రచారసభలో బీజేపీ మాజీ ఎంపీ సిద్ధూన్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలో ఉన్నందువల్ల నగరవాసులు ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీని ముఖ్యమంత్రిని చేయగలిగితే వారికి బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్ దక్కినట్టేనని బీజేపీ మాజీ ఎంపీ సిద్ధూ పేర్కొన్నారు. పశ్చిమఢిల్లీలోని తిలక్‌నగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సందర్భంగా స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మీరు ప్రధానిగా మోదీని ఎన్నుకున్నారు.ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కిరణ్‌బేడీని ఎన్నుకోండి. బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఇదే’ అని అన్నారు. ఇక ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులపాలన గురించి ప్రస్తావిస్తూ సింహాన్ని బదులు కోతిని ఎన్నుకుంటే అన్నీ ఇటువంటివే జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు ఆప్ ఇస్తున్న విద్యుత్, తాగునీటి చార్జీల తగ్గింపు, ఉచిత వైఫై తదితర హామీల సాధ్యాసాధ్యాలపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.‘ఇందుకు నిధులు ఎక్కడినుంచి వస్తాయి. ఇంటి కిరాయే చెల్లించలేని కేజ్రీవాల్ డబ్బు ఎక్కడినుంచి తీసుకొస్తారు’ అంటూ నిలదీశారు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు మధ్య జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ నగరం దేశానికి గుండె వంటిదని అభివర్ణిస్తూ ఈ నగర అభివృద్ధి చెందడమనేది దేశాభివృద్ధికి అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ అనురాగ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి తోడుంటే ఆధిక్యం మీ వెంటే
స్పష్టం చేస్తున్న మాదీపూర్ ప్రజలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో రసవత్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, ప్రజలు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. అలాగే మాదీపూర్ నియోజకవర్గ అభ్యర్థుల విజయం కూడా అభివృద్ధి చుట్టే తిరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాలనలో ఈ నియోజకవర్గం కనీస వసతులకు కూడా నోచుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ జనం 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీలు హోరాహోరాగా తలపడినా, అంతిమంగా స్వల్ప(1,100 ఓట్లు) మెజార్టీతో ఆప్ అభ్యర్థి గట్టెక్కారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొంది. మాజీ మంత్రి గట్టెక్కేనా సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పారిశ్రామిక మాజీ మంత్రి గిరీష్ సోనీయే మళ్లీ ఆప్ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2013లో ఘోరంగా ఓడిపోయిన రామ్ గాంగ్వాల్ మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ ఈ సారి వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థి రాజ్‌కుమార్ ఫుల్వారియాను రంగంలోకి దింపింది. క్రితం స్వల్ప తేడాతో ఓడిన బీజేపీ ఈ సారి కచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉంది. ‘సోని నియోజకవర్గంలో చురుకుగా పని చేశారు. కానీ వాస్తవానికి మంత్రి ఆప్‌కు బలోపేతానికే పాటుపడ్డారు’ అని రఘవీర్ నగర్‌కి చెందిన కేశవ్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు. అనధికార కాలనీల పునరుద్ధరణ కలిసొచ్చేనా ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్యే పోటీ ఉంటోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోడ్లు, బస్తీలు, అనధికార కాలనీల పునరుద్ధరణ వంటి పనులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ పార్టీలు భావిస్తున్నాయని వివరిస్తున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 44 కాలనీలను పునరుద్ధరించిన విషయాన్ని బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలు ఎంతో ఉపశమనం పొందారని వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ...గాంగ్వాల్కే మళ్లీ అవకాశమిచ్చింది. కానీ ఆయన ఇప్పటికీ ప్రజల్లో మమేకం కాలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. మోదీ కరిష్మాకు పరీక్ష, ఆప్‌కు జీవన్మరణ సమస్య, కాంగ్రెస్ ‘ఇజ్జత్ కా సవాల్’ అయిన ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరివైపు నిలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. -
బీజేపీ ఆశలన్నీ ఓట్ల చీలికపైనే...!
