Delhi hospitals
-
ఢిల్లీలో ఆగని మృత్యుఘోష
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగింది. ఢిల్లీలోని తమ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ సరిపడ పీడనంతో సరఫరా కాకపోవడంతో కన్నుమూశారని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డీకే బలూజా చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల సమయానికి మా ఆస్పత్రిలో 200 మంది రోగులున్నారని, కేవలం అరగంటకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉందని ఆయన వెల్లడించారు. వీరిలో 80 శాతం మంది రోగులకు కృత్రిమ ఆక్సిజన్ అవసరమని, మిగతా వారిని ఐసీయూలో ఉంచామని చెప్పారు. ఇంకా కష్టాల్లోనే గంగారాం ఆస్పత్రి ‘మాకు రోజుకు 11వేల ఘనపు మీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ మా వద్ద కేవలం 200 ఘనపు మీటర్ల ఆక్సిజన్ ఉంది. రోగులు తమ సొంత ఆక్సిజన్ సిలిండర్లతో ఆస్పత్రిలో చేరుతున్నారు. అందరు ఉన్నతాధికారలు, నోడల్ అధికారులను కలిశాం. వందల ఫోన్‌కాల్స్ చేశాం. స్పందన శూన్యం. మరో రెండు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుంది’ అని పరిస్థితిని గంగారాం ఆస్పత్రి చైర్పర్సన్ డీఎస్ రాణా వివరించారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రమవడంతో కోవిడ్ బాధితుల మరణాలు పెరుగుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సాయంచేయండంటూ ఢిల్లీ ఆస్పత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా వేడుకుంటున్నాయి. ఏదో విధంగా ఆక్సిజన్ సరఫరాపై చర్యలు తీసుకోండంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి, జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి, బాత్రా ఆస్పత్రి, సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచాలి. లేదంటే ఆక్సిజన్సరఫరాను అడ్డుకునే ఏ వ్యక్తినైనా సరే మేం ఉరితీస్తాం. ఎవరికీ వదిలిపెట్టం’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీకి రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్రప్రభుత్వ హామీ ఇచ్చింది. కానీ గత కొద్ది రోజులుగా 380 మెట్రిక్ టన్నులఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. శుక్రవారం కేవలం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. వాల్వ్ మూసేయడంతో ఇద్దరి మృత్యువాత మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోగులకు ఆక్సిజన్‌ను పంపిణీ చేసే వాల్వ్‌ను ఎవరో మూసేయడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు కోవిడ్ పేషెంట్లు మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వాల్వ్ మూసేసి ఉన్న సమయంలో ఏ రోగీ కృత్రిమ ఆక్సిజన్‌పై లేరని ఆస్పత్రి సిబ్బంది చెబుతుండగా, ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడంతోనే ఇద్దరూ మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగనుంది. పంజాబ్‌లో ఆరుగురి మృతి కోవిడ్ బాధితులకు సరిపడ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అమృత్‌సర్‌లోని నీలకంఠ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కోవిడ్ బాధితులు శనివారం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మరణించారు. ఆక్సిజన్ కొరతపై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ స్పందించలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయితే, ఆక్సిజన్ కొరత తీవ్రతను పేర్కొనలేదని, కేవలం సంబంధిత వాట్సప్ గ్రూప్‌లో ఒక చిన్న మెసేజ్ మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం పంపిందని రాష్ట్ర వైద్య విద్య మంత్రి చెప్పారు. మృతి ఘటనపై పంజాబ్ సీఎం విచారణకు ఆదేశించారు. -
కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైద్యం చేయించుకోవాలంటే వ్యక్తిగత గుర్తింపు పత్రాలు తప్పనిసరి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి అవసరమైన గుర్తింపు పత్రాల జాబితాను ఢిల్లీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక శస్త్రచికిత్సలకు వీటి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి పద్మిని సింగ్లా ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హస్తిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలనుకునే వారు ఓటర్ ఐటీ, బ్యాంక్, పోస్టాఫీస్ పాస్‌బుక్, రేషన్ కార్డు, పాస్‌పోర్టు, ఆదాయపు పన్ను రిటర్న్, డ్రైవింగ్ లైసెన్స్, టెలిఫోన్, వాటర్, విద్యుత్ బిల్లులు.. వీటిలో ఏదోటి సమర్పించాల్సి ఉంటుంది. రోగి తల్లిదండ్రులు, భాగస్వాములకు సంబంధించిన ఇవే పత్రాలను కూడా ఆమోదిస్తారు. రోగి ఇచ్చిన చిరునామాకు