కరెంటు ‘షాక్’
న్యూఢిల్లీ: కరెంటు చార్జీలు పెంచడానికి అనుమతించాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఎన్నికల సంఘానికి (ఈసీ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. టారిఫ్ ఖరారు చేసే ముందు బహిరంగ నోటీసులు జారీ చేసే ప్రక్రియకు దాదాపు నెల రోజులు పడుతుంది కాబట్టే ముందస్తుగా అనుమతి కోరుతున్నట్టు వివరణ ఇచ్చింది.
భారీ నష్టాల కారణంగా జాతీయ గ్రిడ్, ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు కొనుగోలు సాధ్యం కావడం లేదని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సి ల్ (ఎన్డీఎంసీ), విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) డీఈఆర్సీకి మొరపెట్టుకున్నాయి. కాబట్టి చార్జీలను పెంచాలని కోరాయి. డిస్కమ్‌లు ఖాతాలను తారుమారు చేసి కృత్రిమ నష్టాలను చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉండడంతో, వాటి ఖాతాలకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చార్జీలను 60 శాతం దాకా పెంచాలని అవి ప్రభుత్వాన్ని కోరుతుండడం విశేషం. ఒక్కో యూనిట్‌కు సగటున రూ.నాలుగు చొప్పున పెంచాలని ఇవి డీఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. కొత్త టారిఫ్ ఖరారైతే ఇది జూన్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. నిబంధనల ప్రకారం చార్జీల పెంపుపై అభ్యంతరాలు/సలహాలు/అభిప్రాయాలు కోరుతూ సంబంధిత సంస్థలు, వ్యక్తులు, ప్రజలను డీఈఆర్సీ సంప్రదిం చాల్సి ఉంటుంది.
ఇందుకు నోటీసులు జారీ చేయడంతోపాటు బహిరంగ సమావేశాలూ నిర్వహిస్తుంది. వీటిలో ప్రజలు సగటు రాబడి అవసరాల (ఏఆర్ఆర్) దరఖాస్తులపై అభిప్రాయాలు, సలహా లు, సూచనలు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగానూ తెలియజేయవచ్చు. వీటన్నింటినీ పరిశీలించాక డీఈఆర్సీ 2014-2015 ఆర్థిక సంవత్సరానికి కరెంటు టారిఫ్‌ను ఖరారు చేస్తుందని సంస్థ ఎన్నికల సంఘానికి పంపిన లేఖలో వివరించింది. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే కొత్త టారిఫ్‌ను అమలు చేస్తామని సంస్థ ప్రధాన నోడల్ అధికారి అంకుర్ గార్గ్ ఈసీకి వివరణ ఇచ్చారు.
భారీగా పెంపు కోరుతున్న డిస్కమ్‌లు
రాబోయే ఆర్థిక సంవత్సరంలో తనకు రూ.9,361 కోట్ల ఆదాయం (ఏఆర్ఆర్) అవసరమని రిలయ న్స్ అధీనంలో డిస్కమ్ బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) డీఈఆర్సీకి సమర్పించిన పిటిషన్లో పేర్కొంది. తనకు రూ.5,527 కోట్ల ఆదాయం కావాలని బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బీవైపీల్) కోరింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి తనకు రూ.6,079 కోట్ల నిధులు కావాలని టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) డీఈఆర్సీకి విన్నవించింది.
డిస్కమ్‌లు చూపిస్తున్న ఈ నష్టాలను డీఈఆర్సీ అంగీకరించి టారిఫ్ ఖరారు చేస్తే చార్జీలు ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి. వినియోగాన్ని బట్టి ఫిక్స్డ్ చార్జీలను 60 శాతం వరకు పెంచాలని, ఇంధన చార్జీలను గరిష్టంగా 18 శాతం దాకా పెంచాలని ఎన్డీఎమ్సీ కోరింది. ప్రతి నెలా 200 యూనిట్ల దాకా వాడుకునే వాళ్లకు యూనిట్‌కు రూ.3.90 చొప్పున, 2001- 400 యూనిట్ల వరకు రూ.ఐదు చొప్పున, 401-800 యూనిట్ల వరకు రూ.6.20 చొప్పున, 800 యూనిట్లు దాటితే రూ.తొమ్మిది చొప్పున పెంచాలని ఎన్డీఎమ్సీ డీఈఆర్సీని కోరిం ది.
ఇదిలా ఉంటే ఆదాయాల పెంపులో భాగంగా టైం ఆఫ్ ద డే (టీఓడీ) ప్రతిపాదనను కూడా డిస్కమ్‌లు ముందుకు తెచ్చాయి. ఈ ప్రతిపాదనల ప్రకా రం... విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో కరెంటు చార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తారు. అదే వినియోగం తక్కువగా ఉండే సమయంలో బిల్లులను కాస్త తగ్గిస్తారు. ఇక వినియోగం సాధారణంగా ఉండే సమయంలో అప్పటి వాతావరణానికి అనుకూలంగా రేట్లను నిర్ణయిస్తారు. దీని వల్ల అంతిమంగాా వినియోగదారుడే నష్టపోతాడనే వాదనలు ఉన్నాయి.