కాంగ్రెస్‌కు మరిన్ని ఓట్లుపడితే లబ్ధి పొందవచ్చని అంచనా సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ... కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై కన్నేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకును చీల్చితే ప్రయోజనం దక్కుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరిన్ని ఓట్లు పడితే ఎక్కువ సీట్లు తమ ఖాతాలో పడతాయని వారు అంటున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్‌షోకి స్థానికులు పెద్దసంఖ్యలో రావడం తమకు లాభిస్తుందనేది వారి యోచన. కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 18 శాతం ఓట్లు పడితే తమకు ఎక్కువ సీట్లు వస్తాయనేది పార్టీ వ్యూహకర్తల అంచనా. కాంగ్రెస్ ఓటు శాతం తగ్గితే మాత్రం ఆప్ లాభపడుతుందని వారు అంటున్నారు. దళితులు, ముస్లింలు, అనధికార కాలనీ, పునరావాసకాలనీవాసులను సంప్రదాయ కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా పరిగణించేవారు. అయితే గత ఎన్నికలలో వీరంతా ఆప్‌కు ఓటేశారు, దీంతో కాంగ్రెస్‌కు ఊహించనిరీతిలో దెబ్బతగిలింది. ఈ ఎన్నికల్లో దళితులు ముస్లింలు, అనధికార కాలనీవాసులు కనుక ఆప్ వైపు మొగ్గుచూపితే నష్టపోతామనే విషయాన్ని బీజేపీ గుర్తించింది. ఈ ఎన్నికల్లో మరిన్ని దళిత సీట్లను దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా ఆ వర్గానికి చెందిన కృష్ణతీరథ్‌ను పార్టీలో చేరుకుంది. అంబేద్కర్‌నగర్ రిజర్వ్డ్ సీటు నుంచి గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా గెలిచిన అశోక్‌కుమార్‌ను బీజేపీ ఈసారి తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కృష్ణతీరథ్ కారణంగా పటేల్‌నగర్, అశోక్‌కుమార్ కారణంగా అంబేద్కర్‌నగర్ నియోజకవర్గాలు తమ ఖాతాలో పడతాయనే నమ్మకంతో ఆ పార్టీ ఉంది. నగరంలో 16 శాతం మంది దళిత ఓటర్లున్నారు. షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేసిన 12 సీట్లతో పాటు మొత్తం 17చోట్ల జరిగే ఎన్నికలపై దళిత ఓట్ల ప్రభావం కనిపించనుంది. అనధికార కాలనీ క్రమబద్ధీకరణ దిశగా మోడీ సర్కారు చేపట్టిన చర్యల ఫలితంగా ఆయా ఓటర్లు మొగ్గుచూపవచ్చని కమలం భావిస్తోంది. మధ్యతరగతివారిని బీజేపీ సాధారణంగా తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోంది. అయితే గత ఎన్నికల్లో వారిలో కొంతమంది కేజ్రీవాల్‌వైపు మొగ్గు చూపారు. ఫలితంగా జాతీయ రాజధానిలో బీజేపీ...ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. దాదాపు ఐదుశాతం మంది మధ్యతరగతి ప్రజలు ఆప్‌కు ఓటేసినట్టు ఆ పార్టీ అంతర్గత నివేదికలు స్పష్టం చేశాయి. అయితే మధ్యతరగతి ఓటర్లకు ఆప్‌పై భ్రమలు తొలగిపోయాయనని బీజేపీ నేతలు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మధ్యతరగతి ఓట్లు తమకే పడ్డాయని బీజేపీ చెబుతోంది. ఈసారికూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని ఆ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. నరేంద్ర మోదీ పేరుబలం, ఇటీవలి ఒబామా పర్యటన మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకుంటాయని కమలదళం భావిస్తోంది. మహిళల ఓట్లు తమకే దకకుతాయన్న ధీమాతో బీజేపీ ఉంది. దేశంలో మొదటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడిని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం మహిళలను ఆకట్టుకుంటుందని వారు అంటున్నారు. మహిళల భద్రత కోసం కిరణ్ బేడీ తప్పక చర్యలు చేపడతారనే సకారాత్మక సందేశం మహిళలకు అందుతోందని వారు పేర్కొంటున్నారు, అకాలీదళ్‌తో పొత్తును కొనసాగించడంతోపాటు 1984 సిక్కుల అల్లర్ల బాధితులకు నష్టపరిహారాన్ని పెంచుతూ కేంద్రం చేపట్టిన చర్య, పలువురు సిక్కు నేతలు తమ పార్టీలో చేరడం కూడా లాభిస్తుందని కూడా ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.