వచ్చిన పోస్టల్ డిపార్ట్మెంట్ పత్రాలను కూడా వ్యక్తిగత ధ్రువీకరణగా పరిగణిస్తారు. జూన్ 7కి ముందు జారీ చేసిన ఆధార్ కార్డు మాత్రమే చెల్లుతుంది. రోగి మైనర్ అయితే తల్లిదండ్రుల పేరిట జారీ చేసిన ధ్రువపత్రాలను ఆస్పత్రులు అనుమతిస్తాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని 90 శాతం పడకలు స్థానికులకే కేటాయించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు 27,654 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 761 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ బారి నుంచి 10,664 మంది కోలుకోగా, 16,229 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ( కేజ్రీవాల్ కీలక నిర్ణయం) -
‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీయేతర ప్రజలు కూడా తమ రాష్ట్రానికి వచ్చి ఉచితంగా వైద్యం పొందుతున్నారు.. ఇది ఎక్కడి న్యాయం అంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. వివరాలు.. మంగోల్‌పురి ప్రాంతంలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో ట్రామా సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్.. ‘ప్రస్తుతం ఢిల్లీలో వైద్య సేవలు బాగా మెరుగుపడ్డాయి. దాంతో ఢిల్లీకి వచ్చే రోగుల సంఖ్య కూడా బాగా పెరిగింది. అయితే ఢిల్లీ వాసులకు వైద్యం అందడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో మెరుగైన వైద్యం లభిస్తుండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికే వస్తున్నారు. దాంతో ఢిల్లీవాసులకు వైద్యం ఆలస్యం అవుతోంది’ అన్నారు. ‘ఉదాహరణకు బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కేవలం రూ.500 పెట్టి టికెట్ కొని ఢిల్లీ వచ్చి.. రూ. 5లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నాడు. అంటే ఢిల్లీ ప్రజలకోసం ఉద్దేశించిన వాటిని ఇతరులు కూడా వినియోగించుకుంటున్నారు. వారు కూడా మన దేశ ప్రజలే కాబట్టి.. మనం అభ్యంతరం తెలపం. కానీ ఢిల్లీ దేశ ప్రజలందరికి సేవ చేయలేదు కదా’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మాటలు మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఓటమి భయంతో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదని విమర్శించారు. -
ఆస్పత్రుల పనితీరుపై ‘జంగ్’!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న తీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రులైన లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్, గురుతేజ్ బహదూర్ ఆస్పత్రుల రూపురేఖలు నెలరోజుల్లో మారిపోవాలన్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు కోర్టు ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనన్నారు. ఈ విషయమై నజీబ్ జంగ్ గురువారం ఢిల్లీ ఆసుపత్రుల పని తీరును సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి, ఢిల్లీ అసుపత్రుల ప్రతినిధులు, ఇన్స్పెక్టర్ల బృందం, లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయ సీనియర్ అధికారులతో ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఢిల్లీ ఆసుపత్రుల పనితీరును సమీక్షించారు. ఢిల్లీ అసుపత్రులను తనిఖీచేసిన ఇన్స్పెక్టర్లు సమర్పించిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సదుపాయాలను, ఓపీడీ సదుపాయాలను, మందుల లభ్యతను, పారిశుధ్యాన్ని, భద్రతను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతను లెఫ్టినెంట్ గవర్నర్ నొక్కి చెప్పారు. లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి, గురుతేజ్ బహదూర్ ఆసుపత్రులను మోడల్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దడం కోసం ఆయన ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఓ కమిటీని నియమించారు. ఆరోగ్య కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి సభ్యులుగా ఉన్న ఈ సంఘం ఈ రెండు ఆస్పత్రులను దత్తత తీసుకొని, వాటి పనితీరును, నిర్వహణను మెరుగుపరిచి నగరంలోని అత్యుత్తమ ఆస్పత్రుల స్థాయిలో నెలరోజుల్లో అభివృద్ధి చేయాలని జంగ్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు తమ ఇన్‌పేషెంట్ డిపార్ట్మెంట్లో 10 శాతాన్ని, ఓపీడీలో 25 శాతాన్ని పేద రోగుల ఉచిత చికిత్స కోసం కేటాయిస్తూ కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల పనితీరును పరిశీలించాలని లెప్టినెంట్ గవర్నర్ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. పేదరోగులకు కల్పించే ఈ సదుపాయాన్ని గురించిన సమాచారాన్ని ప్రైవేటు ఆస్పత్రుల బయట, రిసెప్షన్లో ప్రదర్శించేలా చూడాలని ఆయన ఆదేశించారు.