డాక్టర్‌ను కొట్టి బౌన్సర్లకు వదిలేశాడు
న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు మికాసింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ వైద్యుడిపై దాడి చేసినట్లు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ ఆప్తామాలజికల్ సొసైటీ వారు ఢిల్లీ పుసా ఇన్స్టిట్యూట్ మేలా గ్రౌండ్లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న సదస్సులో మికా సింగ్‌తో కచేరి కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా తాను చెప్పినట్లు చేసేందుకు మికాసింగ్ ఆడియెన్స్నుంచి ఒకరిని స్టేజ్ మీదకు పిలిచాడు.
ఆ సమయంలో స్టేజ్ మీదకు అంబేద్కర్ ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తి వచ్చాడు. అతడు మికా సింగ్ చెప్పినట్లుగా చేయలేకపోవడంతో చిరాకుపడిన మికాసింగ్ పటపటా ఆ చెంప ఈ చెంపవాయించి బౌన్సర్ల చేతికి అప్పగించాడు. దీంతో వారు కూడా అతడిపై దాడి చేయడంతో అతడి ఎడమ చెవికి గాయాలవడంతోపాటు, శరీర అంతర్భాగాలకు కూడా గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్‌ను కొట్టిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌తోపాటు పలు సైట్లలో హల్చల్ చేస్తోంది.